ఆలోచనలకు పదును పెట్టేది అక్షరమే...

ఆలోచనలకు పదును పెట్టేది అక్షరమే..._harshanews.com
ఆలోచనలకు పదును పెట్టేది అక్షరమే... 


ఆరు దశాబ్దాలుగా వందలాది రచనలు ఆమె కలం నుంచి అక్షరాలుగా మారి మహిళల 
జీవితాలకు దర్పణం పట్టాయి. కథలో పాత్రలు సమాజంలోని అనేక అంశాలను పరిచయం చేస్తూ సమస్యలకు పరిష్కారాలు చూపించాయి. చిన్నతనంలో తండ్రి, పెళ్లి అయిన తర్వాత భర్త ప్రోత్సహంతో సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె మొదటి నవల సినిమాగా వచ్చింది. ఏడు పదులు దాటిన వయసులోనూ సాహిత్యంలోని వివిధ ప్రక్రియల ద్వారా పాఠకుల అభినందనలు అందుకుంటున్నారు. రాసేవారి ఆలోచనలకే కాదు చదివేవారి ఆలోచనలకు పదును పెట్టేది అక్షరమే అంటున్నా ఆమె పరిచయం..


పేరు : తమిరిశ జానకి
ఊరు : నర్సాపురం , పశ్చిమగోదావరిజిల్లా .
పుట్టినతేదీ: 26- 10- 1946
విద్య : బి.ఏ.


రచనలు చేయడం మొదలుపెట్టినది 1959 లో. హైస్కూల్లో చదువుతున్నప్పుడు చిన్నకవితలు, చిన్నకథలతో ప్రారంభం. వై.జె. అనేపేరుతో రాశాను. తర్వాత కళాశాలలో చదివేటప్పుడు కూడా స్థానిక పత్రికలలో రాశాను. అప్పుడు నాపేరు యర్రమిల్లి జానకి. పూర్తిపేరుతో  రాయకుండా  వై.జె. అనే పేరుతో రాసేదాన్ని. కళాశాలలో చదివేటప్పుడు మంజువాణి అనే పత్రికవారు అన్ని
ఊళ్ళల్లోని కళాశాలల విద్యార్ధినీ విద్యార్ధులకు నిర్వహించిన కథలపోటీలో నా కథకు బహుమతి వచ్చింది. ఆ తర్వాత వై.జానకి పేరుతో రాశాను. యువ, జ్యోతి మాసపత్రికల లోనూ, ఆంధ్రపత్రిక వారపత్రిక , చుక్కాని , భరణి, ఇల్లు ఇల్లాలు, జయశ్రీ మొదలైన అనేక పత్రికలలోనూ, ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో స్థానికపత్రికలకు కూడా  వై.జె. అనే పేరుతోనూ, వై.జానకి అనేపేరుతోనూ కథలు రాసేదాన్ని.

ఆలోచనలకు పదును పెట్టేది అక్షరమే..._harshanews.com
మామిడి హరికృష్ణతో ..

మా నాన్నగారి ఉద్యోగరీత్యా ప్రతి సంవత్సరం ట్రాన్ఫర్లు అవుతుండేవి. ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క ఊళ్ళో చదివాను. తొమ్మిదవతరగతి వరంగల్లో గర్ల్స్  హైస్కూల్లో చదివాను. బి.ఏ. మొదటిసంవత్సరం నిజామాబాద్ లో గిరిరాజ్ గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో చదివాను. మొదటిసంవత్సరం అవగానే వివాహం చేసేశారు. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా పరీక్షకు కట్టి ఇంట్లోనే నా అంతటనేను చదువుకుని హైద్రాబాద్ వచ్చి పరీక్షలు రాసి బి.ఏ. డిగ్రీ తెచ్చుకోగలిగాను.

వివాహమయ్యాక తమిరిశ జానకి పేరుతో అన్ని పత్రికలలోనూ కథలు , కవితలు , వ్యాసాలు, నవలలు రాస్తూనే ఉన్నాను. శ్రీవారి ఉద్యోగంలో ట్రాన్సఫర్లతో బీహార్, వెస్ట్ బెంగాల్ , రాజస్థాన్ , తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ లలో ఉన్నాము. అందుకే చిన్నవయసులో రాసిన కథలు ఒక్కటి కూడా భద్రపరచుకోలేకపోయాను. 1960ల్లో ప్రచురితమైనవి కూడా ఒకటిరెండు కథలు తప్ప  మిగలినవన్నీ పోయాయి. అలాగే 1970 ల్లో ప్రచురితమైన కధలు కవితలు కూడా చాలా
పోగొట్టుకున్నాను ఊళ్ళు తిరుగగతుండడం వలన. ఆరోజుల్లో జీరాక్స్ తీయించుకోడం అన్నది తెలియదు నాకు.

