కొడిగట్టే దీపాలు

కొడిగట్టే దీపాలు
కొడిగట్టే దీపాలు


మిణుకు మిణుకు మంటున్న దీపం
వెలుగులో అక్షరాలను 
పలకపై సిలువేసి బుద్దిని శుద్దిచేద్దామంటే.. 
అనాధ గాలివాన దీపాన్నికొడిగట్టి 
గమ్యం లేని వీధికి 
చిరిగిన చొక్కా తొడిగింది. 

వజ్ర వైడూర్యాల కోటు వెనుక 
చెమట చెమ్మకు తడిసి 
కంపుకొట్టే బనీయను.. 
మురికి వాడల గోడలపై 
దుర్భర దుర్గంధ చిత్రాలు.. 
రేపటి భారతీయ ఛాయలో 
నాలుకలు తెగిన గొంతుల ఆర్తనాదాలు.. 

గొప్ప సంస్కృతుల 
వృక్షాల ఊడలకు వేలాడుతున్న 
తల్లిమూలాలు తెగిన ఆకలి 
పేగుల దిష్టిబొమ్మలు.. 

ఎన్నో అక్షరాలు వీరి ఈతిబాధలను 
చిత్రాలుగా చెక్కి సత్కారాల శాలువాలతో
 జ్ఞాపికలై, ఇంటి సొరుగుల అద్దాల మాటున 
బంధీయైన అలంకార వస్తువులు.. 

రక్షలు లేని ఆ పాద ముద్రలు 
పరిచిన బురద బాటలో.. 
 కార్పోరేటు కార్పెట్లుకప్పి 
మల్లెల సుగంధ అద్దాలు 
పొరుగు దేశాలకు తొడిగి, 
రంగులద్దిన అభివృద్ధి 
మీసాలు మెలేస్తున్నాయి..
దుర్భరం దయనీయం 
వీధి బాలల భారతీయం
..............................................................................................


కొడిగట్టే దీపాలు
కొప్పోలు యాదయ్య,
హైదరాబాద్​