సుగాత్రి శాలీనులు

సుగాత్రి శాలీనులు _harshanews.com
సుగాత్రి శాలీనులు 

     
ఎన్ని కథలు చదివినను, ఎన్ని రసవత్తర కావ్యాలు చదివినను అన్నింటికంటే  విభిన్నమైనది పింగళి సూరన విరచిత ‘ కళా పూర్ణోదయం ’ కావ్యం.  అప్పటి వరకు తెలుగు సాహిత్యంలో వచ్చిన రచనలు అన్ని సంస్కృత అనువాదాలు లేదా పురాణ గాధల అనుసరణలు. కాని తెలుగులో మొట్ట మొదటి కల్పనాత్మక ప్రబంధం పింగళి వారి కళా పూర్ణోదయం.
    
ఈ కళా పూర్ణోదయంలో ఎన్నో కథల విరులున్నాయి. అన్నింటి లోనికి ప్రత్యేకత కలది ‘ సుగాత్రి శాలినుల’ కథ. ఇది ఒక కథ గా మనకు కనబడదు. ఈనాటికి నిలిచి ఉన్న దాంపత్య  సమస్యలకు  పరిష్కార దిక్సూచి లా కనబడుతుంది. మనో విశ్లేషణ అంతర్వాహినిగా ఉంటుంది.

నేటి ఆధునిక కాలంలో  చూస్తున్న ఎన్నో రకాల సమస్యలలో ప్రధానం అయినది ఆలుమగల మధ్య సరి అయిన అవగాహన లేక పోవడం. మగ అయినా ఆడ అయినా ఎన్ని రకాల సమస్యలు వచ్చినా , పని చేసే చోట ఎంత ఇబ్బంది వచ్చిన తట్టుకొని నిలబడగలరు. కాని వారి సంసారంలో మొలకెత్తిన చిన్న చిన్న కంటకాలు మాత్రం వారినే పని కూడా స్థిరంగా చెయ్యనియ్యవు. ఆ  దాంపత్య సమస్య ప్రభావం వృత్తి, జీవితం పై కూడా పడి మరింత అసహనానికి దారితీస్తుంది.  అటువంటి సమస్య వచ్చినపుడు ఎలా ఓపికగా ఉండి. సమస్యను పరిష్కరించుకోవాలో సూరన చక్కగా చెప్పాడు.  ‘మైండ్ ఈజ్ మెయిన్ సెక్స్ ఆర్గాన్’  అని మనం ఈనాడు అనుకుంటున్న సూత్రాన్ని ఆనాడే చెప్పాడు. 

సుగాత్రి శాలినుల కథ కూడా ఎన్నో మలుపులు తిరుగుతూ మనల్ని ఉర్రూతలూగిస్తుంది.
కథ లోనికి తొంగి చూస్తే... కాశ్మీర దేశంలో గల శారద పీఠం పూజారి కుమార్తె మన కథా నాయిక సుగాత్రి. సుగాత్రి అందాల భరిణ. సుగాత్రి తండ్రి తన భార్య మీద అలిగి దేశం విడిచి వెళ్ళిపోతాడు. సుగాత్రి తల్లి తన కుమార్తెకు వివాహం చేసి, ఇల్లరికపు అల్లుడిని తెచ్చుకొని వంశోద్దరుకుని పొంది, తన ఆస్తి పాస్తులు నిలుపు కోవాలని ఆశ పడ్తుంది.  అందగాడు, బుద్ధిమంతుడు అయిన శాలీనుడు సుగాత్రి ని వివాహం చేసుకొని, ఇల్లరికపు అల్లుడుగా అత్తవారింటనే ఉంటాడు.  ఇక్కడే అసలు కథ మొదలవుతుంది.

శోభనం రాత్రి చక్కగా అలంకరించి, సర్వాంగ సుందరంగా ఆభరణాలతో ముస్తాబు చేసి శాలీనుడు వద్దకు పంపుతారు సుగాత్రిని ఆమె  చెలికత్తెలు. అందాల సుగాత్రి గదిలోని ఉన్న భర్తను చేరి స్త్రీ సహజమైన సిగ్గుతో నిలిచి వేచి ఉంటుంది. కాని ఎంతసేపు వేచి ఉన్నాను కన్నెత్తి కూడా చూడలేదు శాలీనుడు. చాలా సేపు ఓర్పు వహించి, ఇక అక్కడ ఉండలేక కనుల నిండా నీరుతో బయటకు వచ్చేస్తుంది. అది చూసిన చెలికత్తెలు..‘ఆహా ఎంత మంచి పడుచు మగడు ఇతడు ’’ అని వెక్కిరింతగా పలుకగా సుగాత్రి తల్లి  “ బహుశా అతను సిగ్గు గలవాడు, మీ మాటలు విన్నాడా అన్నింటిని విడిచి పారిపోవచ్చు.” అని  వారిని మందలిస్తుంది.  ఇక్కడ మనం గమనించ వలిసిన విషయం మొదటి రాత్రే అలా అయిందని సుగాత్రి తల్లి అల్లుడిని కించపరచలేదు సరికదా ఎక్కువ నవ్వులు, వెక్కిరింపులతో సంసారాన్ని వీధిన పడేయ్యవద్దని హితువు పలకడం .

