"సెక్రటరీ"

 "సెక్రటరీ"
 "సెక్రటరీ"

యద్దనపూడి సులోచనా రాణి...తెలుగు సాహిత్యాన్ని మూడు దశాబ్దాలపాటు శాసించిన నవలా రాణి. మధ్యతరగతి మగువల మధురోహలను పెట్టుబడిగా పెట్టి అక్షర తీయందనంతో వారి మందహాసాలను దోచుకున్న ఆశలవేణి. ఆమె కలం నుంచి జాలువారిన "సెక్రటరీ" నవలను కె.ఎస్.ప్రకాశరావు (కె.రాఘవేంద్రరావు జీ తండ్రి) దర్శకత్వంలో డా.డి.రామానాయుడు అత్యంత అందంగా తెరకెక్కించారు.

సాధారణంగా సులోచనా రాణి రచనల్లో హీరోయిన్ పొగరు ,పౌరుషం, ఆత్మాభిమానం, ఆభిజాత్యం పుష్కలంగా ఉన్న పాత్రల్లో మధ్యతరగతి అమ్మాయిగా అత్యంత సొగసుగా ఒదిగిపోతుంటుంది. అలాంటి మధ్యతరగతి అమ్మాయే జయంతి. శీలానికి రక్షణ లేని ఓ కంపెనీ లో ఉద్యోగానికి రిజైన్ చేసి ఏమి చేయాలా అని ఆలోచనలో ఉన్న జయంతికి తన సెక్రటరీ లీవ్ లో వెళ్ళడంతో ఖాళీ అయిన ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తాడు హీరో రాజశేఖర్. క్యాంప్ కెళ్ళి వస్తూ ఒక చీర కొని ఆమెకు ప్రెజెంట్ చేస్తాడు .

చీర చూడగానే మనసు దోచుకున్నా..స్త్రీ సహజమైన బిడియం, తనకలవాటైన ఆభిజాత్యంతో కట్టుకోకూడదు అని నిర్ణయించుకున్న జయంతి , రాజశేఖర్ మరల టూర్ కి వెళ్ళడంతో మనసు పదే పదే ఆ చీర కట్టుకోమని పోరు పెడుతుండడంతో ఆ చీర కట్టుకుని సినిమాకి వెడుతుంది. అదే సమయంలో టూర్ కి వెళ్ళిన పని త్వరగా ముగియడంతో తిరిగి వచ్చిన రాజశేఖర్ అదే సినిమాకి రావడం తటస్థిస్తుంది. అనుకోకుండా సీట్స్ పక్క పక్క నే రావడంతో ఒకరినొకరు పలకరించుకుంటారు. తను కొన్న చీరకు జయంతి కట్టుబడితో కొత్తందం వచ్చిందని రాజశేఖర్ ఆనందిస్తాడు.ఆతడు కొన్న చీర వద్దనుకుంటూ కట్టుకుని అతని కంట పడ్డం కాస్త బిడియంగా అనిపించినా ఏదో తెలియని కొత్త అనుభూతికి లోనౌతుంది జయంతి. వారిద్దరి భావాలకు తగ్గట్టు సినిమాలో పాట వారిద్దని అంతరాలను స్పృశిస్తూ సాగుతుంది..

అలతి పదాలే అయినా అందంగా మన మదిని తాకుతుండె సాహిత్యాన్ని చూడండి ఒకసారి...

"తెచ్చానే మల్లెదండా తురిమానే జడ నిండా
చూసుకోవె నా వలపు వాడకుండా"

అంటూ కవ్వించిన మొగుడికి

"నా మనసే నిండుకుండా అది ఉంటుంది తొణక్కుండా
నీ వలపే దానికి అండదండ"

అంటూ బాధ్యతంతా అతని వలపుదే అంటూ ఇల్లాలు దీటుగా చెప్తుంది సమాధానం. అతనిపై తనకున్న అనురాగాన్ని అతని కల్ళల్లో చూసుకుంటానంటూ.... మహిళకు అత్యంత ప్రీతిపాత్రమైన అద్దంతో ఆతని కన్నులను పోలుస్తూ తన సొగసును అక్కడ భద్రంగా దాచుకోమని అన్యాపదేశంగా చెప్తుంది...

"నిగనిగలా నీకళ్ళు నిలువెత్తు అద్దాలు
నిలబడి చూసుకుంటానందాలూ"

ఆమెకు ఏ మాత్రం తీసిపోకుండా....ఆమె కనుబొమల సోయగం విసిరే బాణాలకే ఆమె అందాలు దాచుకున్న తన కనుపాపలు పగిలిపోతాయంటూ చెణుకు విసురుతాడు

"విల్లంటి కనుబొమలు విసిరేను బాణాలు
విరిగిపోవునేమొ ఈ అద్దాలు"

నాకు ఈ చమత్కారాలు చాలా బాగా నచ్చాయి...మీరూ ఆస్వాదిస్తారని ఆశిస్తూ....మీ కోసం....

చిత్రం: సెక్రెటరి 1973
సంగీతం : కె వి మహదేవన్ గారు
రచన : ఆచార్య ఆత్రేయ గారు
గానం: రామకృష్ణ . సుశీల గార్లు

మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు
మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు
మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి
ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు
డడడడ డడడడ డడడడడా
మొరటోడు నామొగుడు మోజుపడి తెచ్చాడు
మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి
ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు

తెచ్చానే మల్లెదండా తురిమానే జడ నిండా
చూసుకోవె నా వలపు వాడకుండా
నా మనసే నిండుకుండా అది ఉంటుంది తొణక్కుండా
నీ వలపే దానికి అండదండ
డడడడ డడడడ డడడడడా
మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు

నిగనిగలా నీకళ్ళు నిలువెత్తు అద్దాలు నిలబడి చూసుకుంటానందాలూ
నిగనిగలా నీకళ్ళు నిలువెత్తు అద్దాలు నిలబడి చూసుకుంటానందాలూ
విల్లంటి కనుబొమలు విసిరేను బాణాలు విరిగిపోవునేమొ నీ అద్దాలు
డడడడ డడడడ డడడడడా
మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు

తమలపాకు పాదాలూ తాళలేవె కడియాలూ
దిద్దుతానె ముద్దులతో పారాణులూ
నీ ముద్దులే మువ్వలు ఆ మోతలె నా నవ్వులూ
ఆ పారాణికి వస్తాయి ప్రాణాలూ
డడడడ డడడడ డడడడడా

మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు
మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి
ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు
డడడడ డడడడ డడడడడా..

.................................................................................................................

 "సెక్రటరీ"
పద్మ కుమారి పి.
హైదరాబాద్​