రాజ్​నీతి కాదు.. రణ్​ నీతి

  • తొందరపాటు ఉండొద్దు.. తలవంచాల్సిన అవసరం లేదు
  • చైనాను ఎదుర్కొనేందుకు వ్యూహాలు అవలంభించాలి
  • పీఎం నరేంద్రమోడీకి సీఎం కేసీఆర్​ సూచన
  • ప్రధానమంత్రి  నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా అఖిలపక్ష సమావేశం
రాజ్​నీతి కాదు.. రణ్​ నీతి
ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్న తెలంగాణ సీఎం కేసీఆర్​


హైదరాబాద్​:    దేశంలో ఇప్పుడు కావాల్సింది రాజకీయం (రాజ్ నీతి) కాదని, యుద్ధనీతి (రణ్ నీతి) కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్​స్పష్టం చేశారు. ప్రధానమంత్రి  నరేంద్రమోడీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభంలో గాల్వన్ లోయ ఘటనలో మరణించిన సైనికులకు మౌనం పాటించి నివాళి అర్పించారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ తన అభిప్రాయాలు చెప్పారు. భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఏమాత్రం తొందరపాటు ఉండొద్దని, అదే సందర్భంలో దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని  కేసీఆర్​ అభిప్రాయపడ్డారు. చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలని ప్రధానమంత్రికి సూచించారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.
        దేశంలో  భారతదేశంలో పరిపాలన సుస్థిరంగా ఉండడంతో పాటు, గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడం ఓర్వలేకనే చైనా కయ్యానికి కాలుదువ్వుతున్నదని సీఎం అభిప్రాయపడ్డారు. గాల్వన్ లోయలో వీర మరణం పొందిన సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున అందించే సాయాన్ని కూడా సీఎం ప్రకటించారు. చైనా, పాకిస్తాన్ దేశాలకు తమ దేశాల్లో అంతర్గత సమస్యలున్నప్పుడు సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం సృష్టించడం అలవాటని, ఇప్పుడు చైనాలో కూడా అంతర్గత సమస్యలున్నాయని చెప్పారు. దక్షిణ చైనా సముద్ర తీర దేశాలైన మలేషియా, ఫిలిప్పీన్స్, జపాన్ తదితర దేశాలతో కూడా చైనా ఘర్షణలకు దిగుతున్నదని, చైనా వైఖరి ప్రపంచ వ్యాప్తంగా బాగా అపఖ్యాతి మూటగట్టుకుందని తెలిపారు. భారతదేశంతో చైనా మొదటి నుంచి ఘర్షణ వైఖరి అవలంభిస్తుందని, గాల్వన్ లోయ లాంటి సంఘటనలు గతంలోనూ జరిగాయని, ఇది మొదటిది కాదు, చివరిది కాదు. 1957లో సరిహద్దు వివాదం లేవనెత్తిందని చెప్పారు.
         1962లో ఏకంగా భారత్ – చైనా మధ్య పూర్తిస్థాయి యుద్ధమే జరిగిందని గుర్తు చేశారు. 1967లో కూడా సరిహద్దులో ఘర్షణ జరిగిందని, అప్పుడు 200 మంది మృతి చెందారని చెప్పారు. ఇప్పుడు గాల్వన్ వద్ద మళ్లీ ఘర్షణలు జరిగాయని, అందులోనూ మన సైనికులు 20 మంది మరణించారని,  చైనాతో భారతదేశానికి ఎప్పటికైనా ప్రమాదం పొంచి వుంది. కాబట్టి మనం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉందని ప్రధానికి కేసీఆర్​సూచించారు. మనది శాంతికాముక దేశం. అదే సమయంలో సహనానికి హద్దు ఉంటుందని, ఎవరైనా మన మీదకి వస్తే తీవ్రంగా ప్రతిఘటించాలని స్పష్టం చేశారు. దేశ రక్షణ, ప్రయోజనాల విషయంలో రాజీ పడవద్దని, ఈ పరిస్థితుల్లో రాజకీయం అవసరం లేదని, రణనీతి కావాలని దేశమంతా ఒక్కతాటిపై నిలబడాల్సిన సమయం ఇది పేర్కొన్నారు. గతంలో కూడా ఇతర దేశాలతో ఘర్షణలు, యుద్ధాలు జరిగినప్పుడు ఇలాగే నిలబడిన సందర్భాలున్నాయి. చైనా యుద్ధం, పాక్ యుద్దాలు, బంగ్లాదేశ్ యుద్దాలు చేసిన అనుభవం మనకున్నది.
        1970 ప్రాంతంలో బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో ఇందిరాగాంధిని వాజ్ పేయి దుర్గామాత అని కొనియాడారు. అలాంటి స్ఫూర్తి ఇప్పుడు కావాలి. దేశమంతా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి అండగా నిలవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు ఈ సమయంలో దేశ ప్రధానికి అండగా ఉంటారు’’ అని సీఎం స్పష్టం చేశారు.