రెండు,మూడు రాత్రులు కూడా సుగాత్రి శాలీనుని గదిలోనికి వెళ్ళడం, బాధాతప్త హృదయం తో రావడం జరుగుతుంది. ఒక సమస్య వచ్చినప్పడు మన అనుకున్న వారు మనకంటే ఎంతగా బాధపడతారో సూరన ఇక్కడ చక్కగా తెలియజేస్తాడు. సుగాత్రి తల్లి అనుమతి తీసుకొని, సుగాత్రి చెలికత్తెలు ఆమెతో ఏకాంతంగా ఇలా హితబోధ చేస్తారు. 

“నీ వాలకం చూస్తుంటే భార్య భర్తల మధ్య ఉండవలసిన శృంగార బంధం  మీ ఇద్దరి మధ్య ఏర్పడినట్లు లేదు. ఇద్దరూ తెలివైన వారేకదా. అతను విషయం పక్కన పెట్టు, అతను స్పందించకపోయినా నువ్వు అయినా చొరవ తీసుకోవాలి కదా.   ‘‘ కాంత యునట్లయిన నెట్లు కాపురమింకన్’’ అని సుతిమెత్తగా చెప్తారు.               

భర్త సిగ్గు పడుతున్నప్పుడు భార్య కూడా సిగ్గుల మొగ్గ అయి చొరవ తీసుకోకపోతే ఆ కాపురం ఎలా సాగుతుంది అని సూరన దాంపత్య రహస్యం చెప్తాడు.
 
స్త్రీ సహజ మైన సిగ్గుతో “ఛీ పాడు “ అన్న సుగాత్రి ఆరోజు రాత్రి చెలికత్తెలు చెప్పినట్లే చొరవ తీసుకోనబోయింది. కాని శాలీనుని నుండి ప్రతి స్పందనలు శూన్యం. 

 “ ఇట్టి నిరర్దునెందు గణ మేమన బోయిన నీవు మిక్కిలిన్ “ 
అంటూ సుగాత్రి తల్లి “ఇంత దయలేని నీ భర్తను ఏమన్నా నీవు ఊరుకోవు అంటూ  తన గదిలో కూతురుతో బాధపడుతూ,  శాలీనుని ఉద్దేశించి..

 “వట్టిగొడ్డు తాకట్టిత దెంతయున్న నిను గాఱియ పెట్టుట వెళ్లి గొట్టినన్’’  
ఇంత పనికిమాలిన వాడిని నేను చూడలేదు. పాలివ్వని వట్టి గొడ్డును తాకట్టు పెట్టుకోన్నట్లుగా ఉంది.  “ అంటూ శాలీనుని నిందిస్తుంది కూతురు దగ్గర.   ఒకరోజు అతని దగ్గరకు వెళ్లి  “ రోజంతా అలా ఖాళీగా కూర్చుంటే తోచదు కదా. వెళ్లి మన పూలతోట లోనికి పోయి అవసరమయిన పనులు చూడు నాయనా “ అని చాకచక్యంగా అల్లునికి పనులు చెప్తుంది.
  
మనసు పెట్టి పని చెయ్యడం వలన శాలీనుడు పూలతోటను ఒక అద్భుతమైన పూలవనంగా రూపుదిద్దాడు. భర్త తోటలో పనిచేయ్యడం సుగాత్రికి ఇష్టం ఉండేదికాదు. తనును దూరం పెట్టినను భర్తపై ఏరోజు కోపగించుకోలేని సహనవతి, ఎప్పటికైనా భర్త మారతారని ఎదురుచూసే ఆశాజీవి కదా మరి.
  
ఒకరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమయ్యింది. ఇక్కడ సూరన  ఒక అద్భుతమైన మలుపు తిప్పుతాడు కథను. భర్త తోటలో ఈ వర్షానికి ఏ ఇబ్బందులు పడుతున్నాడో అని ఇంటి దగ్గర ఉన్న సుగాత్రి “ అమ్మా , సరస్వతి మాత నా  భర్తను కాపాడు “ అని  దేవిని ప్రార్థించి తన తల్లికి చెప్పకుండా పూలవనానికి వెళ్ళింది. అక్కడ భర్త క్షేమంగా ఉండటం చూసి, ఆనందించి ఆరోజు నుండి కొన్ని రోజులపాటు ఎవరికంటా పడకుండా భర్త తోటలో చేస్తున్న పనులును గమనించేది. భర్తకు తను కూడా సహాయం పడాలనే తపనతో ఒకరోజు పూలవనానికి వెళ్లి, భర్త కు సహయం చెయ్యబోతుంది. శాలీనిడు “వద్ద”అని చెప్పినా వినకుండా, తన వంటిపై ఉన్న  నగలన్నీ తీసి ఒకచోట పెట్టి, చీరను బిగువుగా కట్టి, నడుము వంచి తోట పని చెయ్యసాగింది.  తోటపని చేస్తున్న సుగాత్రి వైపు అనుకోకుండా  చూసిన శాలీనుడిపై చెరుకువింటి వేలుపు గురిచూసి వేసిన మదనబాణం సరిగానే గుచ్చుకుంది. చిరు చెమట పట్టిన సుగాత్రి నడుము ఒంపులు, హృదయ భారం, జఘన సౌందర్యం , బిగుతుగా కట్టిన చీరనుండి ఆమె శరీర వంపులు శాలీనుని ఆకర్షించాయి. చెమట పట్టిన ఆ అందాల మోము, ఆ ముఖం పై పడుతున్న ముంగురులు శాలీనుని బలంగా ఆకర్షించాయి. ఇకలేక ఆమెను చేరి “వద్దన్నా వినవు కదా, చూడు చెమటలు పట్టాయి “అంటూ ఆమె చెక్కిళ్ళపై ఉన్న చెమటను తన ఉత్తరీయం తో తుడిచి, తమకంతో తొలిసారిగా ఆమెను తన కౌగిట బంధించాడు. సుగాత్రి సంతోషం పట్టలేక తన భర్తను తీగలా అల్లుకుపోయింది. ప్రకృతి సాక్షిగా ఆరుబయట  పూ పొదరింట సుగాత్రి,శాలీనులు ఏకమయ్యారు. 
  
వదనం అంతా వింత కాంతితో వెలిగిపోతుండగా ఇంటికి వచ్చిన సుగాత్రిని చూడగానే ఆమె తల్లి, చెలులు విషయం గ్రహించి  ఆనందించారు. ఆరాత్రి మరింత రెట్టించిన ఉత్సాహంతో పడక గదిలో అడుగుపెట్టింది సుగాత్రి.. అక్కడ శాలీనుడు ఉదయం పూలతోటలో జరిగిన మధుసంప్కరంను తలచుకుంటూ సుగాత్రి రాకను గుర్తించలేదు. చాలాసేపు వేచి చూసి ఇక బయటకు వెళ్లిపోవాలనుకొని  మెల్లగా భర్తను చేరి “తోటపనిలో అలసి ఉన్నారు గాబోలు. నేను వెళ్ళనా ? “ అని అడిగింది.  ఉహాలోకంలో ఉన్న శాలీనుడు “నువ్వు ఏ కోరికతో వచ్చావు ?” అని పరధ్యానంగా ప్రశ్నిస్తాడు. 
     
నిర్ఘాంతపోయిన సుగాత్రి “ నాధ ! లోకంలో భార్యలు తమ భర్తలు వద్దకు ఏ కోరికతో చేరి వస్తారో        ఆ కోరికతో నేను వచ్చాను” అని పలుకుతుంది.  “పూనియడిగితిరి లోకపూజిత నైతిన్”  కనీసం అడగాలన్నా ఆలోచన వచ్చి ఎందుకు వచ్చావు అని అడిగారు. చాలు , నేను లోకంలో  అన్నిటికంటే పూజింప దానిని అయ్యాను. ధన్యురాలిని “ అంటూ వ్యంగంగా అంటుంది. కాని మన శాలీనుడు ఉహాలోకంలోనే ఉండటం వలన ఆమె మాటలు చెవికెక్కలేదు.  
 
“అకటా యేమని దూరుదానా మిము నాధా! వేగుజామయ్యే బొందికగా బాదం లొత్తరమ్మనుట గానీ, యొంటి యేమో కదా 
నికట క్షోణికి నేగు దేమ్మనుగా గానీ, కొంత నెయ్యంపు బూ
నికతో గన్నులు విచ్చి చూచుతయె కానీ లేద మొక్కింతయున్”   
నాధా మిమ్మల్ని ఏమని నిందించను. ఒకపక్క చూస్తే తెల్లవారి పోతుంది. ఒంటరిగా ఉన్నాను కదా, దగ్గరకు రా , పాదాలు పట్టు అనను కూడా అనడం లేదు మీరు. కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు “ అంటూ హృదయ వేదనను చెప్పుకుంటుంది. 
 
