‘నడక’‘నడక’_harshanews.com
Image by Free-Photos from Pixabay నడిచిపోతోంది దేశం
ఒట్టి పొట్టకూటికే
వేలాదిగా వలసపోయి
రెండే రెండు కాళ్ళుగా
వెనక్కి తిరిగిపోతోంది దేశం


వదిలిపోటానికేం లేక
మోసుకెళ్లాటానికేం మిగలక
రెండు రెక్కలు తప్ప
వెనకేసుకున్నదేం కనపడక
నిలదియ్యటం తెలియక
నిర్లిప్తంగా
కదిలెళ్లి పోతుంది దేశం


ఊరుకాని ఊళ్ళో
పరాయిభాషలో ఏడిస్తే
ఎవరికీ అర్థంకాక
బతుకో బలుసాకో
ఇంటికి పోయి తేల్చుకోటానికి
లక్షల అడుగులకీ తరగని
దిక్కుతోచని దారిమీద                                                            
అడుగుల్లో
అడుగులేసుకుంటూ
అంతులేకుండా సాగిపోతోంది దేశం.


నిలవనీడ లేక
నడవ సత్తువ లేక
అరికాళ్ళ పచ్చి నెత్తురు ఆరిపోక
అసలు ప్రాణాలకే విలువలేక
గూడు చేరేదాక గుండెలదిమి పట్టలేక
పొమ్మనకుండా పొగబెట్టిన
ప్రభువులను ఏమనలేక
అంతా తలరాతే అనుకుని
తండోపతండాలుగా తరలిపోతోంది దేశం


దయగల తల్లెవరో దారికాచి
రెండు ముద్దలు చేతబెడితే
అన్నం ఒంటికి పడదు రొట్టెలున్నయ్యా
అని ఆ దూరప్రాంతపు కుర్రవాడు
నోరు తెరిచి అడిగినప్పుడు
ఇన్నాళ్ళూ ఏం తిని బతికావని
ఇకముందు తినడానికేముందని
ఆరాతీసి అడగలేక
కనీసం సిగ్గుపడటం చేతగాక
చరిత్ర మరిచిపోనంత దూరం
వడివడిగా నడిచిపోతుందీ దేశం
..........................................................................................................‘నడక’_harshanews.com
బండ్లముడి స్వాతికుమారి,
విజయవాడ.