కల్నల్​ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటాం..


  • సంతోష్​కుటుంబానికి రూ. 5కోట్ల చెక్కు అందజేత
  • కుటుంబ సభ్యులను ఓదార్చిన సీఎం కేసీఆర్​

కల్నల్​ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటాం..
 కల్నల్​ సంతోష్​బాబు చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న సీఎం కేసీఆర్​

ఇటీవల భారత్‌–చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్​ సంతోష్​బాబు కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని తెలంగాణ సీఎం చంద్రశేఖర్​రావు హామీ నిచ్చారు. సోమవారం సూర్యాపేటలో కల్నల్​ కుటుంబ సభ్యులు పరామర్శించారు. ముందుగా కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి పూవులు చల్లి అంజలి ఘటించారు. అనంతరం సంతోష్ భార్య సంతోషి, తల్లితండ్రులు మంజుల, ఉపేందర్, సోదరి శృతిలను ఓదార్చారు. సంతోష్ పిల్లలు, అభిగ్న, అనిరుధ్ తేజలతో కాసేపు మాట్లాడారు.  ఈ సందర్భంగా సీఎ కేసీఆర్​ మాట్లాడుతూ దేశరక్షణ కోసం సంతోష్ ప్రాణత్యాగం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. సంతోష్ మరణం తనను ఎంతగానో కలచివేసిందని ముఖ్యమంత్రి చెప్పారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని చెప్పారు. సంతోష్ కుటుంబ బాగోగులు చూసుకోవాలని మంత్రి  జగదీశ్ రెడ్డిని ముఖ్యమంత్రి కోరారు. సంతోష్ భార్య సంతోషీకి గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చే నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు. హైదరాబాద్ లోని బంజార్ హిల్స్ లో 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాన్ని సంతోష్ భార్యకు ముఖ్యమంత్రి అందించారు. సంతోష్ భార్యకు రూ. 4 కోట్ల చెక్కును, తల్లితండ్రులకు రూ.1 కోటి చెక్కును ముఖ్యమంత్రి అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి,  వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేష్ కుమార్,  రాజ్యసభ సభ్యులు   జె. సంతోష్ కుమార్,  బడుగుల లింగయ్య యాదవ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్   నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యేలు  గ్యాదరి కిషోర్,  బొల్లం మల్లయ్యయాదవ్,  చిరుమర్తి లింగయ్య,  భూపాల్ రెడ్డి, సైదిరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్  దీపికా యుగంధర్, మున్సిపల్ చైర్ పర్సన్   అన్నపూర్ణమ్మ, డిసిసిబి చైర్మన్  గొంగిడి మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.