మూఢనమ్మకాలు

మూఢనమ్మకాలు
మూఢనమ్మకాలు


నేటికీ మానవుడు మూఢనమ్మకాలతో తంత్రాలను మంత్రాలను జ్యోతిషాలు నమ్ముతున్నాడు.
అలా నమ్మించే వారంతా కూటి కోసమే చేస్తున్నారని , వాటిని నమ్మకూడదని శరభంగుడు అనే కవి రాసిన "శరభాంక లింగమా" అనే శతకములో చెప్పాడు.

పద్యం:

ఎక్కడి మంత్ర తంత్రముల వెక్కడి
            చక్రము లేడ పాచికల్
ఎక్కడి జ్యోతిష్యంబులవి వెక్కడి
            హేతువు లేడ ప్రశ్నముల్
తక్కడి గాక పూర్వ కృతధర్మ
            సుకర్మమె నిర్చయాంబుపో
పెక్కురు పొట్టకూటిది వేషమయ
               శరభాంక లింగమా!

వివరణ: ఎక్కడ మంత్రము తంత్రములు. మంత్రాలు తంత్రాలు నేటికి కూడా ఈ సమాజం పై ప్రభావం చూపుతున్నాయి. చాలామంది ప్రజలు ఈ మంత్ర తంత్రాలను నమ్ముతున్నారు. ఏదైనా సమస్య వస్తే, కొందరు బాబా దగ్గరికి పోయి మంత్ర తంత్రాలతో పూజలు చేయిస్తూ తాయెత్తులు వేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరు మెడనిండా చేతినిండా తాళ్ళు కట్టుకుంటూ ఉంటారు. అలాగే చక్రము అంటే రాగి వెండి రేకుల మీద గీసే ఒక రకమైన ఆకారము. ఇది ఇంటిలో పెట్టి పూజిస్తే, శుభాలు కలుగుతాయని చెప్పి, నమ్మించి వారి దగ్గర డబ్బులు గుంజుతూ ఉంటారు.

నేను చిన్నప్పుడు మా ఇంట్లో జరిగిన సంఘటన చెప్తాను. నాకు పదేళ్ళ వయసున్నప్పుడు జరిగింది. మా అమ్మమ్మ ఒక బిక్షగాడు దీపం స్తంభం పట్టుకొని, అడుక్కొనేకి వచ్చి, మా ఇంటి ముందర నిలబడి, మా అమ్మమ్మకు ఏమో చెప్పి, ఇంట్లో కూర్చొని ఒక రాగి రేకు మీద ఏదో ఆకారము గీసి, వాటికి పూజలు చేసి, ఊదుబత్తీలు అంటించి, ఒక కోడికి కాటు పెట్టి  రెండు చుక్కల రక్తం అంటించి. ఆ కోడిని తన బుట్టలో వేసుకొని, కొన్ని పాత బట్టలు ఇప్పించుకుని, దాని ఇంట్లో కట్టమని చెప్పి వెళ్లిపోయినాడు. ఎంత మోసం చేసి పోయాడో చూడు. కోడిని, బట్టలు తీసుకొని పోయాడు. వాళ్ళను నమ్మడం మన దురదృష్టం.

అలాగే గవ్వలు వేసి మన జీవితం ఎలా ఉంటుందో గవ్వల సంఖ్యను బట్టి చెప్పడం జరుగుతుంది. తరువాత వారికి గొప్పగా చెప్పి, తర్వాత ఏదో ఒక సమస్య చెప్పి శాంతి చేస్తామంటూ డబ్బులు లాగుతారు. మనందరికీ తెలిసిన విషయమే. ఇక జ్యోతిష్యం దీని గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఆలోచిస్తే బాధ కలుగుతుంది. ఈ జ్యోతిష్యం విషయంలో చాలా రకాలు ఉన్నాయి. మనకు అడుగడుగునా జ్యోతిష్యాలు కనిపిస్తున్నాయి. నక్షత్ర గమనంతో మన జీవితాన్ని మారుస్తామని చెపుతున్నారు. కొందరి జ్యోతిష్యము చూసి  వారికి కావలసిన సమయములో పనులు ప్రారంభిస్తున్నారు. ఇక సంతాన విషయముల అయితే, ముందే జ్యోతిష్యాన్ని కలిసి వారు చెప్పిన టయానికి, ఆపరేషన్ చేసి  పిల్లలను బయటకు తీస్తున్నారు. ఇక పేరు పెట్టే విషయంలో, అక్షరాల కోసం నిఘంటువులు సృష్టిస్తున్నారు, మరలా రంగురాళ్ల రత్నాలు ధరిస్తున్నారు. వజ్రాలు ధరిస్తున్నారు, గోమేదికాలు ఇలా ఎన్నో ధరిస్తున్నారు. అలాగే హేతువు అంటే కారణాలు. తనకు వచ్చిన సమస్యలకు కారణాలు తెలుసుకోవడం. దానికి తగిన పూజలు చేయడం. ప్రశ్నలు అడగడం. వారి సమస్యకు పరిష్కారం చూపిస్తామని డబ్బులు గుంజడం.

వీటినన్నిటిని మనం నమ్మకూడదు. మనం పూర్వ జన్మలో చేసుకున్న కర్మ ఫలితాలు అనుభవిస్తాము తప్ప. పైవేవీ నిజము కాదు. వాటిని నమ్మకూడదు.  చాలామంది  తాము బ్రతకడం కోసం రకరకాల విద్యలు నేర్చుకొని, రకరకాల వేషాలు వేసి, జీవనం సాగిస్తూ ఉంటారు. కోటి విద్యలు కూడా కూటి కోసమే, అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. వారు చెప్పే దాంట్లో నిజం ఏ మాత్రం ఉండదు. బ్రతకడానికి వారు చేసే గారడీలు మాత్రమే, అందులో వారు చెప్పే మాటల్లో, మంత్రతంత్రాలలో ఏ మాత్రము నిజం లేదు. అవి మూఢనమ్మకాలే తప్ప, వాటిని ఎవరూ నమ్మకూడదని నా అభిప్రాయం.

మూఢనమ్మకాలు

కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235

Post a Comment

0 Comments