విద్యావ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన


  • ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి దీర్ఘకాలిక వ్యూహం
  • తెలంగాణ సీఎం చంద్రశేఖర్​రావు
  • ప్రగతిభవన్​లో అధికారులతో విస్తృత స్థాయి సమావేశం
విద్యావ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన_harshanews.com
సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రశేఖర్​రావు


హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్​రావు స్పష్టం చేశారు. ప్రగతిభవన్​లో విద్యాశాఖ అధికారులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి అమలు చేస్తామని తెలిపారు.    దీనికోసం విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో వివిధ రకాల విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, సిలబస్ తదితర విషయాలపై యుజిసి,ఎఐసిటిఇ తదితర సంస్థల మార్గదర్శకాలను పాటించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల పనితీరును గణనీయంగా మెరుగు పరిచి, అత్యుత్తమ విద్యాబోధన జరిగేలా చేయడం ద్వారానే విద్య పేరు మీద జరుగుతున్న దోపిడిని అరికట్టడం సాధ్యమవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. 

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క రంగంపై దృష్టి పెట్టి క్రమంగా దీర్ఘకాలిక సమస్యల నుంచి ప్రజలకు శాశ్వత విముక్తి కలిగిస్తూ వస్తున్నామని తెలిపారు.  ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇతర ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి? వాటిని గొప్పగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఏం చేయాలి? అనే విషయాలపై త్వరలోనే ఓ వర్క్ షాప్ నిర్వహించి విద్యారంగ నిపుణులు, అనుభవజ్ఞుల అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

ప్రస్తుతం అనాథ ఆడపిల్లలు పదవ తరగతి వరకు కస్తూరి భా పాఠశాలల్లో చదువుతున్నారని, తర్వాత వారి చదువుకు కావాల్సిన ఏర్పాట్లు చేసే విషయంలో ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని, ఈ విషయంలో త్వరలోనే విధాన నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. ఆగస్టు 17నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం ఎప్పుడు చేయాలి, విద్యాబోధన ఎలా జరగాలి అనే విషయాలపై కేంద్రం మార్గదర్శకాలను, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతిని పరిశీలించి, రాష్ట్రంలో ఏం చేయాలనే విషయంపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు.  

విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం రూపొందిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి, సిఎస్ సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  చిత్రా రామచంద్రన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, సీనియర్ అధికారులు నవీన్ మిట్టల్,  ఉమర్ జలీల్,  శ్రీహరి,  శేషు కుమారి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments