అబ్ధుల్ కలాంకు సలాం..

అబ్ధుల్ కలాంకు సలాం.._harshanews.com
అబ్ధుల్ కలాంకు సలాం..


ఎన్ని పుష్కర స్నానాల ఫలితమో
మరెన్ని రాజసూయ యాగాల ఫలితమో

మన కర్మభూమి భరతావనిలో
ఇంతగొప్ప మనిషి జన్మించాడు

ఎక్కడి రామేశ్వరం
మరెక్కడి షిల్లాంగ్
ఎనుబది నాలుగేళ్ల ప్రయాణం

అతని జీవితం అంతా కృషిమయం
ఎంతో విజ్ఞానం ఆ ఋషి మయం

అగ్ని..త్రిశూల్‌..పృథ్వి వంటి
క్షిపణులను సైతం
భారతదేశ అంబులపొదిలో
ఆయుధాలుగా కాకుండా

భరతమాత సిగలో
సిరి మల్లెలుగా అమర్చిన
శాంతమూర్తి

శాస్త్ర విజ్ఞానం
మన ధీరత్వానికి ప్రతీకలే గానీ
పౌరుషానికి సమిధలు కావని తేల్చి చెప్పిన
సహనమూర్తి

రాకెట్ తయారు చేసే సమయంలో
పోలియో కాలిపర్స్
తయారు చేసిన... ఘనుడు

క్షిపణుల తయారీ సూత్రంతో
గుండెకు ఉపయోగించే
స్టంట్ ను రూపొందించిన.. ధన్యుడు


దైవాన్ని నమ్మడంలో
మతంలో మానవత్వంలో
ఏకత్వం చూపిన ఘనాపాఠీ
తనతో పనిచేసిన వారిలో

కేవలం మంచినే గ్రహించిన
హంస స్వభావి
 
చివరి నిమిషం వరకూ
తన గురువుల ప్రభావాన్ని
మరిచిపోలేని..మంచి విద్యార్థి

దేశం లోని ప్రతివిద్యార్థి మదిలో
నిత్య స్ఫూర్తిని నింపిన చిరంజీవి

మనదేశాన్ని ప్రపంచ దేశాలముందు
అగ్రస్థానంలో నిలపాలని 
తాపత్రయపడిన స్వప్నజీవి

వివేకానంద.. గాంధీజీ.. మదర్ థెరెస్సా
వరుసలో ఒదిగిపోయి
మన మనస్సుల్లో
ఎప్పటికీ అలాగే నిలిచిపోయి

ఆయన సంపాదించిన
అత్యున్నత పురస్కారాలన్నీ
మనకోసం వదిలి
మన ప్రేమాభిమానాలు మాత్రం
పట్టుకెళ్లిన ...

 భారతరత్నా..  ఓ అబ్ధుల్ కలాం
అందుకోవయ్యా నా సలాం

మళ్లీ నువ్వూ..
చెరగని నీ చిరునవ్వూ..
భారతావనిలోనే తిరిగి జన్మించాలనీ...
మనసారా కోరుకుంటూ
పలకనీ దిక్కులు పిక్కటిల్లేటట్లు..

జై..అబ్దుల్ కలాం..
జయహో..అబ్దుల్ కలాం...
.............................................................................

అబ్ధుల్ కలాంకు సలాం.._harshanews.com
గంజాం భ్రమరాంబ
తిరుపతి
9949932918

Post a Comment

0 Comments