దేశంలో ఎక్కడా లేని విధంగా గొర్రెల పంపిణీ


  • గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం
  • 5వేల కోట్లతో గొర్రెల పంపిణీ
  • మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​
  • పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో సమావేశం

దేశంలో ఎక్కడా లేని విధంగా గొర్రెల పంపిణీ_harshanews.com
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్

హైదరాబాద్​:
దేశంలో ఎక్కడా లేని విధంగా గొర్రెల పంపిణీ చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ తెలిపారు. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రులు  తలసాని శ్రీనివాస్ యాదవ్,  కేటీఆర్,  ఎర్రబెల్లి దయాకర్ రావు,  మల్లారెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం కల్పించాలని ఈ సమావేశంలో మంత్రులు నిర్ణయించారు. 
          ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో అమలు చేస్తున్న కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  మంత్రి కేటీఆర్ చేసిన సూచన మేరకు శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులకు తమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ లేఖలు పంపుతామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. విజన్ కలిగిన ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తోనే 5 వేల కోట్ల రూపాయలతో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మాంసం, చేపలు ఎగుమతులు చేసే స్థాయికి అభివృద్దిని సాధిస్తుందని అన్నారు.
          మంత్రి కేటీఆర్​ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతనంగా భారీ ఎత్తున నీటి ప్రాజెక్టులు అందుబాటులో కి వస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్న కారణంగా రానున్న రోజులలో రాష్ట్రంలో మత్స్య సంపద ఎంతో వృద్ది చెందనున్నదని చెప్పారు. గొర్రెల పంపిణీతో రానున్న రోజులలో మాంసం ఉత్పత్తి కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నందున పశుసంవర్ధక శాఖ, పరిశ్రమల శాఖ సమన్వయంతో ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలను ఇప్పటి నుండే రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పశుసంవర్ధక శాఖ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో అనేక కార్యక్రమాలు చేపట్టిందని వాటి ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అనేక సానుకూల మార్పులు వస్తున్నట్లు ఆయన తెలిపారు.  కార్యక్రమాల కోసం సిరిసిల్ల జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న జల విప్లవం వలన పాలు, మాంసం, మత్స్య సంపద ఉత్పత్తి పెద్దఎత్తున పెరిగి క్షీర, శ్వేతా, నీలి విప్లవాలు తెలంగాణలో వస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ దిశగా పశుసంవర్ధక శాఖ మరియు గ్రామీణాభివృద్ధి , వ్యవసాయ శాఖ లతో కలిసి పరిశ్రమల శాఖ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చేందుకు,ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రయత్నం చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు.