మట్టిపరిమళాల తాత్విక సౌగంధ్యం..

మట్టిపరిమళాల తాత్విక సౌగంధ్యం_harshanews.com
మట్టిపరిమళాల తాత్విక సౌగంధ్యం 


వచనకవితా సంపుటి: మట్టినై పుట్టాలని ఉంది..
రచయిత : డా.బి.బాలకృష్ణ, 
అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు), హైదరాబాద్, 
99489 97983.


మట్టితో మానవునికి గల అవినాభావ సంబంధం ఈ నాటిది కాదు అది ఏనాటిదో, మృణ్మయ సౌగంధ్యంతో జీవితం పరిమళించడం ఏనాటిదో.. యుగయుగాలుగా మనిషి జననం మట్టిలో, మనిషి మరణం మట్టిలోనే, జీవితాంతం మట్టితోనే సావాసం, మట్టితోనే సాజాత్యం. ఇది యుగయుగాల అనుబంధం, పరస్పర ప్రేమాభిమానాల సౌగంధ్యం. మనిషి పుట్టుక మట్టితోనే, అతని ఆటలు, పాటలు అన్ని మట్టిలోనే. అతను మట్టిలో జీవిస్తూ మట్టి ద్వారానే చదువు, సంస్కారాన్ని అభ్యసిస్తాడు. పుడమిపై మనిషి రెక్కల కష్టం నుండి జారిన స్వేదబిందువులు ప్రేమతో మట్టిని ముద్దాడగానే శ్రమ మొక్కకు చెమటపూలు వికసిస్తాయి. కర్షకుడు నేల తల్లినే నమ్ముకుని శ్రమజీవనం తీర్మానంపై చెమటపూల సంతకం చేసి మట్టి నుండి అమూల్య ధాన్యాల్ని పండించి కన్నీళ్ల కాలానికి శిస్తులు కట్టి, తాను అష్టకష్టాల్ని అనుభవించి పస్తులున్నా ప్రజలందరి ఆకలిని తీర్చే బందోబస్తు మాత్రం చేస్తాడు.

నేడు మట్టి అంటే చాలా అల్పస్థాయి మరియు లెక్కలేని వస్తువు, కాళ్ల కింద జీవంలేక అచేతనాస్థితిలో పడి ఉంటుందని ఎవ్వరు దాన్ని పట్టించుకునే స్థితిలో లేరు. కానీ నిజానికి మనకు ప్రాణం పోసేది, పెంచేది మరియు ప్రేమించేది మట్టియే, తుదకు మన ప్రాణం గాల్లో కలిసిపోయాక అందరూ మనల్ని తిరస్కరిస్తే కన్నతల్లిలా తన ఒళ్ళో ప్రేమగా దాచుకుని మాతృప్రేమను చాటిచెప్పేది మట్టియే. కనుక కర్షకుడిలా మట్టిని శ్వాసించాలి, రాముడిలా మట్టిని పూజించాలి, సీతలా మట్టిని ప్రేమించాలి.ఒక మనిషి ఎక్కడైతే సమాధి చేయబడతాడో అదే మట్టితో అతడిని ఆ విధాత రూపొందిస్తాడని ఇస్లాం మత విశ్వాసం.

కవిత్వమంటే మదిలో చెలరేగే అస్తవ్యస్త భావపరంపరల్ని, ఆలోచనా తరంగాల్ని, భావోద్వేగ కెరటాల్ని ఒడిసిపట్టి తనదైన శైలిలో క్రమబద్ధీకరించి, భావోద్వేగాల్ని అక్షరాల మూసలో పోసి పదాల పదబంధంలో బంధించి ఒక సక్రమమైన ఆకారాన్ని కల్పించి, ఊహల్లోని స్వప్నాల్ని సాకారం చేస్తూ పాఠకుల మనసుకు హత్తుకునేలా మలిచి వ్యక్తపర్చడమే.. కవిత్వమొక వ్యాపకం అది నిర్లిప్త, నిర్బల మరియు నిరాశమయ జీవితంలో ఆశావహ జీవనసౌగంధాల్ని పూయిస్తుంది, అదొక మాపకం వ్యక్తిత్వాన్ని, విలువల్ని, విశ్వాసాన్ని అక్షరాల ద్వారా తూకం వేస్తూ కొలుస్తుంది, కవిత్వం ఒక జ్ఞాపకం జీవన మధురిమల్ని, జీవితంలోని అనుభవాల్ని తీరిగ్గా నెమరేసుకోవడానికి ప్రేరేపిస్తుంది.

అభ్యుదయ భావాలతో, ఉదాత్తాశయాలతో నిత్య జీవితాన్ని కవిత్వంతో అన్వయించుకుంటూ, సాహిత్యంలో తనదైన ముద్రను వేయాలనే ఆకాంక్షతో కవిత్వలోకంలోకి దూసుకుని వచ్చిన ఉత్తుంగ తరంగం, ఉత్తేజ అక్షర శరం మరియు కవనకదుష్ణ విలక్షణ శైలి, అనంత సాహితీ తృష్ణను కల్గిన యువకవి డా.బి.బాలకృష్ణ.

