బాలల గేయాలు.. చిటపట చినుకులు


బాలల గేయాలు.. చిటపట చినుకులు_harshanews.com

బాలల గేయాలు.. చిటపట చినుకులు 

బాల్యానికి ప్రధానమైన భూమిక బాలలు.బాలల వికాసం జరిగినప్పుడే భావి వికాసం జరుగుతుందన్నడంలో ఎలాంటి సందేహమూ లేదు. బాలల ఉనికి దేశానికి జీవనాడి.బాలలు బాగుపడితే దేశం బాగుపడుతుంది. జాతి మనుగడకు ఎదుగుదలకు తొలి బీజము బాల్యం. కల్మషాలు అంటే ఎరుగని అమాయక బాలల గురించి ఆడుతూ ఆడిస్తూ గెంతులేస్తూ.. కష్టమేమి నెరగక, దేనికి వెరవక బాలల గురించి సాగే సుందరమైన గేయాల మణిహారం ఈ "చిటపట చినుకులు" పుస్తక సంపుటి . 
బాల్యం గురించి , బాలల కోసం రాసిన గేయాలు "చిటపట చినుకులు" గా శ్రీమతి వడ్డేపల్లి సంధ్య గారు మన ముందుకు తెచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన వడ్డేపల్లి సంధ్య గారు ఉపాధ్యాయినిగా బాలల జీవితాన్ని సమగ్రంగా అర్థం చేసుకుని బాలలు ప్రదర్శించిన ప్రతిభను, బాలల అభిప్రాయాలను గేయాలుగా మలచి "చిటపట చినుకులు "మన ముందుకు తెచ్చారు. సినీ గేయ రచయిత, దర్శకులు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు చిటపట చినుకులను అభినందిస్తూ చిట్టి పొట్టి చిటపట చినుకుల్లో మెచ్చు మెరుపులు తళుక్కున తారసపడతాయి. 
బాలల మీద అభిమానాలు అభిప్రాయాలే చిటపట చినుకులుగా రూపుదిద్దుకున్నాయి అని అభిప్రాయపడ్డారు. 

డాక్టర్ పత్తిపాక మోహన్ గారు తన అభిప్రాయంలో బాల్యాన్ని బంగారం చేయడానికి కుటుంబం బడితో పాటు మంచి మిత్రుల వంటి బాల సాహిత్యం కూడా అవసర మేనని తెలిపారు. సాహితీ వేత్తలతో పాటు బాలలు కూడా రచనలు చేస్తున్నారు ఇది శుభ పరిణామం.ఇలాంటి బాలసాహిత్య ప్రక్రియ ఎంచుకుని వడ్డేపల్లి సంధ్య గారు చిటపట చినుకులతో మన ముందుకు వచ్చారు. ఈ చిటపట చినుకులు పుస్తకానికి చాలా చక్కని ముఖ చిత్రాన్ని దుండ్రపల్లి బాబు అందించారు. మెరుపులాంటి ప్రతి బాల గేయానికి చాలా చక్కని బొమ్మలు వేసిన అజయ్ గారు అభినందనీయులు.

"బొజ్జ గణపయ్య గేయంలో.. దండాలయ్య బొజ్జ గణపయ్య /వందనాలు అయ్యా ఓ బుజ్జి గణపయ్య/ " అంటూ గణపతిని ప్రార్థిస్తూ గేయం మొదలు పెట్టారు .అమ్మ నాన్న కవితలో "అమ్మంటే మమకారపు/ మహాకావ్యం/ అంతులేని ప్రేమకు/ ఆలంబనము. నాన్నంటే దారిచూపు /దీపస్తంభము /వేలు పట్టి /నడిపిస్తుంటే /ప్రేమబంధం" ... అంటూ అమ్మ నాన్నల ప్రేమ బంధంతో పాటు సోదరుల ప్రేమబంధాన్ని కూడా చక్కగా చెపుతూ కుటుంబ బంధాలు ఏవిధంగా ఉండాలో తెలియజేశారు. చిటపట చినుకులు గేయంలో... "చిటపట చినుకుల/ వాన కురిసెను /టపటపమని/రాళ్లు రాలెను.. పదపద మని/ పడవలు చేసేము/బిరబిర బిరమని /నీటిలో విడిచేము" ... చినుకుల గమ్మత్తును ,బాలల ఆనందాన్ని తెలియ చేసారు. 

