రైతు మొగ్గలు

రైతు మొగ్గలు
రైతు మొగ్గలు

ఏళ్ళుగా నేలను నమ్మి 
వ్యవసాయం చేస్తున్నా
గుప్పెడు మెతుకులకు 
బలైపోతున్న జీవితాలు
ప్రతిరోజు కొడిగట్టినదీపంలా 
రైతన్నల బతుకులు

జీవితమంతా కష్టపడి 
బతుకులను ఈడుస్తున్నా
చేతిలో చిల్లీగవ్వలేని 
నిర్భాగ్యపు దైన్యజీవితాలు
అన్నదాతను ఎప్పుడూ 
ఆదుకోని ఆపన్నహస్తాలు

సస్యశ్యామలపంటలు
శ్మశానాలై ఎక్కిరించినప్పుడల్లా
నిరాశనిస్పృహలతో 
ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
ఉదయం పూసినపూలు 
రాత్రికి నేలరాలుతున్న చప్పుడు

నాగరికతకు నడకనేర్పి 
కడుపునింపిన నదులన్నీ
నేడు కరువుగీతాలను దీనంగా ఆలపిస్తున్నాయి
గుక్కెడునీళ్ళకు కరువై 
ఎండినస్తన్యంలా రైతన్న జీవితం

గుండెలమీద కుంపటిలా 
అప్పులు భారమవుతూ
రైతన్నల జీవితాలను 
ఎడారిమయం చేస్తున్నాయి
బీడును పంటగా మార్చినా 
మారనిది రైతు జీవితం
..........................................................................................
           
రైతు మొగ్గలు_harshanews.com
   - డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
90328 44017