కన్నీటి చుక్క

కన్నీటి చుక్క
Image by sir5life0 from Pixabay 

ప్రేమను వ్యక్తీకరించేందుకు
గులాబీపువ్వును అందించి
అది తీసుకునేపుడు
దాని కాడకు ఉండే
కంటకం గుచ్చుకునేలా చేసి
రుధిరాన్ని కళ్ళచూపి
కంటిలో నుండి కన్నీటిని
ఆహ్వానించి జీవితాంతం
ఇలాగే బాధను పరిచయం
చేసే వారినుండి
నీకు జరిగిన అన్యాయాన్ని
తుడిచిపెట్టుకొని పోవాలని

ఆత్మీయస్పర్శ లేక
అనురాగ మహిమ మరిచి
పాషాణమై పోయిన
నీ మనసులో
మళ్ళీ ఉత్తేజం
తీసుకురావాలని

గుండెగూటిలో నిక్షిప్తమై
ఇన్నాళ్లూ ఘనీభవించిన
దుఃఖసాగరాన్నికరిగించి
కనురెప్పలమాటున ఉబికించి
గుండె భారాన్ని తగ్గించి
తేలికచేయాలని

కళ్ళనుండి
జాలువారి అలాఅలా
బుగ్గలపై నుంచి సాగుతూ
అంతర్ధానం అయిపోతూ
ఒక్కక్షణం ఆలోచించా

అయినా కూడా
నిన్ను వదిలి
ఎలా వెళ్ళను
నీ ప్రతి సంతోషంలోనూ
బాధలోనూ నీ వెన్నంటి నీతోడుగా
ఉండింది నేనేకదా

అందుకే నీకోసమే
బాధకు,కష్టానికి
వీడ్కోలు చెబుతూ
సంతోషసమయానికి
స్వాగతం పలుకుతూ
మళ్ళీ నీ హృదయమందిరంలో
కొలువైనాను నేను
నీ ప్రియనేస్తమైన
నీ కన్నీటిచుక్కను
....................................................................................................
కన్నీటి చుక్క

సత్యనీలిమ
వనపర్తి
95021 56813 


Post a Comment

0 Comments