1971లో ఆంధ్రప్రభవారపత్రికలో సీరియల్ గా వచ్చిన నా నవల “ విశాలి “ వెంటనే సినిమాగా వచ్చింది.  ఎమెస్కోవారు నవలగా కూడా ప్రచురించారు. మళ్ళీ ఈమధ్య 2019లో ఎమెస్కో వారు విశాలి నవల రీప్రింట్  చేశారు. ఎన్నోకథలకు  బహుమతులు వచ్చాయి.  ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రచయిత్రిగా నా పరిచయం, నా కథలసంపుటి మనసిది నీకోసం పుస్తకపరిచయం ప్రసారమవడమే కాక నేను రాసిన చిన్న నాటికలు కూడా రెండు ప్రసారమైనవి. నా కథలు కొన్ని ఇమ్మని అడిగి తీసుకుని 1977 లో నామొదటి కధలసంపుటి ‘మూగమనసులు’  అరుణా పబ్లిషంగ్ హౌస్ వారు పబ్లిష్ చేశారు.
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంనుండి స్వీయకథాపఠనాలు, కవితాపఠనం ప్రసారమయ్యాయి. ఇంకా ఇప్పటికీ హైద్రాబాద్ కేంద్రం నుండి స్వీయకథాపఠనాలు చేస్తూనే ఉన్నాను. హైదరాబాద్ దూరదర్శన్ వారు ఇంటికి వచ్చి గంటసేపు ఇంటర్వూ చేసి ప్రసారం చేశారు. ఆకాశవాణి హైదరాబాద్ ,ఆకాశవాణి విజయనగరం, టి.వి.5, విస్సా టి.వి.,జాగృతి టి.వి, ఏ.టి.వి.వారు , ఆస్ట్రేలియా నుండి టోరీ రేడియో వారు, అమెరికా వెళ్ళినప్పుడు కాలిఫోర్నియాలో రేడియో లోనూ
ఇంటర్వూలు చేశారు.నా కథలపైన హైద్రాబాద్ విశ్వవిద్యాలయం విద్యార్ధిని సుమారు పది పన్నెండు సం.ల కిందట ఎమ్.ఫిల్. చేశారు.

ఆలోచనలకు పదును పెట్టేది అక్షరమే..._harshanews.com
పూలసింగిడి పుస్తకావిష్కరణలో..

రచయిత్రిగా హైద్రాబాద్ , మద్రాసు , మచిలీపట్నం , విజయవాడ , విజయనగరం, ఒంగోలు , రాజోలు, వరంగల్ మొదలైన ఎన్నో పట్టణాలలోనూ మరియు అమెరికా , కెనడాలలోనూ సన్మానాలు జరిగాయి. రెండుసార్లు తెలుగువిశ్వవిద్యాలయంవారి పురస్కారాలు లభించాయి. చెన్నయ్ కేసరికుటీరంవారి స్వర్ణకంకణం లభించింది. డా.అమృతలత గారు జీవనసాఫల్య పురస్కారం ఇచ్చి సత్కరించారు. సాహిత్య అకాడమీ సదరన్ రీజియన్ వారు చెన్నయ్ లో ఏర్పాటుచేసిన సెమినార్లో పేపర్ సమర్పించాను.
ఇప్పటివరకూ సుమారు 400 కథలు, 15నవలలు, 250 కవితలు , కొన్ని వ్యాసాలు , రెండు నాటికలు, కొందరి పుస్తకాలకి ముందుమాటలు ,సమీక్షలు రాశాను. ఇప్పటివరకూ ఎనిమిది కథాసంపుటాలు, మూడు కవితాసంపుటాలు వచ్చాయి. ఎన్నోకథా సంకలనాలలోనూ మరియు ఎన్నో కవితా సంకలనాల లోనూ నా రచనలు ప్రచురింప బడ్డాయి. కొన్ని కథలు , కొన్నికవితలు ఆంగ్లం లోకి అనువాదం చేయించాను. వివిధ పత్రికలలోనూ, వెబ్ పత్రికలలోనూ ఇప్పటికీ రాస్తూనే ఉన్నాను. సిలికాన్ ఆంధ్రావారి సుజనరంజని వెబ్ మాస పత్రిక ఎడిటోరియల్ బోర్డ్ లో ఉన్నాను. హైదరాబాద్ లో మహిత సాహితి సంస్థకు గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నాను.

ఆరు దశాబ్దాల కిందట నేను రచనలు ప్రారంభించినప్పుడు సమాజంలోని పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా తేడాలున్నాయి. ఆనాటి కథల్లో మహిళాపాత్రలు చాలావరకు ఇంటికే పరిమితం. నేడు మహిళ ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు. అయితే మహిళలు ఎదుర్కోంటున్న సమస్యలు మారలేదు.. రూపాంతరం చెందాయి. సమాజంలో వస్తున్న మార్పులను గమనిస్తూ మరింత జాగరూకతతో మహిళలు తమను తాము రక్షించుకోవాలి.

Post a Comment

0 Comments