దృష్టి కోణం

దృష్టి కోణం_harshanews.com
Image by Alexandra Haynak from Pixabay 


నవ్వే పువ్వులో ఒలికిన
కన్నీటి కడవలెన్నో

కఠినమైన కొబ్బరిలో
కమ్మని తీర్థం ఏమిటో..

మేడిపండు మాటవెనక
కుళ్లుతున్న పురుగులెన్నో

మధువులో మునిగిన 
తేనెటీగకు ద్వేషపుకత్తులెందుకో

ఖ్యాతిగడించిన ఎవరెస్ట్ కింద
నలిగిన శ్రమశక్తిరాళ్లెన్నో

సీతాకోక రంగులవెనక
వైపరిత్యాల వాగులెన్నో

వెలుగునిచ్చే గుణంవెనక 
మైనపుదేహం త్యాగమెంతో

దృష్టికోణంలోనే ఉంది 
సృష్టి విన్యాసం అంత

మనోనేత్రాన్నితెరిచిచూస్తేనే 
అవగతమవుతుంది సిసలైన భావమంత

అనుమానపు చూపుకు
అంతటా చీకటే

ఆత్మ స్థైర్యపు దృష్టికి
ఎక్కడైనా ఆమని గీతమే..

దూరంగా చూస్తే గరుకైన కొండయూ 
నునుపుగానే కనిపిస్తుఁది

చిన్నఅద్దంలో ఒదిగిపోయిన కొండ ఔన్నత్యం 
సవ్యమైన దృష్టికోణమే తెలుపుతుంది..

...................................................
        గీతాశ్రీ స్వర్గం
     మెదక్
      99088 09407

Post a Comment

0 Comments