పిల్లల పెంపకం.. తల్లిదండ్రుల బాధ్యత

 
పిల్లల పెంపకం.. తల్లిదండ్రుల బాధ్యత
Image by eommina from Pixabay 


మారుతున్న కాలంలో పిల్లల పెంపకం తల్లిదండ్రులకు తలనొప్పిగా మారుతోంది..  పిల్లలు చిన్న చిన్న విషయాలకే మనస్తాపానికి గురవుతున్నారు.. ఏ చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేని పరిస్థితి వారిది..  ఏదైనా సమస్య చోటుచేసుకున్న సందర్భంలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు..  పిల్లల అభిరుచులేంటో తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన పరిస్థితి.. పిల్లల పోషణలో వారిని లాలిస్తూనే.. మంచి విషయాలపై అవగాహన కల్పించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి.. ఒకవైపు ప్రేమతో ఉంటూనే.. మరోవైపు వారు చెడు మార్గాల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎప్పటికప్పుడూ వారిని గమనిస్తూనే ఉండాలి..

ప్రాశ్చాత్య సంస్కృతి ప్రభావం...

మన దేశజనాభాలో 65% యువకులేనని, విదేశాల్లో పర్యటించిన ప్రతిసారి మన ప్రధాని మోడీ గర్వంగా చెప్పేవారు. వీరి మీదనే వారు ఎన్నోఆశలు పెట్టుకొని వినూత్న పథకాలు ప్రవేశపెట్టారు. వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు,కాని యువత మాత్రం, ప్రాశ్చాత్య ప్రభావంతో, వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్టాగ్రామ్, టిక్ టాక్ లాంటి,సోషియల్ మీడియాలో పీకలు వరకు కూరుకుపోయి వుంది. కరోనా లాంటి ఈ ఇంటర్ నెట్ మహమ్మారి నుండి, వీరినెలా బయటికి రప్పించాలో అర్థం కాక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. ఇలాగైతే గతంలో మహాకవి శ్రీశ్రీ గారన్నట్లు యువకులందరు వృద్దులైపోతారు, మొద్దుబారిపోతారు, ఉత్పాదక రంగాలకు ఉపయోగపడకుండా పోతారు.

కొత్తరక్తం కావాలి...

అందుకే మన స్వామి వివేకానంద  చెప్పినట్టు మన దేశ భవిష్యత్తు అంతా మన యువత మీదనే ఆధారపడి ఉన్నది, మన దేశాన్ని ప్రపంచానికే తలమాణికంగా తయారు చెయ్యాలంటే మనకు ప్రస్తుతం కొత్తరక్తం కావాలి, ఈ కరోనా  కష్టకాలంలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలన్నా, చితికిపోయిన అన్నిరంగాలు తిరిగి బలోపేతం కావాలన్నా అత్యవసరంగా మనకు ఉక్కునరాలు, ఇనుప కండరాలు, దృడసంకల్పం కలిగి, మానసికంగా శక్తివంతులైన యువత కావాలి .

తల్లిదండ్రులు చేయకూడనివి...

ఐతే తల్లిదండ్రులు వయసొచ్చిన, కాలేజీకి వెళ్ళే పిల్లల్ని తిట్టరాదు, కొట్టరాదు, భయపెట్టరాదు. బాధపెట్టరాదు,వారిని వెటకారంగా, వ్యంగంగా, ఎగతాళిగా, వెకిలిగా, పిలవరాదు. నలుగురిలో తక్కువచేసి మాట్లాడరాదు. ఉలిక్కిపడేలా, ఉక్కిరిబిక్కిరయ్యేలా, ఊపిరి ఆగిపోయేలా, దండించరాదు. నీవు వెర్రి వెంగళప్పవు. నీవొట్టి శుంఠవు. నీవు ఎందుకూ పనికిరాని ఎద్దువు, తుమ్మ మొద్దువంటూ శపించరాదు.అదిరిపోయేలా , బెదిరిపోయేలా ఆలోచనలు చెదిరిపోయేలా, గజగజ వణికేలా, గద్దించరాదు. దీనంగా ,దిక్కులుచూసేలా, కుమిలిపోయేలా, కృంగిపోయేలా, ముచ్చెమటలు పట్టేలా, కఠినమైన హెచ్చరికలు జారీచేయరాదు.
 
తల్లిదండ్రులు చేయాల్సినవి..

నిజానికి,వయసులో వున్న పిల్లలతో తల్లిదండ్రులు స్నేహితులుగా మెలగాలి, బుజ్జగించాలి, బుద్దిచెప్పాలి. ప్రేమతో పలకరించాలి. చిరునవ్వుతో దగ్గరకు తీసుకోవాలి. చేతిలో చెయ్యి వేసి భుజం తట్టాలి. ముందుకు నెట్టాలి.సాన పట్టాలి. క్తత్తిలా పదును పెట్టాలి.నీతిని,నిజాయితీని నిస్వార్థాన్ని, మధురమైన మానవీయ విలువలల్ని, ఉక్కు సంకల్పాన్ని, నూరిపోసి అన్ని ఆయుధాలనందిచి, ఆశీర్వదించి,శూరుల్లా వీరుల్లా యుద్దానికి సిద్ధంచేయాలి.

వీరులు శూరులు విశ్వవిజేతలు....

అప్పుడే వీరు ,ప్రపంచ రికార్డుల్ని బద్దలు చేయగలరు. వేడినెత్తురు సలసల పొంగే ఈ యువకిశోరాలు, ఈ అగ్గిరవ్వలు, దూకమంటే అగ్నిగుండంలో దూకేస్తారు. ఎక్కమంటే ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కేస్తారు. దాటమంటే సప్తసముద్రాలనే దాటేస్తారు. రాకెట్లలా, రామబాణాల్లా దూసుకు పోతారు. రాళ్ళలో రత్నాలై, మట్టిలోమాణిక్యాలై, రాజ్యాల నేలే రాజులౌతారు. దేశాలనేలే మహానేతలౌతారు.

భారతమాత ముద్దు బిడ్డలు...

అంతేకాదు వీరు అవలీలగా,అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు. కని,పెంచిన, కమ్మనికలలగనే అమ్మానాన్నలకు, జ్ఞానభిక్ష పెట్టిన ఆ గురుదేవుళ్ళకు, బంగరుతల్లి భరతమాతకు, అఖండ కీర్తిని ఆర్జించిపెడతారు. ముందు తరాలకు ఆదర్శమూర్తులౌతారు.చరిత్రలో చిరంజీవులుగా మిగిలిపోతారు, అప్పుడు ఈ యువతను, "శతమానం భవతీ"అంటూ అందరితో పాటు దివినుండి ఆ దేవతలు కూడా దీవిస్తారు. పుష్భాభిషేకం చేస్తారు.
...............................................................................................


పిల్లల పెంపకం.. తల్లిదండ్రుల బాధ్యత

పోలయ్య కూకట్లపల్లి 
అత్తాపూర్, హైదర్ గూడ 
హైదరాబాద్ 
91107 84502 Post a Comment

0 Comments