పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత


  • సైబరాబాద్​ సీపీ సజ్జనార్​
  • గచ్చిబౌలి కమిషనరేట్​ కార్యాలయంలో హరితహారం

పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత
మొక్కలు నాటిన అనంతరం నీరు పోస్తున్న సైబరాబాద్​ సీపీ సజ్జనార్​

హైదరాబాద్​: పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత కావాలని సైబరాబాద్ పోలీస్​ కమిషనర్​ వీసీ సజ్జనార్​ సూచించారు. గురువారం హరితహారం 6వ విడత కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలిలోని కమిషనరేట్​ కార్యాలయంలో మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  పర్యావరణ పరిరక్షణకు మొక్కలను నాటడం అనేది ఒక క్యాంపెయిన్ లా తీసుకురావాలన్నారు. మాసివ్ ప్లాంటేషన్ లో భాగంగా సైబరాబాద్ లో 1 ఎకరంలో 12,000 మొక్కలు నాటి దట్టమైన అడవిలా చేస్తామన్నారు. చెట్లను నాటడం ద్వారా పర్యావరణ ఉష్ణోగ్రతలు తగ్గించవచ్చన్నారు. రాబోయే తరాలు పచ్చదనంతో సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉండాలన్న ఆకాంక్షతో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం  హరితహారం పథకం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిఏటా ఉద్యమంలా నిర్వహిస్తోందన్నారు. ఇప్పటివరకు జరిగిన ఐదు హరితహారాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో ఏటా కోట్లాది మొక్కలను సైతం నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను సైతం ప్రభుత్వం తీసుకుందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్  పిలుపుమేరకు హరితహారం కార్యక్రమంలో భాగంగా అన్ని పట్టణాల్లో ప్రతీ శుక్రవారాన్ని “Green Friday” గా పాటించి మొక్కలను నాటాలన్నారు. కేవలం మొక్కలను నాటడమే కాకుండా నాటిన మొక్కలను సంరక్షించాలన్నారు.

డీసీపీ క్రైమ్స్ రోహిణీ ప్రియదర్శిని మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ అర్బన్ ఫారెస్ట్రీ పై దృష్టి సారించాలన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ తో పాటు కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మా సిబ్బంది విస్తృతంగా మొక్కలు నాటుతారన్నారు. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన ఆక్సిజన్ మనం మన ముందు తరాలకు ఇచ్చే విలువైన కానుక అన్నారు. భావితరాలకు కలుషితం లేని స్వచ్ఛమైన గాలిని, పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు.

సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏసీపీ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ  విద్యార్థులకు మొక్కల పెంపకం ఆవశ్యకత తెలియజేయడం ద్వారా వారికి పర్యావరణ పరిరక్షణ పట్ల చైతన్యం చేస్తూ అవగాహన పెంపొందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, అధ్యాపకులపై ఉన్నదన్నారు.  ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ  వీసీ సజ్జనార్, డీసీపీ క్రైమ్స్ ప్రియదర్శిని, ఏడీసీపీ ఇందిరా, ఏడీసీపీ ఎస్బీ గౌస్ మోహియుద్దీన్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్, ఏసీపీ లు, ఆర్ ఐ లు పాల్గొన్నారు.