విద్యాదానం, రక్తదానం ఆమె రెండు కళ్లు

విద్యాదానం, రక్తదానం ఆమె రెండు కళ్లు_harshanews.com
 విద్యాదానం, రక్తదానం ఆమె రెండు కళ్లు 



పిల్లలకు పుస్తకాల్లోని పాఠాలు చెప్పడమే కాదు ఇతరులకు సహాయపడాలన్న మానవత్వాన్ని నేర్పిస్తున్నారు ఆమె. జీవితాన్ని తీర్చిదిద్దుకునే విద్యనే కాదు ప్రాణాలు నిలబెట్టే రక్తాన్ని దానం చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె ఉపాధ్యాయురాలు, సామాజిక కార్యకర్త విజయలక్ష్మి. ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తూ ఖాళీ సమయంలో పేదపిల్లలకు పాఠాలు చెప్పుతారు. అంతేకాదు ఇప్పటివరకు 11సార్ల రక్తదానం చేసి లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్, రోటరీ క్లబ్,  కర్నూలు ప్రభుత్వ వైద్యశాల నుంచి ప్రశంసా పత్రాలను అందుకున్నారు. ఈ రోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పుతూ ఆమె పరిచయం..
 
విద్యాదానం, రక్తదానం ఆమె రెండు కళ్లు_harshanews.com
రక్తదానం చేస్తున్న విజయలక్ష్మి

పి. విజయలక్ష్మి. కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం బుగ్గన పల్లి మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ లో టీచర్. అన్నపూర్మ చిన్నపిల్లల అనాథ శరణాలయంలో ట్యూటర్.
ఆమె తల్లిదండ్రులు భీమన్న, సావిత్రమ్మ. ఎంఎస్సీ సెరీకల్చర్, బిఎడ్ పూర్తి చేసిన ఆమె టీచర్ గా తన కెరీర్  ను ప్రారంభించారు. స్కూలు చుట్టూ, ఆశ్రమం చుట్టూ మొక్కలు నాటడం, పిల్లలకు ప్రకృతిని పరిచయం చేస్తూ వారితో మొక్కలు నాటించడమే కాదు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకునేలా చేశారు. పర్యావరణాన్ని కాపాడాలంటే పచ్చదనాన్ని పెంచాలనే మంచి ఆలోచనలను చిన్నతనంలోనే పిల్లలకు నేర్పిస్తూ వారి జీవితంలో పర్యావరణ పరిరక్షణ ఒక భాగంగా చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఇతరులను  సహాయం చేస్తూ ఎవరినీ నొప్పించకుండా నడుచుకోవడమే ఆమె గోల్. 


విద్యాదానం, రక్తదానం ఆమె రెండు కళ్లు_harshanews.com
ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్న విజయలక్ష్మి

ఆడపిల్లలకు విద్య తప్పనిసరి అని చెప్పడమే కాదు ఎంతో మంది బాలికలకు విద్యను అందించిన సావిత్రిబాయి పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. అన్ని దానాల్లోకెల్ల అతి ముఖ్యమైన, విలువైన విద్యను ఒకవైపు అందిస్తూ మరోవైపు ఎందరో ప్రాణాలు కాపాడేలా రక్తదానం చేస్తున్నారు. అగ్రికల్చర్ బిఎస్సీ పూర్తి చేసిన ఆమె కొడుకు యశ్వంత్ కూడా 25సార్లకు మంచి రక్తదానం చేశారు. 

మార్పు ఇంటి నుంచే ప్రారంభం కావాలి అని చెప్పడమే కాదు ఆచరించే అరుదైన ఉపాధ్యాయురాలు ఆమె. వీలైనంత వరకు ఎక్కువ మందికి సహాయం చేయాలి. చదువుకు ఆర్థిక స్థితి అడ్డురాకూడదు అంటూ తన జీవితాన్ని విద్యాబోధనకే అంకితం చేసిన ఆదర్శనీయురాలు.

Post a Comment

0 Comments