పడతీ.. ఎక్కడున్నావ్!!!

పడతీ.. ఎక్కడున్నావ్!!!
పడతీ.. ఎక్కడున్నావ్!!!


ఒక దేవదేవుని సతివై సగమైనావు
కష్టాలకానల్లో వెన్నంటి బలియైనావు
అనుమానపు ఉలితాకి అగ్నిపునీతవైనావు
కానల్లో ఒంటరివై కనుమరుగైనావు
ఓ సీతా భూజాతా...ఎక్కడ తల్లీ నీ జాడ

ఒక తల్లిమాటకైదుగురికాలియై
ఒక భర్త జూదానికి బలియై
నలుగురిలో వస్త్రాపహరిణివై
నవ్వుల పాలైన పాంచాలీ
ఎద పగిలిన ధీశాలీ! నీకు మా జోతలివే...

నేటికీ హరిశ్చంద్రుల(నుకునేవారి) సతివై
అంగడిలో సరుకై...అమ్మకమై
అణువణువూ తాకట్టౌతున్నావ్
పతి సుఖమే పరమావదియనుకున్న
ఓ ఇంతీ నీ సహనానికి మా కన్నీటిచేమంతులివే...

అమ్మతనంలో ఆడతనాన్ని చూస్తున్నారు
అమ్మాయిలను ఆటవిడుపు చేస్తున్నారు
నడిరోడ్డైనా నాలుగ్గోడల్లో అయినా
చెలీ! నీకు లేదుగా ఏ భద్రతామరుగు...ఇట చెల్లీ
నువ్ పుట్టగానే నీపై మృగాడికి పుట్టేది వాంఛేనే తల్లీ..

ఇంకా ఉన్నా వ్రాయలేను...
ఎన్ని వ్రాసినా ఇంతి చరితింతేను...
అందుకే స్వస్తిస్తున్నా....ఇక్కడే
శ్వాస సగమై...ఎడద భారమై...

............................................................................................................
పడతీ.. ఎక్కడున్నావ్!!!
పద్మ కుమారి పి.
హైదరాబాద్​