చరిత్రకు మనుగడ ఏదీ?


 
చరిత్రకు మనుగడ ఏదీ?
 చరిత్రకు మనుగడ ఏదీ?
చరిత్ర ఒక  సాంఘిక శాస్రం. ఎన్నో  జరిగిపోయిన విషయాలను చరిత్ర అనే గ్రంధం ద్వారా తెలుసు కుంటున్నాం.అయితే నేడు చరిత్ర అంటేనే  ఏమిటో తెలియని సందిగ్దత లో ఉన్నాం.చరిత్ర పూర్తిగా మనుగడ కోల్పోయింది. 

ఇంటర్ స్థాయి లో ఒకప్పుడు  హెచ్.ఈ.సీ గ్రూప్ అంటే విపరీతమైన డిమాండ్ ఉండేది.నేడు అది ఒక జీవచ్చవం.ఎక్కడా ,ఏ కాలేజీ లలో  హెచ్.ఈ.సీ గ్రూప్ కనపడదు. ఏవో కొన్ని ప్రభుత్వ కళాశాలలో ఒకటి,అరా తప్పితే మిగతా కాలేజీ లలో శూన్యం.హిస్టరీ లో ఎం. ఏ,పిహెచ్ డి చేసిన వారికి ఉపాధి లేకుండా పోయింది.అనేక మంది చరిత్ర పట్టా పట్టుకుని ఎందుకు కొరగాకుండా వుంటున్నారు. చరిత్ర చదివిన వారు రోడ్డు న పడ్డారు. సీ. ఈ.సీ గ్రూప్ ఉంటే చరిత్ర చదివిన వారితో  సివిక్స్ బోధిస్తున్నారు.విచిత్రం ఏమిటంటే ప్రభుత్వ కళాశాలలో హెచ్.ఈ.సీ గ్రూప్ ఉంటే, ఆ పోస్ట్ లో నియమితుడైన వ్యక్తి సివిక్స్,మరియు హిస్టరీ బోధించాలి.అంటే ఆ పోస్ట్ సివిక్స్/హిస్టరీ అయింది.ప్రస్తుత కాంట్రాక్టు అధ్యాపకులు ఇలానే బోధిస్తున్నారు. 

హిస్టరీ కి అంటూ ప్రత్యేక పోస్టులు లేవు.ప్రభుత్వం నిర్వహించే జాబ్స్ లో మాత్రమే హిస్టరీ లెక్చరర్స్ పోస్ట్స్ కనిపిస్తున్నాయి.అవి బహు స్వల్పం.మరొక విచిత్రం ఏమిటంటే సివిక్స్ చదివిన వారితోనే హిస్టరీ చెప్పిస్తారు కానీ,హిస్టరీ చదివిన వారితో సివిక్స్ చెప్పించరు. ఇలా హిస్టరీ చాలా రకాలుగా గబ్బు పట్టి పోయింది.

పాలకులు పరిపాలన లో విప్లవాత్మక మార్పులు తెస్తామని,విద్యలో సంస్కరణలు తెస్తామని బీరాలు పోయి మాట్లాడుతూ ఉంటారు. ఏ ప్రభుత్వం అయినా హిస్టరీ అధ్యాపకులు గురించి కానీ, హెచ్.ఈ సీ గ్రూప్ గురించి కానీ మాట్లాడిన పాపాన పోలేదు.ఎందుకు హెచ్.ఈ. సీ పైన అంత శీత కన్ను అర్ధం కావడం లేదు.హెచ్.ఈ.సీ తీసుకుంటే ఎందుకూ పనికి రావు అని పిల్లలను చాలా మంది చదువుకున్నవాళ్లే తప్పు దోవ పట్టిస్తున్నారు. పరిపాలనలో తన మార్కు చూపిస్తున్న ముఖ్యమంత్రి హెచ్.ఈ.సీ గ్రూప్ గురించి కానీ హిస్టరీ చదివిన వారి గురించి ఆలోచించాలి. 

కామర్స్,సివిక్స్, ఎలాగూ సీ. ఈ. సీ లోచదువుతారు.మరి హిస్టరీ? హిస్టరీ లో పట్టా పొందిన వారి పరిస్థితి ?ప్రశ్నించుకుంటే  హిస్టరీ వారు  ఉపాధి కోల్పోయినారు. కనుక హిస్టరీ ఉనికి కోల్పోకుండా ఉండాలంటే  ఎం.పీ. సీ, బై. పీ. సీ ,ఎం.ఈ.సీ గ్రూప్ లలో హిస్టరీని  మిళితం చేయాలి.వంద మార్కులు ప్రశ్న పత్రం ఉండాలి.ఇలాచేస్తే హిస్టరీ బతికి బట్ట కడుతుంది.తద్వారా ఎందరికో ఉపాధి దొరుకుతుంది.ఫలితంగా విద్యార్థుల కు కూడా  రాజుల పరిపాలన,స్వాతంత్ర  ఉద్యమాల గురించి,గొప్ప..గొప్ప భారత చక్రవర్తులు గురించి తెలుసుకుంటారు.ఇప్పటి విద్యార్థుల కు ఇవేవీ తెలియవు.ఇది చాలా శోచనీయం. నిజంగా చరిత్ర తెలియక పోతే  జీవితం వ్యర్థం . 

పాలక పక్షం వారికి నేను మనవి చేసేది ఒక్కటే అదేమిటంటే ఇంటర్ లో హెచ్.ఈ సీ గ్రూప్ చేసిన వారికి తదుపరి డిగ్రీలో హిస్టరీ(బి. ఏ) చేసిన వారికి వివిధ దేవాలయాలలో గైడ్ గా అవకాశం కల్పిస్తాం అని ప్రకటన  చేస్తే  హెచ్.ఈ.సీ గ్రూప్ కు ,డిగ్రీ లో బి. ఏ లో హిస్టరీ కి విపరీతమైన డిమాండ్ ఉంటుంది.హిస్టరీ  చదివిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి.ఈ దిశలో ప్రభుత్వం ఆలోచించ వలసిన అవసరం ఉంది.ముఖ్యంగా కార్పొరేట్ కళాశాలలో సైన్స్ గ్రూప్ లో వేల సంఖ్యలో విద్యార్థులు ఉంటారు,సెక్షన్స్ ఉంటాయి.సైన్స్ గ్రూప్ లో హిస్టరీ  ఖచ్చితంగా ఉండాలి అని  చెబితే హిస్టరీ పట్టా పొందుకున్న నిరుద్యోగులకు  ముఖ్యమంత్రి వెలుగులు పూయించినట్లే.

ఇంతవరకు వచ్చిన పాలకులు ఎవరూ  చరిత్ర పట్ల శ్రద్ధ వహించ లేదు.కనుక పాలక వర్గం వారు వివిధ మేధావులు,విద్యా వేత్తలు మొదలగు వారితో , ప్రతి పక్షం వారితో  చర్చించి ఓ సముచిత నిర్ణయం తీసుకుంటుందని ,హిస్టరీకి పూర్వ వైభవం  వస్తుందని ఆశిద్దాం.


చరిత్రకు మనుగడ ఏదీ?
 
కనుమ ఎల్లారెడ్డి
చరిత్ర,పౌరశాస్త్ర అధ్యాపకులు
93915 23027

Post a Comment

0 Comments