బహుముఖ ప్రజ్ఞాశాలి ‘పీవీ నరసింహారావు’


  • 28న పీవీ జ్ఞానభూమిలో శత జయంతి ఉత్సవాలు
  • ఏడాది పొడవునా ఉత్సవాలు
  • జయంతి నిర్వహణకు రూ.10 కోట్లు
  • తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు

CM KCR_harshanews.com
ఉన్నత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్​రావు

హైదరాబాద్​: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్​రావు అభివర్ణించారు. మంగళవారం హైదరాబాద్​లోని ప్రగతిభవన్​లో పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ప్రధానమంత్రి  పివి నరసింహారావు దేశానికి విభిన్న రంగాల్లో అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, చిరస్మరణీయంగా నిలిచే విధంగా శత జయంతి ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏడాది పొడవునా నిర్వహించాలని నిర్ణయించినట్లు  తెలిపారు.  పీవీ  జన్మదినమైన జూన్ 28న హైదరాబాద్ లోని పీవీ జ్ఞానభూమిలో ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదే రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో పివి జయంతి వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణకు తక్షణం రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. వివిధ సందర్భాలకు సంబంధించిన పీవీ ఫోటోలను సేకరించాలని,  ఫోటో ఎగ్జిబిషన్ లు నిర్వహించాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, వంగరతో పాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో పివి విగ్రహాలు నెలకొల్పాలని,  విగ్రహాల కోసం వెంటనే ఆర్డర్ ఇవ్వాలని ఆదేశించారు.  రాష్ట్ర అసెంబ్లీలో పీవీ చిత్ర పటాన్ని పెట్టాలన్నారు. ఉత్సవాల నిర్వహణ సందర్భంగా చేయాల్సిన కార్యక్రమాలను అధికారులకు నిర్దేశించారు. ఈ సమావేశంలో  ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ కె. కేశవరావు, మంత్రి  ఈటల రాజెందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్  మామిడి హరికృష్ణ,  పీవీ నరసింహారావు కుమారుడు పీవీ ప్రభాకర్ రావు, కుమార్తె  వాణి దేవి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.