 “ఉదయం తోటలో నా అదృష్టం పండింది. మరి ఇప్పుడు కన్నెత్తి కూడా చూడటం లేదు. “అంటూ బాధ పడుతూ తొలిసంగమ మధుర స్ముతుల తమకంతో పాన్పుపై పడుకున్న శాలీనుని చేరి అతని పాదం పట్టుకొని ఒత్తుతూ , మెల్లగా అతని పాదాన్ని తన తొడపై పెట్టుకొని ఒత్తుతూ, ఇక ఆగలేక శాలీనుని పాదాన్ని తన హృదయోన్నతాలను తాకిస్తూ, తన బుగ్గను భర్త పాదంపై తాకించింది.  ఒక స్త్రీ ఇంతకంటే ఎలా తన ప్రేమను, మనో వాంఛను వ్యక్తపరుస్తుంది. సూరన ఒక విరహమూర్తి తోలిసంగమ వేదనను, అంతరాగాన్ని అద్భుతం గా కనులు ముందు ఆవిష్కరిస్తాడు. కాని, శాలీనుడు దరి చేరడు సరికదా కన్నెత్తి కూడా చూడడు.  కథ చదువుతున్న పాఠకులకు ,రస హృదయవేత్తలకు కుతూహలం రేగే విధంగా సూరన కథా గమనం సాగుతుంది. ఉదయం భ్రమరమై చెలరేగిన శాలీనుడు రాత్రయితే ఎందుకిలా అత్తిపత్తి చెట్టు అవుతున్నాడో తెలుసుకోవాలన్న  ఆసక్తి కలుగుతుంది. 
 
‘చిత్తము వేరోకర్తుపయి జేర్చి మరల్పగ నేరారేమొ “ వేరే స్త్రీ  మీ మనసు పై ఉంటె చెప్పండి. ఆమెను తీసుకొని రండి. మీ ఇద్దరిని రాజు, రాణిలా చూసుకుంటూ సేవ చేస్తాను “ అని అంటుంది. ఇక్కడ సహజం గానే  భర్త పై తన భార్యను నిరాదరణ చేసినపుడు ఆ భార్య కు వచ్చిన సందేహమే సుగాత్రి కి వచ్చింది. కాని  ఎన్ని మాటలు మాట్లాడుతున్న ఉదయపు స్ముతుల నెమరు ’వేట ‘లో ఉన్న శాలీనుని చేరలేదు ఆ మాటలు. 
     
విచారంతో మరల ఉదయం తోటకు పోయి, నగలు, అలంకరణలు పక్కన పెట్టి  తోట పనిలో సాయం చెయ్యసాగింది సుగాత్రి. చిత్రంగా ఆమె నిన్నటి కంటే ఎక్కువగా భర్త శాలీనుని ఆదరణను పొందగలిగింది. అపుడు అర్థం అయ్యింది సుగాత్రికి. తన భర్త కు సహజ సౌందర్యం అంటే ఇష్టమని, సహజ సౌందర్య పిపాసి అని  నగలు, అలంకారాలు ఉంటె దరి చేరడు అని తెలుసుకుంటుంది.  కృత్తిమ అలంకరణలుకు ఆమడ దూరం ఉంటాడని, తనను తనలానే స్వీకరిస్తాడని తెలుసుకొని ,ఆరోజు నుండి శాలీనుని మనసు ప్రకారం నడుచుకుంటూ సుఖ సంతోషాలతో దాంపత్య జీవితం గడపసాగింది. 
  
ఇక్కడ పింగళి సూరన ఒక అద్భుతమైన మనసతత్వాన్ని సుగాత్రి శాలీనుల కథ ద్వారా తెలియపరుస్తాడు. భార్య భర్తలు ఒకరి మనసు ఒకరు పూర్తిగా అర్ధం చేసుకోవాలని, అలా ఉంటేనే వారి దాంపత్యం నిత్య యవ్వనం గా ఉంటుంది అని చెప్తాడు. సహజ సౌందర్య అభిలాష మనసు గల శాలీనుని మొదట పాఠకులు అపార్ధం చేసుకున్నా, తర్వాత అతని అంతరంగం తెలుసుకొని మురిసిపోతారు. కథలో నవ్యత, నడకలో మలుపులు, కొసమెరుపు ఈ కథను సజీవం గా నిలిపి ఉంచాయి.  శ్రమైక సౌందర్యం గురించి పింగళి సూరన చాల చక్కగా వివరిస్తాడు.
 
                                              

సుగాత్రి శాలీనులు _harshanews.com

జి.వి.శ్రీనివాస్,
బి.కాం, ఎం.బి.ఏ.ఎం.ఏ (తెలుగు)
విజయనగరం.
      77024 55559     
                          

    

Post a Comment

0 Comments