గాలికదుపు లేదు.. కడలికంతు లేదు (ఇది కథ కాదు)


గాలికదుపు లేదు.. కడలికంతు లేదు (ఇది కథ కాదు)_harshanews.com
ఆ పాత మధురాలు
గాలికదుపు లేదు.. 
కడలికంతు లేదు 
(ఇది కథ కాదు) 


బాలచందర్....ఒక శ్రీ శ్రీ ,ఓ గుడిపాటి వారు , ఓ ముప్పాళవారు , ఒక రామలక్ష్మి , ఇంకో మాలతీ చందూర్ ఇలా అనేక విద్యాధికులు,విశ్లేషకులు మరెందరో మహానుభావులు కలబోసిన ఆణిముత్యాల తొడుగు...ఒక ఆడదాని మనసును ఆ మనసులో ఉప్పొంగే వేన వేల భావాలను తరచి చూడగలిగే ఒకే ఒక దార్శనికుడు.తన చిత్రాల్లో ఈలలేయించే లాగ్సుండవ్...తొడలుగొట్టి మీసం తిప్పే సన్నివేశాలుండవ్.. అందర్నీ ఆలోచింపజేసే కధాగమనం తప్ప. అలా అని అసందర్భపు పాటల చిత్రీకరణలూ ఉండవ్ మెసేజ్ ఓరియెంటెడ్ సాంగ్స్ తప్ప. నాకు వారి గురించి ఇంతకు మించి తెలియదని చెప్పడానికి చాలా బాధగా ఉంది. చాలా తక్కువే చూసాను వారు డైరెక్ట్ చేసిన సినిమాలు. బాలచందర్ జీ తీసిన "ఇది కధ కాదు" మూవీ లో సాంగ్ ఈ రోజు నేను పరిచయించబోయే సాంగ్.

సినిమాలో ఎంత వాస్తవికత ఉందో పాటలూ అంత అర్ధవంతంగా బావుంటాయి. బాలచందర్ (దర్శకత్వం), ఆత్రేయ(సాహిత్యం), ఎం.ఎస్.విశ్వనాథన్ (సంగీతం) కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా పాటలు మనసుకు దగ్గరగా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంటాయి. ఎంత అర్ధవంతమైన సాహిత్యమో చూడండి. రాలిన తీగ అలాగే ఉండక్కరలెదనీ , భర్తను వీడిన యువతికి కూడా అందమైన ప్రపంచం ఉంటుందనీ తెలుపుతూ సదరు పరిష్కారాన్ని తెరకెక్కించిన నిజ కృషీవలుడు బాల చందర్. ఒక స్త్రీ మనోభావాలను అక్షరీకరించడం అదీ ఆత్రేయగారి కలపు మంత్రజాలంలో కలకలించడం ఎంతందంగానో మనసుకు హత్తుకొన్నట్లు అనిపించింది. ఒక సెంటెన్స్ అయితే మరీ మరీ నచ్చింది

"తల్లి మళ్ళీ తరుణయ్యింది .... పువ్వు పూసి మొగ్గయ్యింది
గుడిని విడిచి వేరొక గుడిలో ప్రమిదనైతే తప్పేముంది..."

ఆ వనిత తను వెలుగునిచ్చే ఒత్తి కావాలనుకోవట్లేదు...ఒత్తికి సైతం ఆధారమయ్యే ప్రమిదగా మిగలాలనుకోవడంలోని నిస్వార్ధ తత్వం .... తాను వేడెక్కుతున్నా ఒత్తికి ఆధరువు కావాలనుకునే పరచింతన గల ఒంటరి స్త్రీమూర్తి ఎద సడికి అద్దం పట్టే అక్షర సుమాలిక్కడ మరెన్నో మనకు కనిపిస్తాయి. ప్రశాంతంగా పాటను వినే మనసుంటే...

అసలే ఆత్రేయగారి కలం ఆపై అది మనసుని(లో) మాత్రమే పల్లవింపజేయడం... మరో వాక్యంలో

"ఓ తెమ్మెరా ఊపవే ఊయల నన్నూ...
ఓ మల్లికా ఇవ్వవే నవ్వుల మాలిక నాకూ"

అంటూ ప్రకృతితో తన అనుబంధాన్ని నెమరు వేసుకునే ఉదాత్త చరిత కేవలం స్త్రీ మూర్తి మాత్రమే... ఆడదాన్ని మూడు ముళ్ళతో రెండు మూరల తాడుతో కట్టి పాడేస్తే బందీ కాదు. ఆమెను గడపకు ఆవల నిలిపేది ఆమెకు కుటుంబం పట్ల అనురాగము,జన్మ సంస్కారాలే తప్ప గిరిగీస్తే ఆగదంటూ పల్లవిలోనే హెచ్చరించే అలజడిని పరికించండి... అక్షరాలు అమృతత్వాన్ని అలదుకునే జాణకోయిల జానకమ్మ గళంలో పురుడు పోసుకున్న విశ్వనాధన్ గారి ముద్దుల పాట పాపాయిని... ఈ రోజు మీ మా మనందరి కోసం...

  చిత్రం:  ఇది కథ కాదు (1979)                
  సంగీతం:  ఎం.ఎస్. విశ్వనాథన్          
  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ           
  నేపధ్య గానం: జానకి                              

పల్లవి:

గాలికదుపు లేదు.. కడలికంతు లేదు
గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా
గాలికదుపు లేదు.. కడలికంతు లేదు
గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా

చరణం 1:
ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో
ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో
ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో
ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో
తుళ్ళి తుళ్ళి గంతులు వేసే లేగకేది కట్టుబాటు
మళ్ళీ మళ్ళీ వసంతమొస్తే మల్లెకేల ఆకుచాటు
గాలికదుపు లేదు.. కడలికంతు లేదు
గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా

చరణం 2:
ఓ తెమ్మెరా ఊపవే ఊహలా ఊయల నన్నూ
ఓ మల్లికా ఇవ్వవే నవ్వులా మాలిక నాకూ
తల్లి మళ్ళి తరుణయ్యింది.. పూవు పూసి మొగ్గయ్యింది
గుడిని విడిచివేరొక గుడిలో ప్రమిదనైతే తప్పేముందీ
గాలికదుపు లేదు.. కడలికంతు లేదు
గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
.......................................................................................................

 పద్మాకుమారి, హైదరాబాద్​