జీహెచ్​ఎంసీ పరిధిలో కరోనా కట్టడికి వ్యూహాలు అనుసరించాలి

జీహెచ్​ఎంసీ పరిధిలో కరోనా కట్టడికి వ్యూహాలు అనుసరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రశేఖర్​రావు


  • నగరంలో లాక్​డౌన్​ విధించాలనే ప్రతిపాదనలపై నిర్ణయం
  • తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్​రావు
  • మంత్రులతో సమీక్షా సమావేశం

హైదరాబాద్​: రోజురోజుకూ జీహెచ్​ఎంసీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు, నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్​రావు ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి, దాని నివారణకు తీసుకుంటున్న చర్యలపై మంత్రులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  జీహెచ్ఎంసీ పరిధిలో కొద్ది రోజుల పాటు తిరిగి లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఏమీలేదని, అందరికీ సరైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని ముఖ్యమంత్రి వెల్లడించారు.  హైదారాబాద్ లో  15 రోజుల పాటు లాక్ డౌన్ విధించడం మంచిదనే ప్రతిపాదనలు వైద్యశాఖ నుంచి వస్తున్నాయని, అయితే లాక్ డౌన్ విధించడం చాలా పెద్ద నిర్ణయం అవుతుందన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను సన్నద్ధం చేయాల్సి ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని, కేబినెట్ ను సమావేశ పరచాలని, అందరి అభిప్రాయాలు తీసుకుని లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రెండు మూడు రోజుల పాటు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తామని, అవసరమనుకుంటే మూడు నాలుగు రోజుల్లో కేబినెట్ ను సమావేశ పరిచి, జీహెచ్ఎంసీ పరిధిలో మళ్లీ లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలతో పాటు అన్ని విషయాలను, ప్రత్యామ్నాయాలను చర్చించి నిర్ణయం తీసుకుంటామని  కేసీఆర్ చెప్పారు.

వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ మాట్లాడుతూ..  దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతుందని, అదే క్రమంలో తెలంగాణలో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. జాతీయ సగటులో పోలిస్తే తెలంగాణలో మరణాల సంఖ్య కూడా తక్కువే. పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదని, పాజిటివ్ గా తేలిన వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీలలో కూడా వేలాది బెడ్లు సిద్ధం చేశామని, సీరియస్ పేషంట్లకు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామని, వ్యాధి లక్షణాలు లేని వారిని ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి  కెటి రామారావు, ఆర్ అండ్ బి శాఖ మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.