గుప్పెడు మనసు

guppedumanasu_harshanews.com
గుప్పెడు మనసు 


 " గుప్పెడు మనసు " చెప్పడానికి గుప్పెడు ఉండే మనసు చేసే ఊహలెన్నో...ఎద సడిలో రేపే ఉప్పెనలెన్నో...అందులో టీనేజ్ కి చిలిపితనం తోడైతే... మది చేసే ఆరాటాలెన్నో..తొక్కేసే అధఃపాతాళాలెన్నో...

చిన్ని పొదరిల్లులాంటి కుటుంబంలోకి తుఫానులా దూసుకొచ్చిన విపరీత పరిస్థితులకు అద్దం పట్టిన నేపధ్యమే ఈ చిత్రరాజం.ప్రతీ ఇంట్లో ఉండే విశేషాలనే శేషమెరుగని ప్రశ్నలుగా మలచి సమాజంపై సంధించిన శరమే ఈ..."గుప్పెడు మనసు"

చిలిపితనం తప్ప కష్టమ్ అంటే ఎలా ఉంటుందో తెలియని కన్నెపిల్ల, సాటివారికి సహాయపడడం తప్ప మరో ఆలోచన లేని ఆధునిక భావాల రచయిత్రి, పురుషాహంకారంతో ఏం చేసినా చెల్లుతుందనుకునే ఒక ఆటవిక మానవుడు, అల్లుడు తప్పు చేసాడని తెలిసినా కూతుర్నే సర్దుకుపొమ్మనే ఓ సగటు తండ్రి. వీళ్ళందరి మధ్య కధానాయిక లోని స్వచ్ఛమైన మనసును మాత్రమే తరచి చూసి ప్రేమించే ఓ డాక్టర్...కేవలం అష్ట భూమికలతో పాటు కాలాన్ని కూడా ఒక పాత్రగా మలచి బాలచందర్ గారు నైపుణ్యంగా సమాజానికి చేసిన సవాల్ గా రంగరించి చేసిన చిత్రం "గుప్పెడు మనసు".

నటన నుంచి విరామం తీసుకున్న నటికి మరలా అవకాశమొస్తే ఆ భావోద్వేగంలో మరణించిన నటి కుమార్తెను అక్కున చేర్చుకుని తన జీవితాన్ని బలి చేసుకున్న ఒక మాతృమూర్తి గా సుజాత నటన,ఆమెలోని మానసిక సంఘర్షణ దర్శకులు తెరకెక్కించిన విధానం అద్భుతం.ఆపదలో ఆశ్రయం కోరి వచ్చిన పసి మనస్తత్వపు అమ్మాయిలో ఆడతనాన్ని చూసి ఆ పై తప్పు ఒప్పుకోని పురుషాధిక్య అహంకారానికి చిహ్నంగా శరత్ బాబు నటన నాటికీ నేటికీ సమాజంలో మిగిలిపోయిన పశుప్రవృత్తికి అద్దం పట్టే విధంగా తీర్చి దిద్దారు.

అల్లరి,చిలిపితనం,అమాయకత్వం తప్ప మరో ప్రపంచం తెలియక జీవితాన్ని వ్యర్ధం చేసుకుని బలిపశువైన టీనేజ్ అమ్మాయిగా సరిత మంచి పరిణతి చూపింది.ఇక మిగిలిన పాత్రలన్నీ సమాజంలో అడుగడుగునా కనిపించే మూసపోసిన పాత్రలే అయినా తమ తమ అస్థిత్వాలను నిలుపుకుంటూ కధా గమనానికి తోడ్పడ్డాయి.వీటితో పాటు ఎదిగీ ఎదగని పసి పాప మనస్సంఘర్షణ ఆ పసితనంపై కుటుంబ నేపధ్యపు ప్రభావాన్ని బాలనటి(పేరు తెలియదు) గా చేసిన సుజాత కూతురు పాత్ర తో సమాజానికి తెలియజేసిన విధానం బాగుంది.

ఇక పాట విషయానికొస్తే ప్లే బ్యాక్ సామ్గ్ గా మలచి కధకూ,పాటకూ సరైన ఫ్లేవర్ ఇచ్చారనే చెప్పవచ్చు. మనసు ఎవరిదైనా,ఎలాంటిదైనా ఆ యా సందర్భాలకు తగ్గట్టుగా ఉండే సాహిత్యం మన మాంత్రేయగారి కలం నుంచి వెలువడ్డంలో ఆశ్చర్యమేమీ లేదు కదా..అదే విధంగా గాన గంధర్వులు శ్రీ బాల మురళీ కృష్ణ గారి గాత్రం నుండి వెలువడే ఈ పాటలోని ప్రతీ పదం సమాజానికి ఏదో ఒక సందేశం ఇస్తున్నట్లే అనిపిస్తుంది.దాదాపు భగవద్గీతా సారామంతా ఈ ఒక్క పాటలోనే ఆత్రేయగారు రచించేసారా ....!!!! అనిపిస్తూంటుంది నాకు విన్నప్పుడల్లా...ఒక్కోసారి ఒక్కో అర్ధం స్ఫురిస్తూ.అందుకే మీరూ ఆస్వాదించండి.

  చిత్రం:  గుప్పెడు మనసు (1979)   
  సంగీతం:  యమ్మెస్ విశ్వనాథన్  
  సాహిత్యం:  ఆచార్య ఆత్రేయ       
 నేపథ్య గానం:  మంగళంపల్లి బాల మురళీకృష్ణ   

మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా

చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో యెందుకు వగచేవో
ఎందుకు రగిలేవో యేమై మిగిలేవో
ఎందుకు రగిలేవో యేమై మిగిలేవో
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా

కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల వుయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు యున్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా..
.......................................................................................................
guppedumanasu_harshanews.com
పద్మ కుమారి పి.
హైదరాబాద్​