హృదయాన్ని తాకిన కవన చినుకు..

హృదయాన్ని తాకిన కవన చినుకు.._harshanews.com
హృదయాన్ని తాకిన కవన చినుకు.. 


వచన కవితాసంపుటి : 
చినుకు తాకిన నేల
కవయిత్రి : 
శాంతిక్రిష్ణ, హైదరాబాద్
95022 36670


కవిత్వమంటే మానసిక సంఘర్షణను, ప్రకృతి ఆరాధనను, సమస్యలపై స్పందనను ముడిసరుకుగా ఒడిసిపట్టి, అక్షరాల కర్మాగారంలో వేసి తీర్చిదిద్ది, తమదైన రీతిలో కవిత్వీకరించి పాఠకుల హృదయాల్ని తడిమి వాటిని తడిచేయడం, వారి మనసులపై చెరగని ముద్ర వేయడమే. ఆధునిక కవులు ప్రకృతి, ప్రేమ, సంబంధ బాంధవ్యాలు, సమాజం తీరుతెన్నులపై కవిత్వం వ్రాస్తుంటారు. అలాంటి కోవకు చెందిన కవయిత్రియే శాంతిక్రిష్ణ. ఎక్కువగా ప్రకృతి దృశ్యాల్ని ఆరాధించే తనకు వాన అన్న, సముద్రం అన్న, ప్రకృతి అన్న చాలా ఇష్టం. ఏ సుందరదృశ్యాన్ని గాంచిన దానికి అక్షరరూపం ఇవ్వడం తన అలవాటు.

భావుకత అంటే మక్కువ, తన భావాలన్ని సున్నితంగా ఉండి, అందరి హృదయాల్ని స్పృశిస్తాయి. ఏదైనా దృశ్యం, సంఘటన మనల్ని కదిలించినపుడు మన మనసు కూడా "చినుకు తాకిన నేల" లాగా స్వచ్ఛంగా, సహజంగా పరిమళించాలని కవయిత్రి అభిప్రాయం.  కవులు వాన చినుకుల్ని కాని వాటితో తడిసి మట్టి పరిమళాల్ని వెదజల్లే మట్టిని కానీ ఆస్వాదించడం, వ్యక్తీకరించడం చేస్తారు కానీ శాంతిక్రిష్ణ ఏకకాలంలో వానచినుకుల సయ్యాటలతో పాటు పరిమళించిన మట్టి సౌందర్యాన్ని ఏకకాలంలో వ్యక్తీకరించడం తనకే చెల్లింది.

ఒక్క పుస్తకం కూడా ప్రచురించకుండానే శాంతిక్రిష్ణ ఇటీవలి కాలంలో సమీక్షకురాలుగా, విమర్శకురాలుగా మరియు కవయిత్రిగా ప్రసిద్ధికెక్కారు, ఇదంతా కేవలం తనకున్న సాహిత్యాభిమానం, అంకితభావం, సామాజిక మాధ్యమాల వల్లే సాధ్యమైనదని చెప్పవచ్చు. ఆధునిక సాహిత్యకారుల అమ్ములపొదిలో గల పాశుపాతాస్త్రం సామాజిక మాధ్యమం,  ఆ అస్త్రం ఇంతకు ముందు పూర్వకవుల వద్ద లేదు.

ఆహ్వానం, పగిలిన మనసులు, ఆడపిల్లా ఆశపడకు, వెన్నెలకూన, మృగాడు.. అనే కవితల ద్వారా లోకం పోకడల్ని, కుట్రలు, కుతంత్రాలని తెలియజేస్తూ అమ్మాయిలందర్ని అప్రమత్తం చేస్తూ వ్రాసిన కవితలు ఓ అమ్మ చెప్పిన సుద్దుల్లా మనకన్పిస్తే, ఆమె వ్రాసిన గిడుగు రామ్మూర్తి, మా తెలుగు తల్లి, తెలుగు సవ్వడి.. మొదలగు కవితలు భాష, సాహిత్యం, కవిత్వం పట్ల తనకున్న ఆసక్తికి, అభిమానానికి నిదర్శనం. 

