మాతృమూర్తికి అక్షరార్చన ‘జానకీ రాఘవీయం’

మాతృమూర్తికి అక్షరార్చన ‘జానకీ రాఘవీయం’_harshanews.com
మాతృమూర్తికి అక్షరార్చన ‘జానకీ రాఘవీయం’ అమ్మ అనే పదం ఒక అద్భుతం ఈ ప్రపంచంలో తల్లి స్థానం మరేది భర్తీ చేయలేదు. వేద భూమి అయిన మన భారతదేశంలో మాతృమూర్తిని దేవతలా భావిస్తారు. తల్లి కి చాలా గొప్ప స్థానం ఉంది. అమ్మపై వచన కవిత్వం , పద్యాలు, పాటలు  చాలా మంది రాసారు.

మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన తర్వాత అణచి పెట్టుకున్న సాహిత్య ప్రతిభ బయట పడుతుంది.అదే కోవలో తెలంగాణ ముద్దుబిడ్డ డాక్టర్​ చీదెళ్ళ సీతాలక్ష్మి  రచించిన జానకీ రాఘవీయం ( జననీశతకం ) పద్యకావ్యం లో ఏకంగా 132 ఆటవెలదులు రాసి అమ్మకు అక్షరార్చన చేసింది. "జానకమ్మ వంటి జనని లేదు" అనే మకుటంతో అమ్మ మీద ప్రేమ ఎంతో తెలియజేసింది ఈ పుస్తకంలో చీదెళ్ళ సీతాలక్ష్మి అమ్మగారు ఎనిమిది సంవత్సరాల వయసులో అత్తవారింట కాలుపెట్టి భర్త  అడుగు జాడల్లో ఆప్తస్నేహితురాలిగా నడిచింది.  ఆమె పడిన కష్టాలు వాటికి ఓర్చి చేవెళ్ల వంశం అభివృద్ధి కొరకు  తల్లిదండ్రులకు ఏ మచ్చా తీసుకు రాకుండా అత్తవారింట ఎలా నడుచుకుందో తెలియ చెప్పేదే  ఈ పద్య కావ్యం.

తల్లిగారింటిలో శాంతమ్మ అయినా జానకమ్మ గా అత్తవారింట్లో అడుగు పెట్టినప్పుడు ఎనిమిది సంవత్సరాల వయసు. వయసు చిన్నదే అయినా ఆ సీతమ్మవారికి ఉన్నంత సహనం ఆమెకు ఉంది. జానకమ్మ కు 10 మంది సంతానం తొమ్మిదవ సంతానంగా సీతాలక్ష్మి జన్మించింది. చిన్నది కావడం వల్లనేమో తల్లితో సీతాలక్ష్మి కి అనుబంధం, ఆప్యాయత ఎక్కువ కాబోలు.అందువల్లేనేమో ఈపద్య కావ్యరచనకు స్పూర్తి అయ్యింది. 

ఇక విషయానికొస్తే జానకి రాఘవీయం( జననీ శతకం) అమ్మ గురించి రాసిన శతకం అయినా నాన్న కు  ప్రాధాన్యం ఇచ్చింది సీతాలక్ష్మి.

పుత్రికయును మరియు పుత్రుడనుచుభేద
భావమెపుడు ఎఱక పడకుండా
అంత శ్రద్ధగాను అందర్ని చదివించె
జానకమ్మ వంటి జనని లేదు 

కూతురు కొడుకు అనే భేద భావం లేకుండా అందరిని సమానంగా చూసేది అందర్నీ గొప్పగా చదివించింది. తన తల్లి అంటుంది.

గోరుముద్ద పెట్టి కొండంత ధైర్యమ్ము
ఉగ్గు పాలు పోసి ఓర్పు నేర్పి 
సంతతమ్ము మాకు సంతసమొసగెడి

తను పెట్టిన గోరుముద్దల్లో  ధైర్యాన్ని ఉగ్గుపాలతో  ఓర్పును నేర్పి మమ్మల్ని సంతోషంగా ఉంచేది మా అమ్మ అంటుంది.

సీతకున్న ఓర్పు సిరియైన మాయమ్మ
నేర్పుకూర్పులోన ఓర్పులోన
సాటిలేరు ఎవరు మేటి జననినీవు

సీతకున్నంత ఓర్పు కలిగిన తన తల్లి నేర్పులోన తనతల్లికి ఎవరూ సాటిరారు అని గర్వంగా చెప్తుంది.

ఏమి కోరి వృక్ష మెంత ఎత్తు ఎదుగు
నీడ గూడునిచ్చి నిలుపు జనుల
చెట్టుయట్ల కాదె సిరిజల్లు మాయమ్మ

తల్లిన చెట్టు తో పోల్చింది నవమాసాలు మోసి కని పెంచిన తల్లి రుణం మనం చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా  ఆ ఋణం తీరదు అంటారు పెద్దలు .తల్లిని ఆవిష్కరించడానికి సీతాలక్ష్మి అంత పని చేసింది అనిపించింది. 

