ప్రకృతి మొగ్గలు

 
ప్రకృతి మొగ్గలు
ప్రకృతి మొగ్గలు

పెరటిలోని జామకొమ్మకు ఉన్న ఆకులను 
చూసినప్పుడల్లా
మామిడితోరణాలై పలకరిస్తాయి
ప్రకృతి ఎంత శిల్పకారిణో

వేప ఎల్లమ్మతల్లి  బోధి బుద్ధతండ్రి
తంగేడుపూల బతుకమ్మ 
మారేడుదళాల శివయ్యలు మహిమాన్వితలు
పరీక్షించి చూడు ప్రకృతే తల్లీ తండ్రి దైవం

పొద్దున పాదు తీసినప్పుడు
పాదేమో భూగోళంలా చెట్టేమో నాభిలా ఉన్నది
చెట్లు భూగోళానికి పహారా కాస్తున్న సైనికులు

ఈదురుగాలులు వీచినప్పుడల్లా
చెట్లుశివసత్తుల్లా ఊగుతాయి
ప్రకృతి నటరాజుని ప్రతిరూపం

ప్రాణం పోస్తున్న చెట్టుతల్లి 
ఆయువును ఏ దుర్మార్గుడైన తీసేస్తుంటే
తరతరాల నా అస్థిత్వం అంతమవుతున్నట్టుంటది
చెట్టు మనపైనే పంచప్రాణాలు పెంచుకున్న అమ్మరా...


.........................................................................................................

అతినారపు హరిశంకర్
   లట్టుపల్లి,  బిజినేపల్లి
   నాగర్ కర్నూల్
88863 63249