"బడిబాట "గేయంలో "బడిబాట పిలిచింది/ వడివడిగా నడవరా/ అక్షరాలకు పూల బాట/ చదువులమ్మ జాతర…" అంటూ ప్రైవేటు వాడి బడి వద్దని ప్రతిన బూని అందరూ సర్కార్ బడి లో చేరాలని కవయిత్రి ఆకాంక్షించారు. "చీమా ..చీమా" గేయం లో "చిట్టి పొట్టి చీమలు/ చిన్నారి చీమలు/ క్రమశిక్షణలోన మేటి /సాటిలేని జీవులు.." అంటూ నాయకులు లేకుండా ఒకతాటిపై నడిచే చీమల గురించి చాలా చక్కగా తెలియజేశారు. "తరతరాల జాతి చరిత వెలిగించినదీ తెలుగు ఈ తెలుగు, ఈ వెలుగు వేల ఏండ్ల మన జిలుగు" అంటూ "తెలుగు వెలుగు" గురించి గొప్పగా తెలియ చేసింది "పరిశుభ్రత "గేయంలో "పరిసరాలు చక్కగా ఉంటే /ప్రగతి పథం అదే అదే/ ఊరువాడ బాగుంటే/సౌభాగ్యం అదే అదే.." అంటూ ప్రతి ఒక్కరు స్వచ్ఛత కొరకు కదంతొక్కి నడవాలి అని చాటారు.

 "తొలకరి గేయంలో"... "తొలకరి జల్లులు కురిశాయి /బిరబిరా వాగులు పారాయి..తొలకరి వస్తే భూమి పచ్చదనాన్ని సంతరించుకుంటుందని" కవయిత్రి ప్రకృతి గురించి చెప్పారు. "ఆడిపాడి పూజించి హారతులు ఇచ్చేరు బంగారు బతకమ్మ తల్లిని కొలిచేరు పోయిరా బతుకమ్మ పోయిరావమ్మా"… అంటూ తెలంగాణ పండుగ బతుకమ్మ వైభవాన్ని తెలిపారు . 
ఇలాంటివి ఎన్నో ఈ పుస్తకంలో బడి పిల్లలము, గడియారం, బడి తోట మా బడి, బతుకమ్మ, బోనం స్వచ్ఛభారత్, సోపానం, అన్నదాత రైతన్న , తొలకరి ,పరిశుభ్రత స్వచ్ఛభారత్, సంక్రాతి వంటి చక్కని బాలగేయాలు ఉన్నాయి. ఈ బాల గేయాలు పాడడానికి చాలా అందంగా ఉన్నాయి. బాలలను ఇట్టే ఆకట్టుకుంటాయి. 

బాల సాహితీ ప్రపంచాన్ని చాలా దగ్గరగా చూసిన స్ఫూర్తితో సంధ్య గారు ఈ "చిటపట చినుకులు" బాలల గేయాల పుస్తకాన్ని చాలా అందంగా రస రమ్యముగా తీర్చిదిద్ది మనకు అందించారు. పిల్లల ప్రవర్తన ప్రభావితం చేయడానికి ఈ బాలసాహిత్యం ఎంతో ఉపయోగపడుతుంది.ఈ బాల గేయాలు వల్ల పిల్లలు చాలా నేర్చుకుంటారు . అందుకే ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఈ పుస్తకాన్ని వారి తరగతిలో అందుబాటులో ఉంచి పిల్లలకు నేర్పించాలి భావితరాలకు బాటలు వేయాలి. "చిటపట చినుకులు" పేరుతో చక్కని బాల గేయ సంపుటిని అందించిన వడ్డేపల్లి సంధ్య గారి నుంచి మరిన్ని అమూల్యమైన రచనలు రావాలని ఆశిద్దాం.

ప్రతులకు
10-1-17/G,
శ్రీహరి నగర,రాంనగర్
కరీంనగర్ -505001


బాలల గేయాలు.. చిటపట చినుకులు_harshanews.com

సునీత బండారు
                           MA(Tel),MA(Eng),MA(Hin),B.Ed,HPT
పాలమూరు
94406 71530

Post a Comment

0 Comments