కవితా ప్రస్థానం- అమృత భాషణం

కవితా ప్రస్థానం- అమృత భాషణం_harshanews.com
కవితా ప్రస్థానం- అమృత భాషణం 


ఈ పుస్తకంలో ఏ కవిత ను పరిశీలించిన అందులో డా.యం రాములు గారికి సమాజం పట్ల ఉన్న అంతులేని ప్రేమ నిబద్ధత మానవత్వం అడుగడుగునా కనిపిస్తాయి.  ఒక విద్యార్థిగా గురువుగా రచయితగా ఆయన జీవితంలో వామనుడు నుండి త్రివిక్రముడుగా ఎదిగి గడించిన అపూర్వ అనుభవం ఆయన రాసిన ప్రతి అక్షరం లో మనకు సాక్షాత్కారమవుతుంది.

ఇందులో ప్రతి కవిత ఒక ఆణిముత్యమే వాటి భావాల సంక్షిప్త సమీక్ష అమ్మా నేను రాను అనే కవితలో కరోనా ఉధృతిని ఎంతో చక్కగా విశ్లేషించాడంటే  ‘నన్ను నీ కడుపులో ఉండనీయవే అమ్మ అంటూ గర్భస్థ శిశువు బాధపడుతుంటే ఆ మాతృమూర్తి నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా భయపడవద్దు బిడ్డ’ అనే మాటలు మాతృమూర్తి త్యాగాన్ని తెలియజేస్తాయి. ఇది ఎంత అద్భుతమైన భావన చూడండి. భూలోకంలో యమలోకం అనే కవితలో  ‘యముడు చిత్రగుప్తుడితో అందరూ ప్రకృతి నియమాలను అతిక్రమిస్తే వచ్చేది మరో ఉపద్రవమే’ అని హెచ్చరించడం ద్వారా మనిషి ఎంత జాగ్రత్తగా ఉండాలనేది  కవి మరోసారి హెచ్చరిస్తున్నాడు.

మూడో ప్రపంచం అనే కవితలో ‘ఆలస్యం అమృతం విషం అన్న సంగతి మరవద్దు. కరోనా ను ఎదుర్కోవడంలో నిర్లక్ష్యం పనికి రాదు’ అని కవి చక్కగా చెప్పాడు. కాకి మాట అనే కవితలో ‘మనుషుల జీవితం అయోమయం పాపం! అనడం ద్వారా మనిషి సహజత్వాన్ని కోల్పోయి కృత్రిమ జీవితాన్ని గడుపుతున్నాడని’ అద్భుతంగా చెప్పడం జరిగింది. అమ్మ అనే కవితలో ‘అమ్మ మాటలు నాకు ఇప్పుడు వరాల మూటలే అని చెప్పడం ద్వారా కవికి తన మాతృమూర్తి పట్ల ఉన్న భక్తిభావం మాతృదేవోభవ గొప్ప సూక్తిని’ గుర్తుకు తెస్తోంది.

వలస కూలీలు కవితలో  ‘కరోనా దెబ్బతో కుదేలైన బతుకులు బయటపడేదెన్నడో’  అని ప్రశ్నించడం ద్వారా కవికి ‘పీడిత తాడిత ప్రజల పట్ల ఉన్న బాధ సానుభూతి అతనికున్న సామాజిక స్పృహ’ మనకు తెలుస్తుంది. పుస్తకం అనే కవితలో ‘విజ్ఞానపు వీధుల్లో విహరింప చేసేది పుస్తకం’ అనడం ద్వారా  పుస్తకం యొక్క గొప్పతనం ఎంత అద్భుతంగా చెప్పాడో మనకు అర్థమవుతుంది. ప్రధానంగా నేటి యువతకు ఇది స్ఫూర్తిదాయకమైన కవిత అని భావిస్తాను.


మేటి గురువులు అనే కవితలో ‘కలియుగ బ్రహ్మలే గురువులు’ అని చెప్పడం ద్వారా గురువు ప్రాధాన్యతను అపూర్వంగా తెలియపరిచారు. బాల్యమా బంగారమా అనే కవితలో ‘మానవ సంబంధాలు అంటే ఇలా ఉంటాయని నేర్పింది బాల్యమే అని నేటి బాలలు విలువైన బాల్య జీవితాన్ని ఏవిధంగా కోల్పోతున్నారని’ ఈ కవిత ద్వారా చక్కగా విశ్లేషించారు.  ఆవేశము హద్దుమీరితే అనర్థాలే అని ఆవేశము కవితలో తన కోపమే తన శత్రువు అంటూ సాగే బద్దెన సుమతీ పద్య కృతిని గుర్తు చేశాడు. నేటి కాలంలో ఎంతో మంది క్షణికావేశానికిలోనై  తనువు చాలిస్తున్నారు. అటువంటివారికి అమృత గుళిక వంటిది ఈకవిత. 

