"శంకరా --సర్వేశ్వరా"

   

"శంకరా --సర్వేశ్వరా"_harshanews.com
Image by Bishnu Sarangi from Pixabay 

"ఓం"  అని ఊపిరి పోస్తావు
"న"    అనే నమ్మకం ఇస్తావు
"మః"  అని పూజించమన్నావు
 "శి"   అంటు శివ నామము స్మరించమన్నావు
 "వా"  వాతాత్మజుడను అని అన్నావు
"య"  యద్భావం తద్భవతి అన్నావు!!
     
శివయ్య!!నీ అలంకరణే కదా సృష్టి
నీ జటాఝూటంలోని  గంగమ్మ ను
చూపి ఒద్దికగా వుండమన్నావు!!

శిరస్సున నెలవంకను ధరించుకుని
చల్లని మనస్సు తో మసలుకోమన్నావు!!

కంఠమున గరళాన్ని ఉంచి
కష్టాలని ఎదుర్కొనే సాహసం చెయ్యమన్నావు!!

 సర్పాలంకరణతో దుష్టులతో మెలగటానికి
 మెళకువలు తెలుసుకోమన్నావు!!

త్రిశూలధారివై మంచి నడవడికను
అలవర్చుకోమన్నావు!!

ఢమరుకంతో శాసించటం అభ్యసించమన్నావు!!
త్రినేత్రంతో సృష్టిని అదుపులో పెట్టమన్నావు!!

పులి చర్మధారుడవై.. మౌనంగానే ఎదగమని
ఎదిగిన కొద్దీ ఒదగమన్నావు!!

శివతాండవముతో  జగదాంబను మురిపిస్తావు
భారతీదేవి తో  వీణ ను పలికిస్తావు

బ్రహ్మదేవునిచే తాళము వేయిస్తావు
దేవేంద్రుని మురళీ గానముతో మురిపించమన్నావు

నారాయణుడి మద్దెల దరువులకు నీ తాండవముతో
భో.. శంభో.. శివ శంభో స్వయంభో.... అంటూ
కార్తీక శోభను నర్తింపచేయునట్టి శివయ్య!సర్వేశ్వరా!

ఏమి అర్ధం కాని వారికి పూర్ణలింగేశ్వరుడవు
అంతో ఇంతో తెలిసిన వారికి అర్ధనారీశ్వరుడవు
 శరణాగతి అన్న వారికి మాత్రము నీవే సర్వేశ్వరుడవు! 

"ఓం నమఃశివాయ "

.......................................................................................

"శంకరా --సర్వేశ్వరా"_harshanews.com

 టి. వి. శిరీష
(కవియిత్రి )
 96184 94909
Post a Comment

0 Comments