వైద్యో నారాయణో హరిః

వైద్యో నారాయణో హరిః
Image by Gerd Altmann from Pixabay 


జ్వరమాని, బి.పి ఆపరేటర్లే శంఖు చక్రాలుగా;
స్టెతస్కోపే వైజయంతీమాలగా ,
పలకరింపులచిలకరింపులే 
సేవాకిరీటంలో మెరిసే 
వజ్ర,వైఢూర్యాలుగా ధరించిన ప్రజామనిషి....

అతని సమక్షం నిర్భయత్వాన్ని పెంచే స్రోతస్సు....
ఆ ఆప్తవాక్యాలే ఆజీవన మంత్రాలు....
ఆ సేవలు ఆత్మవిశ్వాసాన్ని 
ప్రోదిచేసేచైతన్యస్రవంతులు.....

రోగులకు చికిత్సాప్రసాదాలనుపంచి
పీడావిముక్తుల్ని చేసి
 వృత్తి గొప్పదనాన్ని 
ప్రజా హృదయఫలకాలపై
 చెక్కే నిత్యశిల్పి.....

మనసుకూ, శరీరానికీ 
స్వస్థతనిస్తూ, శక్తిని
సగుణైకరూపంగా దర్శింపజేయగల 
సర్వరోగ నివారిణి...

వైద్యుడంటే .... 
మార్కెట్ కాదు!
ఆసుపత్రంటే.... 
కాసులకు ఆలయం అంతకన్నా కాదు!

వైద్యుడంటే ....?
దివారాత్రాలను
కవచకుండలాలుగా 
ధరించిన ఆరోగ్యప్రదాత....

ఆసుపత్రులంటే...?
మృతసంజీవనునులను
పంచగల పవిత్రసేవాథామాలు....
........................................................................................................

వైద్యో నారాయణో హరిః

సోంపాక సీత,
భద్రాచలం
86393 11050        

Post a Comment

0 Comments