విప్లవ సింహం అల్లూరి

విప్లవ సింహం అల్లూరి_harshanews.com


బ్రిటిష్ వారి నిరంకుశ పాలన నుండి భారతీయులకు దాస్యవిముక్తి కలిగించటానికి జీవన బలిదానం చేసిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు.  సీతారామరాజు క్రీ.శ. 1897లో జూలై 4వ తేదీన విశాఖ జిల్లాలోని పాండ్రంకి గ్రామంలో నారాయణమ్మ, వెంకట్రామరాజు దంపతులకు జన్మించాడు.  


1909లో భీమవరంలో 6వ తరగతిని, కాకినాడ పి.ఆర్. కళాశాలలో 8వ తరగతి, ఎ.వి.యస్. కళాశాలలో 9వ తరగతి పూర్తి చేశాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన సీతారామరాజు అనేక కష్టాలను చవిచూశాడు.  పేదరికం అనుభవించాడు.  పినతండ్రి పెంపకంలో కొంత వరకు విధ్యాభ్యాసం చేయగలిగాడు.  వత్సవాయి నీలాద్రిరాజు వద్ద జ్యోతిషం, వాస్తు,  హఠయోగం వంటివి నేర్చుకున్నాడు.   సూరి అబ్బయ్యశాస్త్రి వద్ద సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు.   అపారమైన దైవభక్తి కలిగిన సీతారామరాజు కొంతకాలం రామలింగేశ్వరస్వామి ఆలయంలో తపస్సు చేశాడు.   సీతారామరాజు బాల్యం నుండి దేశభక్తి ఉత్తేజపూరితమైన వాతావరణం పెరిగాడు.  శ్రీ బిపిన్ చంద్రపాల్ ఆంధ్రాలో ఇచ్చిన ఉపన్యాసంతో ప్రభావితుడైన సీతారామరాజు, విధ్యార్థి దశ పూర్తికాగానే దేశమంతటా పర్యటించి దేశ స్వాతంత్త్రోధ్యమ స్థితి గతులను తెలుసుకున్నాడు.  ఆ పర్యటనలోనే విశాపట్టణంలోని మన్యం ప్రజలు పడుతున్న కష్టాలు, బాధలు తెలుసుకుని వారికి అండగా నిలవాలని అనుకున్నాడు.  

మన్యం ప్రజలు పూర్తిగా అడువులపై ఆధారపడి, వాటినుండి లభించే తేనె, సీకాయ, కట్టెలు మొదలైనవి పట్టణ ప్రజలకు ఇచ్చి వాటి బదులుగా తమకు కావలసినవి తెచ్చుకునేవారు.  బ్రిటిష్ వారి పాలనలో ప్రభుత్వం అడవుల చట్టాన్ని ప్రవేశపెట్టినది.  దీని ప్రకారం కొండజాతివారు కట్టెలను కొట్టకూడదు, పోడు వ్యవసాయం చేయరాదు. అంతే కాకుండా అనేక ఆంక్షలు ప్రవేశపెట్టినది.  వారి పరిపాలన కారణంగా అనేక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  వారు రౌలత్ చట్టాన్ని ప్రవేశపెట్టారు.  దీని ప్రకారం నిందితులను ఎటువంటి విచారణ చేయకుండా నిర్భంధించవచ్చును, శిక్షింపవచ్చును.  దేశ రాజకీయ నాయకులందరూ దీనిని ప్రతిఘటించారు.  సహాయనిరాకరణోధ్యమాన్ని ప్రారంభించారు.  విధ్యార్థులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు.  

ఇటువంటి ఉద్యమ పరిస్థితులలో సీతారామరాజు మన్య నాయకులైన గంటందొర, మల్లు దొరలతో సంభాషణలు జరిపాడు. సీతారామరాజు అనేక యుద్ధవిధ్యలలోను,ఆయుర్వేదంలో నైపుణ్యం కలవాడగుటచే, మన్యం ప్రజలు వీరిని అమితంగా గౌరవించేవారు.   వివిధ గ్రామాల ప్రజలను సమావేశ పరచి వారికి అన్ని విద్యలు నేర్పించాడు.  విలు విద్యలో నిపుణులుగా తయారుచేసి, కొండదళం తయారుచేసి, దానికి తానే స్వయంగా నాయకత్వం వహించాడు. కొండ ప్రజలకు అనేక యుద్దపద్ధతులు,  గెరిల్లా విద్య మొదలైనవి నేర్పాడు. 

కొండజాతివారిని చైతన్యవంతులుగా చేయటం గమనించిన బ్రిటిష్ వారు రాజు కొంత కాలం దూర ప్రాంతంలో అధికారుల పర్యవేక్షణలో ఉంచారు.  ఈ ప్రవాశ శిక్ష నచ్చని సీతారామరాజు అక్కడినుండి తప్పించుకుని తిరిగి మన్యం చేరుకున్నాడు.    1922 ఆగస్టు 22వ తేదీన చింతపల్లి పోలీసు స్థేషన్ పై మెరుపుదాడి చేసి తూటాలను, కత్తులను, మందుగుండు సామాన్లను స్వాధీనం చేసుకున్నాడు.  తరువాత కృష్ణదేవిపేట, రాడవొమ్మంగి స్టేషన్లను కొల్లగొట్టి, జైల్లో మగ్గుతున్న వీరయ్యదొరను విడిపించాడు. ఈ కొండదళం ఆచూకీ తెలుపవలసినదిగా బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలను అనేక బాధలకు గురిచేసింది.  చింతపల్లి, కృష్ణదేవిపేట, నర్సీపట్నం మధ్య ప్రభత్వం కల్పించిన టెలిఫోన్ సౌకర్యాలను, స్తంభాలను ఈ దళం ధ్వంసం చేసింది. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టేవారు, ఆహారధాన్యాలను కొల్లగొట్టేవారు.  విప్లవానికి వ్యతిరేకంగా పనిచేసేవారిని వీరు శిక్షించేవారు.   ఈ దళం వారిని పట్టిచ్చిన వారికి వెయ్యిరూపాయల బహుమానం కూడా ప్రభుత్వం ప్రకటించింది.  ఈ కొండదళం అనేక భీకర పోరులను సల్పింది.  ఈ దళాన్ని ఏమీ చేయలేక ప్రభుత్వం సైన్యాన్ని తీసుకుని వచ్చింది.   వారి సోధనలో మల్లుదొర పట్టుబడ్డాడు.  సీతారామరాజు మన్యం ప్రజల గుండెలలో తిరుగులేని నాయకుడుగా నిలచిపోయాడని తెలుసుకుని బ్రిటిష్ వారు, సీతారామరాజు ఆచూకీకై మన్యం ప్రజలను అనేక చిత్రహింసలకు గురిచేసారు.  వారి బాధలను చూడలేక సీతారామరాజు, బ్రిటిష్ వారితో సంధి చేసుకునేందుకు స్వయంగా పాలకుల వద్దకు వెళ్ళాడు.  తమ ఎదుటపడిన సీతారామరాజును బ్రిటిష్ వారు నిర్ధాక్ష్యింగా కాల్చిచంపారు.  వారు తుపాకీ కాలుస్తున్నప్పటికీ బెదురు చెందక సీతారామరాజు,  తన వంటి సీతారామరాజులు వేలకొలది పుట్టుకొస్తారని, వారి బ్రిటిష్ వారిని భారతదేశం నుండి పారద్రోలుతారని నిర్భయంగా ప్రకటించాడు.  వందేమాతరం అంటూ 1924 మే 7వ తేదీన సీతారామరాడు తుదిశ్వాస విడిచాడు.  

రామరాజు మరణంతో మన్యం ప్రజలలో మరింత పట్టుదల పెరిగి, ఉద్యమాన్ని ఉధృతం చేశారు.  బ్రిటిష్ వారు నిరంకుశంగా కొండదళం నాయకులందరినీ పట్టి చెరసాలలో వేశారు.  సీతారామరాజు పూరించిన విప్లవ శంఖం దేశమంతటా సంచలనం కలిగించింది.  కొండదళం నాయకుడుగా సీతారామ రాజు భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయాడు.  సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్య్రం సిద్దిస్తుందని నమ్మిన పోరాట యోధుడు. మహాత్మాగాంధి ఆంధ్రదేశంలో పర్యటించే సమయంలో అల్లూరిసీతారామరాజు అనేక విధాలుగా కొనియాడారు.  సాయుధ పోరాటం పట్ల తనకు సదుద్ధేశ్యం లేదని, అయినప్పటికీ సీతారామరాజు వంటి త్యాగశీలని, ధైర్యవంతుని కొనియాడకుండా ఉండలేమని చెప్పారు.  తదనంతరం జరిగిన అనేక పోరాటాలకు ఆయన మార్గదర్శకుడయ్యాడు.
విప్లవ సింహం అల్లూరి_harshanews.com

విశ్వశ్రీ, సాహిత్యశ్రీ 
డా. దేవులపల్లి పద్మజ
విశాఖపట్టణము
98496 92414

Post a Comment

0 Comments