చీరకట్టు..

చీరకట్టు..
చీరకట్టు..

అన్ని వస్త్రధారణలు దీని 
ముందర తీసికట్టు
సంస్కృతీసాంప్రదాయాలకు 
అది ఆయువుపట్టు 
ఆత్మీయతానుబంధాల్లో అదొక
తీయని తేనె పట్టు..

అది నా దేశ గుండెల్లో గావురమైతే
అదే నా భరత జాతి నిండు గౌరవము
అది ధరించడమొక వరమైతే
అదే భారతీయ కౌటుంబిక సారము..

విదేశీయులు దానిపై తమ
హృదయాన్ని పారేసుకుంటే
స్వదేశీయులు దాని సృజనాత్మక
పనితనానికి దాసోహం..

అందమైన భామలు దాన్ని ధరించి
మరింత అందాన్ని, బిడియాన్ని 
సింగారించుకుంటే
అవని వాసంతంలో పచ్చచీర
నేర్పుగా కట్టుకున్నట్టు ఉంటుంది..

అదొక వస్త్రం మాత్రమే కాదు
అది నైతిక విలువలకు, కుటుంబ
కట్టుబాట్లకు, నిండుతనానికి ప్రతీక
సామాజిక సాంస్కృతిక గీతిక..

కఠినశిలాహృదయం సైతం దాన్ని
ధరించగానే మెత్తటి మైనం 
ముద్దగా మారిపోతే
రుద్రరూపం సైతం చీర మాటున
శాంత స్వరూపంగా మారిపోతుంది..

అది రాచరికంలో మహారాణుల 
పరాక్రమమై విలసిల్లితే
రుద్రమదేవి శౌర్యమై సాహసాన్ని
సానబెడితే
ఝాన్సీ రాణియై తెల్లదొరల గుండెల్లో
బాకుయై గుచ్చుకుంటే
రాజకీయంలో మహిళామణుల
రాజసమై విరాజిల్లితే..

భారతీయ సాంప్రదాయమంటేనే చీర
చీరంటేనే మన సాంప్రదాయం
అది ధరిస్తే హుందాతనం మరింత 
ఔనత్యాన్ని పొందితే

గౌరవమర్యాదలు నలుదిశలా
పర్యాప్తమై ప్రాచుర్యం పొందితే
దాని అందాచందాల్ని గాంచి మగువలతో
పాటు మగాళ్ళు కూడా దానికి ఫిదా
శతాబ్దాలు, యుగాలు గడిచిన ఇదే 
వస్త్రధారణ ఆధునికతకు దర్పణం సదా..

అదే భారతీయ
 చీరకట్టు..

.......................................................................


 చీరకట్టు..
సర్ఫరాజ్ అన్వర్
రాజేంద్ర నగర్, హైదరాబాద్..
94409 81198