బ్రతుకు భయం అనే కవితలో ‘భయం లేనిది మనిషి బ్రతుకు అగమ్యగోచరం అని చెప్పడం ద్వారా ప్రతి మనిషి భయం గుప్పిట్లో ఉన్నాడనే వాస్తవాన్ని కవి తేటతెల్లం చేశారు’ మట్టి బొమ్మలు కవితలో ‘రంగస్థలం ఏదైనా రాగద్వేషాల్లో మార్పుండదని నేడు ఏ రంగాన్ని తీసుకున్నా రాగద్వేషాలే అని అవి ఎంతో ప్రమాదమని’ ముత్యంలాంటి మాట తెలిపారు. సునామీ అనే కవితలో ‘సర్దుకుపోయే మనస్తత్వముంటే సునామీలేవైనా అన్నీ సున్నాలే అని చెప్పడం కవికి ఉన్న సహనం  ఓపిక మనకి తెలుస్తుంది’ బ్రతికించే భారతమ్మ అనే కవితలో ‘కంటికి రెప్పలా కాపాడే అమ్మ ప్రేమ నీది అని భారత మాత పట్ల తనకున్న దేశ భక్తిని కవి తెలియజేశారు’. ప్రకృతి వనరులు ఇక్కడ వరాలే అని విదేశి వ్యామోహంలో మునిగిపోతున్న నేటి సమాజానికి మన దేశ సహజ వనరులు ఉపయోగించుకుంటే ప్రపంచంలో మనకు ఎదురేమి  అంటూ జాగృతి కవితలో సందేశమిచ్చాడు.

ఇల్లాలు కవితలో ‘సమస్యలకు దూరంగా సమయస్ఫూర్తితో గృహసీమను లాలించే స్త్రీమూర్తి ఇల్లాలని స్ర్తీమూర్తిపై తనకున్న అపారగౌరవాన్ని చాటుకున్నారు’ ఈ విధంగా ఏ కవిత తీసుకున్నఒక ఆణిముత్యంలాగా అందరికి అర్థమయ్యే సహాజభాషలో  రాయడం డా. యం.రాములుగారి  రచనా శక్తికి నిదర్శనం.


ఏడుపదుల జీవితంలో కవి గడించిన అపారమైన అనుభవం సామాజిక స్పృహ ఉత్తమ సంస్కారం ఇవన్నీ ఆయన రాసిన ప్రతి అక్షరంలో మనకు సాక్షత్కారిస్తున్నాయి. నేడు సమాజాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహామ్మారిపై ఎక్కువగా తన కవితాస్త్రాన్ని ఎక్కుపెట్టి సమాజాన్ని మేలకోల్పారు. ‘ఉత్తమ సంస్కారం ఉన్నతవ్యక్తిత్వం ఉన్నవారే సమాజానికి తమ మేధాసంపత్తితో ఉత్తమ సాహిత్యాన్ని ఇవ్వగలరనడంలో అతిశయోక్తి కాదు. అటువంటి ఉత్తమ లక్షణాలు గల కవీశ్వరుడు డా.యం.రాములు గారు.’

ఇటువంటి ఉత్తమ సాహిత్యం.. సమాజచైతన్యానికి భావితరాలకు  ఆదర్శమార్గాన్నిచూపేందుకు డా.యం.రాములు గారి కలం నుండి ఏన్నో సాహిత్య రచనలు రావాలని భగవంతున్ని ప్రార్థిస్తూ... సాహిత్యపూర్వక అభినందనలతో..
                                      
కవితా ప్రస్థానం- అమృత భాషణం_harshanews.com

సమీక్షకులు
యస్.రాఘవేంద్రరావు
తెలుగు ఉపాన్యాసకుడు
ఆత్మకూర్,వనపర్తి జిల్లా 
 96767 43715 

Post a Comment

0 Comments