ఓ శిథిల జ్ఞాపకం..

ఓ శిథిల జ్ఞాపకం_harshanews.com
ఓ శిథిల జ్ఞాపకం 


మూడు ఫీట్ల పొట్టిపిల్ల
ఈతకమ్మలతో నిర్మితమైన చిట్టిఉయ్యాల
మేదరిల్లు తన పుట్టినిల్లయితే
ఇంటి దూలం దాని మెట్టినిల్లు..

ఆత్మీయతానుబంధాల పెట్టుబడితో
ఆహారపదార్థాలు విరగకాసిన చెట్టు
మెట్లులేని స్థంబరహిత ఆకాశహర్మ్యంలో
నింగినుండి కిందికి వేలాడుతున్న షడ్రుచుల
ఆప్యాయతానురాగాల పుష్పం..

కాలపు దూలానికి వేలాడుతూ
అపరిశుభ్రతపై కత్తులు దూస్తూ
ఇంటిల్లిపాది నోటిలో ఊరిళ్లు ఊరిస్తూ
పాలపదార్థాల సౌభాగ్యంతో నిండిఉండి
గాలివాటానికి నాట్యమాడే మయూరం..

పాలు,పెరుగుల్ని తుంటరి పిల్లులు,
అల్లరిపిల్లల, చిలిపి కృష్ణుళ్ల నుండి
రక్షించడానికి మట్టి ఇంటి దూలాలకు
మూలంగా వాసాలకు వేలాడే
అపురూప అలంకారం..

బాల్యంలో అమ్మమ్మ ఇంట్లో పిట్టగొడపై
నిలబడి ఉట్టిని ఆసరాగా చేసుకుని
ఇంటి దులాలపై చేసే అల్లరివిన్యాసాలు
అంతాఇంతా కావు..
నేటి ఆధునికయుగంలో ఉట్టిని వేలాడదీయడం
ఇలువతుట్టియే కాదు
అదొక అనాగరిక చర్య కూడా కొందరి దృష్టిలో..

ప్రతి ఇంట్లో కొలువుదీరిన
అతిశీతలయంత్రం ఆగమనంతో
మన తాతముత్తాతల వారసత్వసంపదయైన
ఉట్టి కాలం చేసిన గాయానికి త్రుప్పుపట్టి
మరుగున పడి, ఓ శిథిల జ్ఞాపకంగా
మిగిలిపోయింది మనతరం మనోఫలకాలపై
దానితో పాటే ఉమ్మడికుటుంబాలు కూడా
విచ్చిన్నమయ్యాయి..

..................................................

సర్ఫరాజ్ అన్వర్.. 
రాజేంద్ర నగర్, హైదరాబాద్
94409 81198

Post a Comment

0 Comments