2005 లో "అగ్నివసంతం"తో తెలుగు సాహిత్య ప్రపంచంలో తాను ఓ యువకవిగా ప్రస్థానం ప్రారంభించి నిప్పు కణికల్లాంటి అక్షరాలతో కవిత్వంలో నవవసంతం పూయించారు, 
2006 లో 'భావ చిత్రాలు' తన భావోద్వేగాల నేత్రాలై నిస్త్రాణ హృదయాల్ని రసరమ్యతతో మీటితే,
2009 లో 'విరహ సమీరాలు'లోని విరహావేదన, ప్రేమసమీరాల్లో తడవని హృదయమంటూ లేదు.
తనలోని అన్వేషణ దృక్పథంతో, పరిశోధనాకోణంతో, వ్యాసాభిరుచికి అనుగుణంగా 2018 లో వచ్చిన అక్షరవనం సాహిత్యపూదోటలో వ్యాస వ్యామోహాన్ని వెదజల్లింది.

2019 లో తన మదిగదిలోని కమ్మని కలల ఊయలలో ఊగుతూ రసాత్మక భావాల జల్లులతో వెలువడిన 'కలలగూడు' చిక్కటి రసికతతో, అభివ్యక్తితో పాఠకుల్ని పరవశమొందించింది..
బాలక్రిష్ణ నుంచి ప్రణయకవిత్వాన్ని కోరుకునే కవితాప్రియులకు మట్టినై పుట్టాలని ఉందనే ఈ రచన మట్టి సౌగంధ్యాన్ని, ఒక ఆధ్యాత్మిక, తాత్వికానుభూతిని పంచుతుందనడం అతిశయోక్తి కాదు.

ఆకలి మన చిరునామా, ఆకలియే మన వీలునామా అనీ ఆకలి గురించి
'ఆకలిని జయించిన నాడు..' అనే కవితలో..

అంతరిక్షాలను తాకిన ఆనందమెంతున్న/ ఆకలిని మించి ఎదగని అభివృద్ధి మనది / మనవిద్యలన్నీ మరో పూట కోసం / ప్రాకులాడే ఆకలి విన్యాసాలే../  అని మనదేశ అభివృద్ధి, నాగరికతలు అంతరిక్షాన్ని తాకినప్పటికీ ఆకలిని మించిన గొప్ప అభివృద్ధి మనది కాదని, మనవన్నీ మరో పూట కడుపు నింపుకోవడం కోసం చేసే ఆకలివిన్యాసాలని వర్ణించడం తాను నిజజీవితంలో అనుభవించిన కష్టాల కన్నీళ్లను, ఆకలి కేకల్ని అక్షరాల రూపంలో కవిత్వంలోకి అవలీలగా జొప్పించడం తన కవనశైలిని ప్రస్ఫుటం చేస్తుంది.


కాలానికి తొందరెక్కువ/ యుగాల అంచులు దాటాలని/ సమయానికి ఆశెక్కువ / సంవత్సరాల వయస్సు పెంచాలని.. 'కాలగమనం' కవితలో కాలగమనానికి తొందర, అత్యాశ ఎక్కువని మనుషుల్ని హాయిగా, ప్రశాంతంగా జీవించనివ్వకుండా కష్టాల రంగులరాట్నంలో ఊపిరాడ నివ్వకుండా సంవత్సరాల వయస్సు పెంచాలని, యుగాల అంచుల్ని దాటాలని తన పనిని కానిచ్చే స్వార్థంతో సదా విశ్వప్రయత్నాలు చేస్తుందని కాలవేగాన్ని కూడా శక్తివంతమైన తన అక్షరాల్లో బందీని చేసాడు.

అభివృద్ధి ధ్యాసలో, సంపాదన యావలో పడ్డ మనుషుల్ని ఉద్దేశిస్తూ వ్రాసిన
'శిథిలాకాశం మనది' అనే కవితలో..

శిథిలాకాశం మనది/ అనుబంధాలు చుక్కలుగా/ ముక్కలు ముక్కలుగా విడిపోతాయిక్కడ / మను షులు గిరీ గీసుకున్న కక్ష్యల్లో / భ్రమిస్తూ, పరిభ్రమిస్తారిక్కడ.. / అని కాలానుగుణంగా క్షయిస్తున్న అనుబంధాల్ని, మానవ సంబంధాల్ని, ఇతరులతో కలవకుండా గిరీ గీసుకుని జీవిస్తున్న సంకుచిత మనస్తత్వాల్ని సుతిమెత్తంగా తనదైన శైలిలో ఇక్కడ ఆవిష్కరించాడు రచయిత.

మట్టి యొక్క విశాల హృదయాన్ని, పరోపకార గుణాన్ని వర్ణిస్తూ.. 'మట్టినై పుట్టాలనుంది' అనే కవితలో మట్టిగుండెను నాగళ్లతో చీల్చివేస్తుంటే/ గాయమైన చోటల్లా /  పచ్చదనం పూసుకుని నవ్వేది.. / అని మనిషి తన సంపాదన, స్వార్థం కోసం మట్టి గుండెను నాగళ్లతో చీల్చినప్పటికీ గాయమైన చోటల్లా పచ్చదనాన్ని పూయిస్తుందని అనంత క్షమాధాత్రి యొక్క త్యాగ మహితను, పరోపకార గుణాన్ని బాలకృష్ణ కవిత వికసింపజేసింది.

