గుండెను పిండేశే.. అక్షరమే నా ఆస్తి

గుండెను పిండేశే.. అక్షరమే నా ఆస్తి_harshanews.com
గుండెను పిండేశే.. అక్షరమే నా ఆస్తి సాహిత్యాన్ని తన కొరకు కాకుండా సమాజం కొరకు రాస్తూ తన ఆర్తిని ఆవేదనను  అక్షర రూపంలో తెలుపుతూ తన  చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రశ్నిస్తూ ప్రజాకవి శ్రీ శ్రీ , అలిశెట్టి ప్రభాకర్ ల యొక్క ప్రభావాన్ని రంగరించుకునీ ముందుకు నడుస్తున్న యువకవి ఆదోని.. అభిరాం. 

అమ్మ నుంచి మరో అమ్మ పుట్టే భారాన్ని తను  మోసి సృష్టిని చంటిపిల్ల గా మార్చుకొని మమకారపు చనుబాలతో మానవత్వాన్ని నింపి మమకారం పంచే అమ్మ గురించి చెబుతూ  "నవ మాసాలు మోసే ధరణి ప్రసవ నొప్పులు ఓర్చుకునే ఓర్పు అన్నం పెట్టే చెయ్యి లాలించే పాట..." అంటూనే.. నేటి సమాజం స్త్రీని  "ఆడదంటే యవ్వనపు కట్టెలో చెలరేగే వేడినీటి సెగలను భరించే పూల బొమ్మని.. అనుకుంటున్న కామపు బొమ్మలకేమి తెలుసు... మానవత్వాన్ని నింపుకున్న ఆడజన్మ గురించి?.. అని అమ్మ గురించి అభిరామ్ చాలా చక్కగా వివరించారు. 
 
చదువుకు శ్రద్ద చూపని ప్రాంతంలో తిరిగినా పెరిగినా పదవ తరగతి పూర్తి చేసి ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్ పూర్తి చేసి సమాజమే నా జీవన పాఠశాల అందులో గురువు నా సదాశివుడు అని చెబుతూ అభిరాం సాహిత్యంపై అభిప్రాయాన్ని ఎంతో చక్కగా వివరించాడు. "అక్షరములే నా ఆస్తి , పదము నా  పదవి, వాక్యము నా వేకువ, కవిత్వం నా జీవితం" అంటూ సమాజంలోని అసమానతలను ఈ కవితా సంకలనంలోన తూర్పార బట్టాడు. . కవిత్వం అంటే ఎంతో గొప్ప వాళ్ళు రాస్తారు అనేది...అటువంటి భావనలు చెరిపి వేస్తూ  పాతికేళ్ల లోపే వంద సంవత్సరాల గుర్తుంచుకునే కవిత్వాన్ని రాశాడు. పదాలలో కఠిన పదాలు లేకుండా అష్టాదశ వర్ణనలకు తావు ఇవ్వకుండా తన చుట్టూ తిరిగే సమాజాన్ని చదివి అక్షరాలే ఆయుధాలుగా తన కవిత్వాన్ని సమాజం లోకి  వదిలాడు. 

అభిరామ్ యొక్క ఆవేదన ఆర్ద్రత తన చుట్టూ జరుగుతున్న  సమకాలీన పరిస్థితుల పై కవితల కలాన్ని అస్త్రాన్ని సంధించి "వ్యాపారాల అభివృద్ధికి పుట్టిందే వ్యాలెన్స్ డే అని చెపుతూ తన కవితలో మనిషి లేకుండానే ఆ మనసుతో ఆర్తిగా ముచ్చటించుకుందాం అప్పుడు తెలుస్తుంది ప్రేమ విలువ అది ఈ సృష్టిలో ఎక్కడైనా అదే ప్రేమ పేరుతో స్థానం సంపాదించుకునే నిజమైన ప్రేమ" అంటూ వ్యాపారంగా మారిన ప్రేమికుల దినోత్సవాన్ని చక్కగా వివరించాడు .అవసరం ఉన్నంత వరకు మన మధ్య తిరిగే అవసరం తీరాక మనకే వెన్నుపోటు పొడుస్తున్న సమాజంలోని మనుషుల యొక్క చిత్రాలను పూసగుచ్చినట్టు వివరించి చూపించారు .

