బంగారు బతుకమ్మ

బంగారు బతుకమ్మ_harshanews.com
 బంగారు బతుకమ్మ 


పల్లె విరిసింది పల్లె మురిసింది
ఆటపాటలతోటి పడచులా మారింది

అడవి పూలన్ని అలరారే బతుకమ్మై
సింగిడిరంగులన్ని ఇలను దిగివచ్చె
చెరువులన్ని పూలతోటలుగా మారె

ప్రపంచాన కనని ప్రత్యేక పూలదేవతయై
నవరాత్రులలో గౌరమ్మ
నవరూపాలలో దర్శనమిస్తూ..
వైభవోపేతమగు పూజలందుకుంటూ...
కరుణించి కాపాడును తల్లి కల్పవల్లియై...

పూలగోపురమల్లె  బంగారు బతుకమ్మ
ఇంతుల చేతుల్లో ఇంపుగా ఒదిగిపోయి
పట్టుచీరల రెపరెపలు నగలునాణ్యాల ధగధగలతో..
మహాలక్ష్మి రూపంలో
రమణుల వయ్యారాలతో
వీధులన్ని నిండె చేమంతులవాహినులై ...

ఉయ్యాలపాటలు కోలాటంఆటలతో
లయాత్మక చప్పట్లు విన్యాసాలతో
ఉత్సాహపు ఊయలలో ఊరేగుతూ...
పండగ సంబరాలు అంబరాలనంటగా
సాంస్కృతిక పూదోటలో
సాంప్రదాయ తళుకులొలుకుతూ
తేలిపోయెదరు ముదితసీతాకోకలు..

చెరువుగట్టుపైని ముత్తైదువలంతా గూడి
పసుపు గౌరమ్మను ప్రేమతో పంచుకుని
సత్తుపిండి నైవేద్యాలను
సకుంటుంబముగా ఆరగించి
భక్తిభావమునబతుకమ్మను  ఆడబిడ్డగను తలచి
మరలి రా... గౌరమ్మా మళ్ళొచ్చె యేడంటూ
ఆర్తిగా సాగనంపి తరలిరి తరుణిమణులంతా 
ఆశలపొదరిళ్లకు...

..........................................................................................

గీతాశ్రీ స్వర్గం
మెదక్​ జిల్లా
99088 09407

Post a Comment

0 Comments