ఓ పరాన్న జీవి కరోనా !

ఓ పరాన్న జీవి కరోనా !_harshanews.com
ఓ పరాన్న జీవి కరోనా ! 


పక్కలో బల్లెం లాంటి 
పొరుగు దేశం నుండి ఊడిపడి
వందలు-వేలల్లో జనాభాను కబళించేసావ్ కదనే
మనిషి అర్భకత్వాని చూసి రెచ్చి పోతున్నావా ?

హఠాత్తుగా ప్రపంచ ప్రజలందరినీ 
అంటరాని వాళ్ళను చేసావే
నీవు తెచ్చే రోగానికి 
మందే లేదని విర్ర వీగుతూ
దేశ-విదేశ ఆరోగ్య సంస్థల 
అశక్తతను బట్ట బయలు చేశావ్

శ్వాస తీసుకోవాలన్నా, 
విష వాయువుని మించి 
భయ-భ్రాంతమయ్యిందే
నీ పాడు పుణ్యమా అని 
పాలకుల తెలివి మాలిన తనమో
తొందరపాటో..
గృహ-నిర్బంధాలు 
ఆర్ధిక దిగ్బందంగా పరిణమించి
పరిశ్రమలు ఖాయిలా పడుతున్నాయ్
వ్యాపారాలు దివాళా తీస్తున్నాయ్
వేలాది మంది నిరుద్యోగులయ్యారు 
వలస కార్మికులు ఇంటి బాట పట్టారు
వారికి పిడికెడు
అన్నం కూడా పెట్ట లేని 
నిర్దయులయ్యామే

        పదే-పదే పొడిగించిన 
        నిర్బంధంతో సాటి మనిషికి 
        సాయం చేయరాని
        మనిషి స్వార్థాన్ని
        అమానుషత్వాన్ని మా కళ్ళకు కట్టావ్ !
        నీవు దాడి చేసే కన్నా ముందు 
        ఆకలికి బలౌతారేమో వాళ్ళు

ఎంత ముసుగులు ధరించినా, 
ఎన్ని జాగ్రత్తలు పాటించినా
రహస్యంగా పొంచి ఉండి 
ఎందర్నో కాటేస్తున్నావ్
కషాయాలకు - గోసాయి చిట్కాలకు 
లొంగవని నిరూపిస్తున్నావ్
అన్ని వైద్యకీయ పద్ధతులని 
బేఖాతర్ చేస్తున్నావ్

        నేడో - రేపో 
        మేం వ్యాక్సిన్ కనిపెట్టక పోమా 
        నీ అంతు చూడక పోమా ?
        ప్రతి కుక్కకీ ఓ రోజు వచ్చినట్లే , 
        నీ దినం కూడా దగ్గర్లోనే ఉంది, ఖబడ్డార్ !!
        నిజంగా నీవెంత నీచ సూక్ష్మ జీవివే కరోనా ?
        ఇంకెన్నాళ్లు భరించాలో
        నీవు పెట్టే ఈ బహుముఖీన  హింసలు ?
................................................................................

వేంకట చండీశ్వర్  
బెంగళూరు 
89044 85650 

Post a Comment

0 Comments