అమరజవాన్లకు జోహార్లు

amarajavanulaku joharlu_harshanews.com
అమరజవాన్లకు జోహార్లు 
  (బాధాతప్త హృదితో-అక్షరాలకు 
అందని అశ్రువుల కవితా మాలిక )  

మంచుకొండల్లో -
సరిహద్దుల్లో -
బంధాల మరిచి అనుబంధాల విడిచి
దేశరక్షణ లక్ష్యంగా
కల్మషమెరుగని మనస్సుతో
కరుడుకట్టిన శత్రురాజ్యాల
అకృత్యాల ఆపుతూ ;
తూటాలకు, రాళ్లకు -రాక్షస
హింసలకు బలిఅవుతున్న -జవాన్ వందనం ;

జాతి జెండాలో కాషాయానివి, శౌర్యానివి
శాంతికపోతానివై ఉషస్సును
స్వాగతిస్తావు -చెరగని ఆకుపచ్చవై
మువ్వన్నెల జెండా రెపరెపలో వీచేది
నీ ఊపిరే -మాస్వేచ్చా
స్వాతంత్ర  ఆసరా నీవే -సంతోషమ్ నీవే
నీకోరికల్ని , గమనాల్ని,భవితవ్యాన్ని
మా రక్షణకవచంగా
మారే నీకు నీవె సాటి -
రెప్పపాటు ఏమరపాటైనా
దేశాన్ని కూల్చేస్తుందన్న దేశభక్తి నిన్ను
నిలువునా కూల్చినా -నీ శిరస్సును
హిమవత్శిఖరంపై నిల్పుతూ
రేపటిని కలగంటావు -

ఓ అమ్మబిడ్డవై ,నాన్న ఆలనలో ఒదిగి
కరుడుకట్టిన చలితో వణుకుతూ పహారా కాచేనీవు -
కోట్లాది తల్లుల కన్నీరు తుడిచే పన్నీరౌతావు ;
నీవు జీవించే భవితవు -రేపటికాంతివి
మా హృదయాంతరాలలో
మహాత్మునివి -నీవే మహారుద్రగీతం
అన్యాయాన్ని ఎదిరించే అంకుశానివి -
మీ నిర్మల త్యాగం జోతలకందని అమర
గీతం -మీ మరణం దేశమాత శోకం
రాలిన మీ ప్రాణంతిరిగి రానిదే -
కానీ  మా గుండలే మీస్మారకనిలయాలు -
అర్పిస్తున్నాం మీకు అశ్రు నయనాల వీడ్కోలు -
అవే శత్రువు గుండెల్లో సింహ స్వప్నాలు -

......................................................................................................
అమరజవాన్లకు జోహార్లు_harshanews.com
డాక్టర్ బండారు సుజాతశేఖర్ 
 హైదరాబాద్​
 98664 26640