Image by amypointer from Pixabay |
అన్నీ అమరిన చిలకవు నీవు..
చక్కని రూపము ఉంది..
ఉన్నత చదువు ఉంది..
తల్లిదండ్రుల అండ ఉంది..
ఆర్ధికంగా బలమూ ఉంది...
కానీ.......
ఒక బలహీన మనస్కుడి చేతిలో
కీలుబొమ్మవైనావు...
అతడు నవ్వితే నవ్వు..
తిడితే బాధ...
వద్దంటే విరక్తి..
లేకుంటే మనలేని స్థితి...
ఇదా నీ ఉనికి.... ఇదా నీ విలువ...
అమ్మానాన్న కనిపించలేదు....
తోబుట్టువు తోడు గుర్తురాలేదు..
స్నేహితుల ఆసరా మదికి రాలేదు..
అసలు నీకు నువ్వే జ్ఞప్తిలో లేదు...
అంతా అతడే.....
అర్హత లేని స్థానం కట్టబెట్టావు...
కళ్ళు మూసేసుకున్నావు..
మనసు విరిచేసుకున్నావు...
ప్రపంచాన్ని పరాయిదానిలా
చిత్రించేసుకున్నావు...
ఒంటరిదానిలా నిన్ను నీవే
ఖైదు చేసుకున్నావు..
వదిలేసావు.....
ఇన్నినాళ్ళ అనుబంధాల్ని...
పొందిన ఆనందాల్ని...
కట్టుకున్న ఆశల సౌధాల్ని..
వెలకట్టలేని నీ జీవితాన్ని...
తృణప్రాయంగా....
ముగిసిపోయిన నీ ప్రేమకథకి తర్పణంగా....
ఒక్కసారైనా నీ గురించి
ఆలోచిస్తే ఎంత బాగుండేది...
బయటకు వచ్చేసి నీ విలువను తెలియచేస్తే ఎంత గొప్పగా ఉండేది...
నీ తల్లిదండ్రులకు కొడుకులా మారితే ఎంత సంతోషం కలిగేది...
అసలైన నీవారు నీతోనే ఉండేవారు...
అన్నీ కోల్పోయావు....
నీ ఆత్మీయులకు తీరని వేదనను మిగిల్చావు..
ప్రేమ పేరిట మోసపోతున్నకొందరికైనా కనువిప్పు కలిగించావు...నీ ఆత్మైనా ప్రశాంతంగా ఉండాలి...(ఆత్మహత్య చేసుకున్న లావణ్య లహరి కోసం )
P.V. పద్మావతి దర్శి, ప్రకాశం జిల్లా. 98489 15117 |
0 Comments