సంద్రం పిలుపు, గూడు రిక్షా, ఓ అమ్మ.. కవితల ద్వారా చుట్టున్న సమాజం పట్ల, సాటి మనుషుల పట్ల మనిషిగా మనకుండాల్సిన సామాజికబాధ్యతను తట్టి లేపితే, దామోదరం సంజీవయ్య, శ్రీ శ్రీ, రవీంద్రుడు, ఇందిరా గాంధీ లాంటి మహోన్నత వ్యక్తిత్వాలపై కవిత్వం రాయడం తన సామాజిక బాధ్యతను తెలియజేస్తుంది.

వానకు వందనం, మేఘాల బోనాలు, తరలిపోతున్న మేఘమాల, వసంతరాత్రులు.. మొదలగు ప్రకృతిని వర్ణిస్తూ రాసిన కవితలు ప్రకృతి సౌందర్యాన్ని మన ముందు ఆవిష్కరిస్తాయి..
గురువంటే నాన్నే, అమ్మా నీకు వందనం, ఒంటరితనం.. అనే కవితలు మది పూదోటలోని అనుబంధాల పూల పరిమళాల్ని మన వద్దకు మోసుకువస్తాయి.

సైనికులపై రాసిన కవిత్వం దేశభక్తికి, ప్రపంచ శాంతిపై రాసిన కవిత యుద్ధ విముఖతకు, "ఆమె కలం" శీర్షికతో రాసిన కవనం కవయిత్రికి గల బాధ్యతకు అద్దం పడ్తుంది. కవిత్వం చదవని రోజు, రాయని రోజు, ఆస్వాదించని రోజుకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని ఆమె ఉద్దేశం.

తన గుండె గూటిలో ప్రతిష్టింపజేసిన నాన్నగారి మీద గల అపారాభిమానాన్ని, ఆరాధనాభావాన్ని..
నాన్నంటే హిమోన్నత శిఖరమే../ 
వినయవిజయానికి సోపానమని/
ఎంత ఎదిగిన ఒదిగుండమని/
అనుక్షణం హెచ్చరిస్తూ../
అని "గురువంటే నాన్నే" కవితలో నాన్న గారిని హిమశిఖరంతో సరిసమానంగా అత్యున్నత గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టి, ఎంతటి ఉన్నతస్థానంలో ఉన్నప్పటికీ వినయవిధేయతలతో ఒదిగి ఉండాలని ఏ నాన్నైన చెప్తారని కవయిత్రి అభిప్రాయం.

రెక్కాడితే డొక్కాడని బెస్తవారి జీవితాల్ని దగ్గరి నుండి పరిశీలించిన అనుభవముందేమో అందుకే 
"సంద్రం పిలుపు" అనే కవితలో
ఎపుడు బతుకు వేటే గంగపుత్రులది,/ 
వాన లేకుంటే సంద్రంపై/
వాన పడితే ఆకలిపై../
బెస్తపల్లె ముడుచుకున్న గువ్వలా ఉంది నేడు/
దిగులు గుప్పెట్లో ఒదిగిపోతూ../
అని గంగపుత్రుల జీవితం ఎపుడు బతుకు వేటలోనే మునిగి ఉంటుందని వాన లేకుంటే సంద్రంపై చేపలు పడుతూ, వరదొస్తే తిండి లేక ఆకలిపై పోరాటమే వారికి దిక్కని,
బెస్తవారి జీవితాల్ని దగ్గర్నుండి తడిమి చూసినట్లు చక్కటి అభివ్యక్తి చదువరుల్ని ఇట్టే కట్టిపడేస్తుంది.

నీ మనసును ఏదైనా తడిస్పర్శిస్తే/
చినుకు తాకిన నేలలా పరిమళించు/
నిదురించిన మానవత్వాన్ని/
మరీ మరీ తట్టిలేపు/
అని "చినుకుతాకిన నేల"లో నేటి కాలంలో మనషులంతా మనసులేని మరమనషులయ్యారని,
చుట్టుపక్కల జరుగుతున్న అన్యాయాక్రమాల్ని పట్టించుకోవట్లేదని, అలా గాకుండా మన మనసును ఏదైనా తడిమితే, స్పర్శిస్తే చినుకు తాకిన నేలలా పరిమళించి నిద్రించిన జాలి, దయా గుణాల్ని, మానవత్వాన్ని మరీ మరీ తట్టిలేపాలని కవయిత్రి మార్గనిర్దేశనం చేస్తుంది.

