మనం మారద్దు....


manam maroddu_harshanews.com
మనం మారద్దు....

బుద్ధగయ , ఉత్తరాఖండ్ ,
దిల్షుక్ నగర్, నిర్భయ...
ఉదంతాలెన్నెన్నో...కానీ
మన స్పందన మాత్రం ఒక్కటే...

చదివి వదిలేస్తాయి కళ్ళు...
వాటికి పోస్ట్ మ్యాన్ డ్యూటీ వేయొద్దు
మనసు మూలల్లోకి..మెదడు ఆంతరాల్లోకి
ఈ అనాధ వార్తను పంపమనొద్దు..

ఎవడెలా పోతే మనకేం...
మన ఇంటివరకూ నిప్పు అంటుకోలేదుగా...
పబ్లిసిటీ కోసం నలుగురిలో
పెద్ద గొంతుతో ఓ సారి ప్రస్తావిద్దాం..

ఆపై మళ్ళి ఓ చాయ్ కొట్టి
సమోసా మెక్కి ఓ పది కబుర్లు బొక్కి
పక్కింటోళ్ళతోనో పక్క సీటోళ్ళతోనో
కవుర్లు మోస్తూ ఇంటిదారి పడదామ్

ఇంటివారల కడ ఆజమాయిషీకై
అలసట అద్దెకు తెచ్చుకుంటూ
లేని స్వేదాన్ని తుడుచుకుంటూ
ఇంటి తలుపు తడదాం...

మనదేం పోయింది...
మళ్ళీ ఓట్లపండుగొస్తుంది
వీధుల్లో అలజడితో
మైకుల్లో ఒరవడితో

కొత్తదనం మనకొద్దు...
పాతకాపులే మనకు ముద్దు
మళ్ళీ గొర్రెలైపోదాం
అన్యాయాలకు ముద్రేస్తూ
అవినీతికి అక్రమాలకు
కొత్తకిరీటాలను అచ్చేస్తూ...

ఎప్పటిలానే తెల్లారుతుంది...
పొద్దు గూకుతుంది...
నేరాలు ఘోరాల షరాలతో
ప్రకృతి భీభత్సాలతో...

ఎప్పట్లానే..మర్నాటికి హమారా భారత్ మహాన్​..
......................................................................................................

manam maroddu_harshanews.com
పద్మకుమారి.పి ,
హైదరాబాద్​