తల్లి పాదాల చెంతనే బిడ్డకు స్వర్గం ఉందంటారు సినారె గారు.అమ్మ ఒక వైపు దేవతలంతా ఒకవైపు సరితూచమంటే ఒరిగేను అమ్మవైపు అన్నట్లు  సీతాలక్ష్మి పరిమి వారి ఇంటి కోడలై తాను అమ్మ అయినా సరే తన తల్లితో అనుబంధం అంత గొప్పగా ఉంది.  జానకమ్మ తన జీవితంలో 82 సంవత్సరాలుగా చీదెళ్ళ వారి వంశాభివృద్ధి కోసం పడిన పాట్లు పిల్లలను తీర్చిదిద్దిన వైనం సీతాలక్ష్మి కళ్ళకు కట్టినట్లు వర్ణించారు .

మనసు వెన్నపూస మమత జూపునెపుడు 
అమ్ముయన్న  నాకు అంత ప్రీతి 
అమ్మయనుచు పిలువ ఆపదలు తొలుగు..

అని సీతాలక్ష్మి వారి అమ్మను వర్ణించినా అది అందరి అమ్మలకు వర్తిస్తుంది.

వెజ్జువైన నాన్న  వేద విద్యాల గాని
చేయిపెట్టి జూడ చింత తొలగు
ముఖం జూచి మందు ముందుగ తెలుపును 

అని నాన్న వైద్యుడనీ ముఖము చూడగానే మందుఏమిటో తెలిపేవాడని చేయిపెట్టి చూసి రోగమేమిటో చెప్పేవాడని వారి నాన్న గారిని వారి గొప్పతనాన్ని వర్ణించింది. ఇప్పుడు జానకమ్మ కు 90 సంవత్సరాల వయసు భర్త తనను  విడిచిపోయినా అతని జ్ఞాపకాలతో ఒంటరిగా నైనా చీకూచింతా లేక గడుపుతుంది.

కన్న పిల్లలంత కానకా తిరిగినా
అమ్మ మరవబోదు అట్టివాళ్ళ
జాలిచూపుగాని గేలిచేయదు అమ్మ
 
కన్న పిల్లలు ఎంత పట్టించుకోకపోయినా తల్లి మాత్రం పిల్లలను మరువదు వారిపై ప్రేమ చూపుతుందికానీ గేలిచేయదుకదా…!! ఇలా శతకంలోని పద్యాలు కవయిత్రి తన అమ్మను ఉద్దేశించి రాసినా అందరి అమ్మలకు వర్తిస్తుంది. వేమన పద్యాల శైలిలో రాసిన ఈ పద్యాలు విద్యార్థులకు చదువుకోవడానికి సులభశైలిలో చక్కగా ఉన్నాయి.

సీతాలక్ష్మి రాసిన పద్యాలను చదివి నేను నా తల్లిదండ్రుల ప్రేమను జ్ఞాపకం తెచ్చుకున్నాను. తన తల్లి పై రాసిన ఈ శతకాన్ని తన అత్తమామలు అయినా కీర్తిశేషులు పరిమి వెంకట సుబ్బలక్ష్మి వెంకట సీతారామాంజనేయులు గార్లకు అంకితం ఇచ్చారు. దీని వల్లనే తెలుస్తుంది  కన్నవారే తల్లిదండ్రులు అనుకోకుండా తన అత్త మామల లో తల్లిదండ్రులను చూసుకుంటుంది. ప్రస్తుత సమాజంలో అనుబంధాలన్నీ పతనమైపోతున్న తరుణంలో జననీశతకం ఓదార్పులా కనిపిస్తుంది. సీతాలక్ష్మి ఇది మా అమ్మ శతకం మాత్రమే కాదు సమాజంలో పిల్లల పట్ల బాధ్యతతో ప్రేమానురాగాలు పంచే పిల్లలను పెంచి పెద్ద చేసే ప్రతి తల్లికి వర్తిస్తుంది అంటారు సీతాలక్ష్మి.

అమ్మను అందంగా ఆవిష్కరించి అందరికీ అందుబాటులోకి తెచ్చిన డాక్టర్ చీదెళ్ళ సీతాలక్మి గారికి అభినందనలు తెలుపుతూ ఇంకా అముద్రితాలుగా ఉన్న తన రచనలను త్వరలోనే మనముందుకు తీసుకురావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు


ప్రతులకు:  

డాక్టర్ చీదెళ్ళ (పరిమి) సీతాలక్మి 
పుస్తకం వెల: 80/-
94903 67383


............................................................................................................

మాతృమూర్తికి అక్షరార్చన ‘జానకీ రాఘవీయం’_harshanews.com

సమీక్షకురాలు
జయంతి వాసరచెట్ల
హైదరాబాద్
8555849733

 Post a Comment

0 Comments