"నాతిచరామి"


naathicharaami_harshanews
"నాతిచరామి" 

తన వెనుక
ఏడడుగుల నడక
మూడుముడుల బంధం
జీలకర్ర, బెల్లం సాక్ష్యం.

సంసార సంద్రంలో
కష్టాల కెరటాలు
కన్నీటి ఉప్పెనలు
ఇరువురం అని భ్రమ పడే
మమ్మల్ని ఒకటిగా మార్చాయి.

కుటుంబవ్యవస్థకు అద్దంపట్టేలా
జీవితపాఠాలు నేర్చుకోవడానికి
మా హనీమూన్ సాగింది
అయినవాళ్ళ ఇళ్ళల్లోనే.

కృష్ణుడు ఏడురోజులు
ఏక కనిష్టికతో ఎత్తిపట్టిన
గోవర్థనగిరి కంటే ,
బాధ్యతల బరువెక్కువున్న
జీవితాంతపు బంధాన్ని
మా చిటికెనవేళ్ళ కలయికతో మోస్తున్నాం.

కార్యేషు దాసి
కరణేషు మంత్రి
భోజ్యేషు మాతా
వీటికి లింగభేదం లేదనేది స్పష్టం.

సంస్కృతి మనకిచ్చిన
అమృతం దాంపత్యజీవితం
భార్యాభర్తల బంధం ముందు
ఏ బంధమైనా బలాదూరే
నా రాజు హృదయంలో
ఎప్పటికీ నేను రాణినే
'నాతి'చరామినే !!
.....................................................................................................

జ్యోతిరాజ్.భీశెట్టి (ఆళ్ళ)
హైదరాబాద్
99853 98889