ప్రపంచపదులు

ప్రపంచపదులు_harshanews.com
ప్రపంచపదులు 


నలుపురంగు ఏదో జాతికి సంకేతమవుతున్నది
తెలుపురంగు ఏదో జగతికి వెన్నెలకిరణమవుతున్నది
రంగులేని వస్తువుందా ఈ రంగురంగుల లోకంలో
పసుపురంగు ఏదో శుభకార్యానికి సూచికవుతున్నది
ఎరుపురంగు ఏదో ఉద్యమానికి బీజమవుతున్నది

సాగరంలోనే చూసి పరవశించిపోవాలి అలల అందాన్ని
పువ్వులోనే చూసి పులకించిపోవాలి పరిమళ గంధాన్ని
చూసేదృష్టిని బట్టి చూపు నిలిపితేనే దృశ్యానికి సార్థకత
కళ్ళతోనే చూసి మనసుకరిగిపోవాలి అందమైన శిల్పాన్ని
మనసుతోనే చూసి మురిసిపోవాలి భావాత్మక చిత్రాన్ని 

మన జీవితం దాగున్నది అలల సుడిగుండంలోనే
మన బతుకు నడుస్తున్నది కలల జీవనగమనంలోనే
జీవితమంటే ఎడారిలోని సెలిమెనే కదా ఎప్పటికీ
మన జీవనం గడుస్తున్నది అలల సంసారసాగరంలోనే
మన గమనం సాగుతున్నది కలల ప్రపంచంలోనే

పెరటిలోని పూలు పలకరిస్తుంటాయి నువ్వు వస్తుంటే
వంటింట్లో గిన్నెలు ఎదురుచూస్తుంటాయి నువ్వు రాకుంటే
ఎదురుచూపులోనే ఎంత ఆనందముంటుంది ఎదవాకిట్లో
నోట్లోని మాటలు ముత్యాలవుతుంటాయి నువ్వు పల్కుతుంటే
నింగిలోని వెన్నెల్లా కురుస్తుంటాయి నువ్వు నవ్వుతుంటే

ఏ లేపనం పూస్తే నయమవుతుంది గాయపడిన దేహానికి
ఏ రాగం పలికితే గానమవుతుంది మూగబోయిన మనిషికి
సప్తస్వరాల సంగమమే జీవితాన వెన్నెల కాసే వేకువ
ఏ విత్తు నాటితే మొలకెత్తుతుంది బీడువారిన పొలానికి
ఏ చీకటి తరిమేస్తే వెలుగవుతుంది దిగులునిండిన శోకానికి
.....................................................................................................
                                  - డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
                                       90328 44017

Post a Comment

0 Comments