ఈ లోకంలో కవిత్వముండని క్షణం/ అక్షరం శిథిలమైన మరుక్షణం / పంచభూతాల్లోకి నన్ను నేను / పరమాణువులుగా విసిరేసుకుంటాను.. /  అనే స్వీయ ప్రకటనతో ఓ అక్షర పిపాసిగా,
సాహిత్యాభిమానిగా, అక్షరంలోనే అక్షయమైన ఆనందముందని, కవిత్వంలోనే జీవితముందని, సాహిత్యంపై ధ్యాసయే తన శ్వాస కాబట్టి ఈ లోకంలో కవిత్వం లేని రోజున నన్ను నేను పంచభూతాల్లోకి విసిరేస్తానని చెప్పడం తనలోని సాహిత్యాభిమానానికి, అనంతమైన ప్రేమకు ఓ మచ్చుతునక.

మనిషి ఆరంభం మట్టియే, 
అతని అంతం కూడా మట్టియే 
విచిత్రమేమంటే అతనికి
మట్టి అంటే ఇష్టం లేదు,
మట్టి ఇల్లు, మట్టి మనుషులంటే ఆధునిక మానవునికి పొడగిట్టట్లేదు కానీ..

బాలకృష్ణ మట్టి విలువను మనసుకు హత్తుకునేలా వర్ణిస్తూ..

ఒక్కసారి మట్టినై పుట్టాలనుంది/ నదుల రక్తంలో అడుగంట కలిసిపోయి పచ్చగా నవ్వాలనుంది/ ఆకలే తప్ప అన్యమెరుగని చోట / పిడికెడు మెతుకులై ఒక్క పూటైనా బ్రతకాలని ఉంది../
అని బాలకృష్ణ గారు అభివృద్ధి, నాగరికతలు అంబరాన్ని తాకి, ఆధునిక మానవుడు అంతరిక్షాన్ని ఏలుతున్న ఈ రోజుల్లో ఆకలి ప్రపంచంలో పిడికెడు మెతుకులై, గతుకుల జీవితాల్లో ఒక్క పూట ఆకలిని తీర్చాలనుకొవడం తనలోని సేవాతత్పరతకు, త్యాగనిరతికి నిదర్శనం.

అయితే సాంకేతికాభివృద్ది అంతరిక్షాన్ని తాకి, నవ నాగరికత నలువైపులా విలసిల్లినందున సామాన్యమానవుని పాదాలు పుడమిపై ఉండక అహంకార నింగిలో స్వార్థపు రెక్కల సాయంతో ఎగురుతున్నాడనీ, నేటి మానవుడు అహంకారతత్వాన్ని ప్రదర్శింపజేస్తున్నాడనీ, అలా గాక ప్రతి మనిషి మట్టి నుండి విశాల, పరోపకార, నిర్మల గుణాల్ని కల్గివుండి మట్టిలా నిర్మలంగా నవ్వాలని, త్యాగ గుణాన్ని కల్గి ఉండాలని, మట్టివాసనల్ని నలువైపులా పరిమళింపజేయాలని మట్టిపై తనకున్న అంతులేని అభిమానాన్ని, ప్రేమను చాటడం తనలోని ప్రకృతి సౌందర్యానికి, తాత్విక సౌగంధ్యానికి ప్రతీక.

మొత్తానికి "మట్టినై పుట్టాలని ఉంది" అనే వచనాకవితాసంపుటి ద్వారా డా.బి.బాలకృష్ణ కర్కశ హృదయాలకు మట్టి అక్షరాల్ని రుద్ది మైనంలా సున్నితంగా మారిస్తే, మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి అభివృద్ధి, నాగరికత ముసుగులో తమ మూలాల్ని మర్చిపోయిన వారికి అనుబంధాల సుమగంధాల్ని, మూలాల్ని, అస్తిత్వాన్ని, గుర్తుచేస్తూ మనమంతా మట్టిని మర్చిపోయిన ఘనులమైనప్పటికి నిజానికి మట్టి మనుషులమనీ, మట్టియే మన గతం, మట్టియే మన వర్తమానం మరియు దాంతోనే మన భవిష్యత్తు ముడిపడి ఉందని తనదైన శైలిలో లోతైన భావాలతో వర్ణించడం ద్వారా తన నిరాడంబర, నిర్మల మరియు విశాలహృదయ మనస్తత్వంతో నిస్సందేహంగా పాఠకుల హృదయాలపై చెరగని ముద్రవేసి తాననుకున్న లక్ష్యాన్ని సాధించడం ముదావహం.

మట్టిపరిమళాల తాత్విక సౌగంధ్యం_harshanews.com

సమీక్షకులు: 
సర్ఫరాజ్ అన్వర్..
హైదరాబాద్.
9440981198

 


Post a Comment

0 Comments