 "చెమట చుక్కల తో పచ్చదనాన్ని ముగ్గు గా మలచి కష్టపడే నాగలి పట్టిన రైతును నామోషీగా చూసేవారు..ముసలి వయసులో తమ కొడుకులు తల్లిదండ్రులను  బయటికి పంపిస్తున్న వైనాన్ని" కళ్లకు కట్టినట్టుగా చెప్పాడు. ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంట చేతికి రాక పోతే విలవిల్లాడుతున్న రైతుల గురించి చెబుతూ "మెరిసిపోతూన్న మబ్బును చూసి మురిసిపోతూ.  మైమరిసిపోతూ పత్తి గింజలు పెట్టి నడుము నొప్పి తెచ్చుకొని మూడు దినాలు గడవకముందే ... రైతుల బతుకు దినదిన గండం అయింది వేసిన గింజలు మొలకరాక  పెట్టుబడి చేతికిరాక దిగాలు పడి.. బతుకులు బుగ్గి పాలవుతున్నాయి"  అని  రైతుల ఘోషను తెలిపాడు. 

పరాయి భాషలో మోజుపడి మాతృభాష మరుస్తున్న నేటి యువతరానికి చెంపపెట్టుగా చెబుతూ  "పరాయి భాషలన్ని నేలపై తారలైతే ఆ తారలకే వెన్నెలనిచ్ఛే నేల చంద్రుడే తెలుగు..పరాయి భాషలన్నీ పోటాపోటీ తత్వాలు అయితే ఆ పోటీ కి దీటుగా నిలిచిన ద్రవిడ భాష మన తెలుగు"  అని తెలుగు వెలుగును ప్రసరింప జేశాడు. 

వర్తమాన రాజకీయాల గురించి  చెబుతూ కూడా ఒక పార్టీలో  గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్తున్న జంప్ జిలానీల గురించి సమాజానికి చేటు తెస్తున్న అవినీతి నాయకుల గురించి చెంపపెట్టు గా కవితలను ప్రసరింప జేశాడు ."నిజమే ఎన్నికల సమాచారం నేడు దారితప్పి వ్యభిచారం అయింది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎన్నికల సంసారం నేడు దారి తప్పి పోయింది అవినీతికి ఊపిరి పోస్తూ నిజాయితీకి నీళ్లోదురుతున్నారు" అని ప్రజాస్వామ్య పరిరక్షణను సమాజంలోని వాస్తవాలను వెలికి తీస్తూ ఏకిపారేశాడు. దేశ భవిష్యత్తు తరగతి గదిలో సిద్ధ పడుతుంది అని గురువు గురించి చెబుతూ" తాను వెలుగుతూ  కరిగిపోతూ చెంతకు చేరిన గొంగళి పురుగులను విజ్ఞాన సీతాకోకచిలుకలను చేస్తుంటాడు"   మా మాష్టారు సత్యనారాయణ అంటూ తన చిన్నప్పటి మాస్టారు సత్యనారాయణ గారిని గుర్తు చేసుకున్నాడు. 

అభిరామ్ కవితలు సమాజానికి ఉపయోగపడేలా , అవినీతిని ప్రశ్నించేలా, నారీ లోకానికి బాసటగా, పురుషాధిక్యతను ఎదురించేలా సాగుతూ, మానవత్వం మూర్తీభవించిన సాహిత్యంతో అనుకున్నది సూటిగా చెబుతూ తన కవిత్వానికి పదును పెడుతూ  ప్రజలకు అందజేస్తున్న వైనం సంతోష దాయకం. భవిష్యత్తులో మరిన్ని కవితలు రాసి సమాజానికి ఉపయోగపడే అభిరామ్ నవతరం కవిగా మరో ప్రజా కవి గా సేవలందించాలని కోరుకుందాం.

ప్రతులకు : 
అభిరామ్ 
ఇంటి నెంబర్ -179
పర్వతాపురం 
ఆదోని -కర్నూలు జిల్లా 
ఆంధ్రప్రదేశ్ 
...............................................................................

గుండెను పిండేశే.. అక్షరమే నా ఆస్తి_harshanews.com

పుస్తక సమీక్షకులు
రవి చంచల
ఎమ్మెస్సీ, ఎమ్మే, బీ.ఎడ్ 
పాలమూరు
8500330700


Post a Comment

0 Comments