మనసును స్పృశించే కవితా మాధవీయం

మనసును స్పృశించే కవితా మాధవీయం_harshanews.com
మనసును స్పృశించే కవితా మాధవీయం 


వెండి తరగల నురుగులలో వికసించిన నీటి కలువ కవితా మాధవీయం కవితా సంపుటి. మన అంతర్గత సంఘర్షణ ప్రతిఫలింప చేయడానికి ఉపయోగపడే ఏకైక శక్తి భాష. సమకాలీన పరిస్థితులకు సంఘటనలకు అనుగుణంగా భాషా మాధ్యమం ద్వారా తన భావాలను చాలా స్పష్టంగా ఈ కవితా మాధవీయం పుస్తకం ద్వారా కవయిత్రి నందిమల్ల మాధవీ  శ్రీనివాస్ తెలియ చేశారు. 

మనస్సాగరంలో ఉరకలు వేసే ఆలోచనలకు అక్షర సొబగులు దిద్ది ఈ పుస్తకాన్ని అపురూపంగా తీర్చిదిద్దారు. కవితా మాధవీయం పుస్తకానికి స్వాగతం తెలుపుతూ ప్రముఖ కవి,  విమర్శకులు దాస్యం సేనాధిపతి గారు 'ఉత్తమ వ్యక్తిత్వం సున్నిత మనస్తత్వం పరిమళించిన మానవత్వం మాధవి కవిత్వంలో అల్లుకు పోయాయి' అని తెలిపారు. డాక్టర్ తిరునగరి గారు పుస్తకాన్ని సుతిమెత్తని భావాల సంపుటిగా వర్ణించారు. మంచులో తడిసిన మల్లె పువ్వు లాంటి కవితలు మాధవి అక్షరాలు అని తెలిపారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు 'ఉదయం ఆకాశమంత శూన్యమైన భావ సంఘర్షణ లోంచి అక్షర కోశం విడిచే ప్రతి విశ్వాసం కవనమై నిలిచిన కవిత్వం' అని తెలిపారు.

కవితా మాధవీయంలో మొత్తం 80కవితలు ఉన్నాయి. తొలి కవిత "నా జీవన నేస్తం" లో 'మునిమాపుల మలిసంధ్యలో మౌని వై నిలిచిన ఓ జీవన నేస్తమా' అంటూ తన సహచరుని గురించి తనలోని భావాలను తెలియజేశారు. ‘కనిపించే దేవతలు'  కవితలో పేరుకు జవానులు అయితే నేమి ధరణిపై కనిపించే దేవతలు మీరు అంటూ జవానుల గురించి చాలా చక్కగా రాశారు . ‘చిరకాల మిత్రులు' కవిత లో అక్షరజ్ఞానం వచ్చినప్పటినుంచి నాతో నీ సాహచర్యం అద్భుతం /నన్ను చుక్కల లోకం లో అధిరోహించేలా చేసావు/ నన్ను సప్త లోకాల్లో విహరింప జేసావు అంటూ బాలమిత్ర చందమామ పుస్తకాలే తనకు తొలి పఠనమంటూ, పుస్తకాలే నేస్తాలు అంటూ తెలియజేశారు. "జ్ఞాన ప్రదాయిని" కవితలో సరస్వతి అంటే జ్ఞాన ప్రవాహం/ ప్రణవ నాద రూపిణి/ అక్షర నిధిని ప్రసాదించే ఆది దేవత అంటూ శ్రీవాణికి అక్షర నీరాజనం సమర్పించారు.

 "ప్రకృతి" కవితలో ఆకుల్ని చూస్తూ గాలి బిత్తరపోయింది/ చడీచప్పుడు లేకుండా కళ్ళార్పు తుంది ఆకాశం అంటూ ప్రకృతిని రమణీయంగా వర్ణించింది. అక్షరాలు శున్యాల నుండి వెలిగే వెలుగు గవాక్షాలు/ ఆకాశంలో ప్రకాశించే సుమనోహర నక్షత్రాలు/అక్షరాలు అవిద్యను అంతం చేసే జ్ఞాన కిరణాలు అంటూ అక్షరాల గురించి చాలా చక్కగా చెప్పారు.

అనారోగ్యం అతిథిలా వస్తుంటే ఆత్మవిశ్వాసంతో అధిగమించు/ అపజయం నిన్ను హేళన చేస్తే జయకేతనం ఎగరవేయడానికి సిద్ధంగా ఉండు అంటూ తన కవితలో ఆశావహ దృక్పధాన్ని తెలిపారు. తన చిన్ననాటి బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ లేగదూడ గంతులు లాంటి ఆ లేత మనసులు / అంటూ కాలమనే చక్రాన్ని వెనక్కి తిప్పి బాల్యమనే ఆ స్వర్గం లోకి వెళ్లి పోనిస్తావా?అని కోరుకుంది. చెలియ చెలిమి  కవితలి 'గుడి గంట లాంటి నీ రాకతో నా గూడే కాదు గుండె కూడా సంతోషించింది/నాదన్న సమస్తం ఇక నువ్వే నువ్వే అంటూ చెలిమి గురించి గొప్పగా వర్ణించింది. 

మాధవి గారు అన్నట్టుగానే ఈ కవితలు పసి మనసుల పాల సంబరాల.. సెలయేటి లోని సుస్వరాలు..అవిద్యను అంతం చేసే విజ్ఞాన కిరణాలు.. శూన్యాల నుండి వెలుగే వెలుగు గవాక్షాలు.. ఇవన్నీ అక్షర సత్యాలు. కవితా మాధావీయం కవితా సంపుటిని రచించిన కవయిత్రి నందిమళ్ళ మాధవి శ్రీనివాస్  ఇంకా ఇలాంటి కవితా సంపుటిలను మరిన్ని వెలుగులోకి తీసుకు రావాలని కోరుకుందాం.

ప్రతులకు :
మిడ్ టౌన్ అపార్ట్మెంట్ 
సెజ్ కాలనీ సనత్ నగర్ 
హైదరాబాద్ - 500018

............................................................................................................

మనసును స్పృశించే కవితా మాధవీయం_harshanews.com

సమీక్షకురాలు
    బండారు సునీత
ఎమ్మే (తెలుగు,హిందీ,ఆంగ్లం) 
 బి.ఎడ్ , హెచ్ పి టి .
మహబూబ్ నగర్,  94406 71530  


       

Post a Comment

0 Comments