ఓ అద్భుత దృశ్యకావ్యం ️

ఓ అద్భుత దృశ్యకావ్యం ️_harshanews.com
Image by Bessi from Pixabay 


ఒక్కోరెక్క విప్పుతున్న 
పూబంతిలా మెలిమెల్లిగా..

అరవిచ్చిన మందహాస వదనముచే
తూరుపుకొండల నుండి పైకి తేలుతూ...
కడిగిన ముత్యమల్లె మారిన అంబరానికి
సింధూర తిలకం దిద్ది

తన లేలేత కిరణాల వెలుగులతో భానుడు
ముకుళిత వదనమైన
ప్రకృతి కాంతకు మెరుపులద్దుతూ ..

జగతిరెప్పలపై వెలుగుల చినుకులు ప్రసరించగ
అపుడే ఉషాదేవి ఒడిలో
ప్రాణం పోసుకున్న సకలచరాచర జీవరాశి
పాలబుగ్గల పాపాయి నవ్వులా...
ఆవేళ ఆస్వాదించాలి స్వచ్చమైన 
ప్రకృతి హృదయమెంత పరిమళభరితమో..

కిలకిలరవముల పక్షుల సరాగాలు
చెట్టుకొమ్మలు సన్నగా ఊగుతూ
పిల్లగాలులతో సయ్యాటలు...

చిట్టి గువ్వపిల్లల కొరకు
ఆహారాన్వేషణలో
గూడునొదిలి మైళ్ళ ప్రయాణం చేస్తూ 
గగనవీధుల్లో విహంగవిహారం..
అరవిందపు ఆ దృశ్యకావ్యం
కడు రమణీయం

ననులేత స్పర్శలో ప్రతిసుమం పరవశమై
రంగురంగుల విరిహాసాలు
మరువపు గంధాల మకరందాలు వెదజల్లుతూ
రారామ్మని పిలిచే నవ్యగీతికలై...

తళతళ తళుకుల కులుకులతో
వన్నెచిన్నెల భామినిలా..
వంపుసొంపు నడుమొంపులతో
వెండికొండల వెంట
నదీమతల్లుల ఉదయపునడకలు

సరసిజముల పుట్టినిల్లు
కొంగలఆవాసాలు
పశవుల స్నానవాటికలై 
సరస్సుల సొబగులెంత
ముగ్ధమనోహరం

ఎంత శ్రద్ధ వహించెనో కదా..
విరించి విరచించిన ప్రకృతి ప్రబంధం 
ఎంత చదివినా 
తనివితీరని ఓ అద్భుతం 
అద్వితీయం..
......................................................................................................

గీతాశ్రీ స్వర్గం
మెదక్​
99088 09407