తరువు అన్ని కోణాల్లో మనిషికి గురువనే భావాన్ని, దాని త్యాగశీలతను పర్యాప్తం చేస్తూ.. అవని శిగలో/ అందమైన పువ్వు అడవి../ పువ్వుని కత్తిరించి/అవనికి వైధవ్యాన్ని/ ఆపాదించకండి../ అని నల్లమల సంకలనం కోసం వ్రాసిన "వైధవ్యం" కవితలో పుడమి సిగలో అడవనేది ఒక అందమైన పుష్పమనీ, ఆ పుష్పాన్ని మానవ స్వార్థంతో కత్తిరించి అవనిని విధవగా మార్చకండి అని చేసిన హితబోధ మన చెవుల్లో మార్మోగుతుంది.

ఎందరో కవులు మహిళల్ని ప్రకృతితో పోల్చుతూ కవితల్ని వ్రాస్తే, తాను కూడా చీరకట్టులోనే మహిళ యొక్క సంపూర్ణవ్యక్తిత్వం, మూర్తిమత్వం అగుపిస్తుందని..
ఎన్ని సొబగులో చీరకట్టులో/
ఎంతజాణతనమో ఆ కనికట్టులో/
పాదాల జీరాడు కుచ్చిళ్ళు/
అటు ఇటు తిరిగే నెమళ్ళు..
అని "ఎన్ని సొబగులో.." అనే కవితలో అతి సాధారణ దృశ్యమైన చీరకుచ్చిళ్ళ కదలికల్ని
తను అపురూపంగా పట్టేసి వాటికి మహితను కల్పించిన పదాల నేర్పరితనం తనలోని వ్యక్తీకరణ శక్తికి ప్రతిబింబం..

మొత్తంమీద శాంతిక్రిష్ణ తన "చినుకు తాకిన నేల" వచన కవితా సంపుటి ద్వారా ప్రకృతి దృశ్యాల్ని ప్రేమగా అందిపుచ్చుకుని అందంగా మలిచి, చుట్టున్న పరిస్థితుల్ని, బతుకువేటలో ఆపసోపాలు పడ్తున్న వారి ఈతిబాధల్ని ఆవిష్కరిస్తూ సాటి మనిషిగా మనకు గల సామాజిక బాధ్యతల్ని తట్టి లేపుతూ వ్రాసిన కవితలు మనల్ని ఆలోచింపజేస్తాయి. లోకంలో మహిళలపై జరుగుతున్న ఆగడాలు, అన్యాయాక్రమాలపై పదాల ఉక్కుపాదం మోపి, మహిళలకు వాటిపట్ల అప్రమత్తత, జాగరుకతల్ని తెలుపుతూ హితబోధ చేయడం మరువలేనిది. అలాగే దేశభక్తిపై, ప్రపంచ శాంతిపై వ్రాసిన కవితలు ఆమెను సార్థకనామధేయురాలిగా నిలబెడితే, పసికూనలు, అమ్మ నీకు వందనం, నాన్న..కవితలు అనుబంధాల పూలని వికసింపజేసి పాఠకుల హృదయాల్ని తడిచేస్తాయి. ఈ విధంగా దాదాపు అన్ని అంశాల్ని, అన్ని కోణాల్లో స్పృశిస్తూ చక్కటి ప్రతీకలు, పోలికలు, ఉపమానాలతో చూడ చక్కని శిల్పంతో ఒక చేయిదిరిగిన శిల్పి చెక్కిన శిల్పంలా తన కవితలన్నియు మనల్ని కట్టిపడేస్తాయి.

నింగిని వీడిన చినుకు నేలను తాకి మృణ్మయవాసనల్ని పరిమళింపజేస్తే, శాంతిక్రిష్ణ కవిత్వం హృదయాల్ని పులకింపజేస్తుంది. ఇలా తన తొలి పుస్తకం ద్వారా పాఠకులను కట్టిపడేసి, లైన్ బై లైన్ కళ్ళు పరిగెత్తేలా రాసిన కవితలు వారి హృదయాలపై చెరగని ముద్రవేస్తాయని చెప్పడం అతిశయోక్తి కాదేమో..

హృదయాన్ని తాకిన కవన చినుకు.._harshanews.com

సమీక్ష..: 
సర్ఫరాజ్ అన్వర్.. 
హైదరాబాద్.
94409 81198 

Post a Comment

0 Comments