కరోనా మొగ్గలు

కరోనా మొగ్గలు
కరోనా మొగ్గలు


ఆధునిక కరచాలన పలకరింపులు మాని
సంస్కారవంతమైన నమస్కారం చేయాలి
నమస్కారమే సర్వజనులకు శ్రేయస్కరం

సాంకేతికత పరిజ్ఞానానికి అంతుచిక్కని
మాయదారి మహమ్మారి కరోనా వైరస్
చాపకింద నీరై పారుతున్న కరోనా రోగం

కరోనా వడివడిగా దేశదేశాలలో వ్యాపిస్తూనే
పెనుప్రమాదమై విలయతాండవం చేస్తోంది
భయం గుప్పిట్లో వణుకుతున్న ప్రపంచ దేశాలు

సినిమాలకు సమూహాలకు దూరంగా వుంటూనే
విందువినోదాలకు విరామమివ్వడమే ఉత్తమం
స్వీయ నిర్భంధమే కరోనాకు సరియైన పరిష్కారం

దగ్గులు తుమ్ములకు మాస్కులను ధరిస్తూనే
వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
సనాతన ఆరోగ్యాన్ని ఆచరించడమే మన ధర్మం

కంటికి కనిపించని కఠిన శత్రువును తరిమివేయ
సమరానికి సర్వజనులు సన్నద్ధం కావాలి
అందరూ జాగ్రత్తగా వుంటే కరోనా పరార్

కర్కశమైన కరోనా గొలుసును కడతేర్చాలంటే
గడప దాటకుండా ఇంటి పట్టున వుండాలి
కరోనా ప్రతాపమును ప్రజలందరు కట్టడి చేయాలి

తగు జాగ్రత్తలన్నింటిని తక్షణమే పాటిస్తూనే
కరోనా భూతమును కనుమరుగయ్యేలా తరిమికొట్టాలి
సమైక్యంగా సంకల్పబలంతోనే సాధించగలం

కరోనా ప్రాణాంతక అంటువ్యాధని తెలిసినా
ప్రాణాలను పణంగా పెట్టి వైద్యం చేస్తున్నారు
కాపాడే వైద్యులే కనిపించే ప్రత్యక్ష దైవాలు

ప్రతి వీధిలో కరోనా వ్యాప్తినరికట్టుటకు
సామాజిక బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు
ప్రజారక్షణయే ధ్యేయమైన పోలీసు సిబ్బంది

కనిపించని కరోనా కలవరపెడుతున్నా
కడిగిన ముత్యంలా పరిసరాలు శుభ్రం చేస్తున్నారు
పరిమళించిన మనసులు పారిశుద్ధ్య కార్మికులు

ముట్టుకుంటే అంటుకుని మట్టుపెట్టే రక్కసిని
అనుమానిత ప్రాంతాలలో ఆచూకీ తెల్సుకుంటారు
ప్రజారోగ్యమే లక్ష్యంగా పరిశ్రమిస్తున్న ఆశావర్కర్లు

అనాథలకు నిత్యావసరాలను సమకూర్చుతూ
సమాజ హితం కోసం సహకారం అందిస్తున్నారు
అభాగ్యులను ఆదుకునే ఆపన్న హస్తాలు దాతలు

.....................................................................................................                     
పులి జమున