తాత్విక యోగి.. స్వామి వివేకానంద

Image by PDPics from Pixabay 

పోరాడండి విజయం వచ్చే వరకు అనే మాటలో సమస్య పరిష్కారం కోరకు వెనక్కు తగ్గకు అనే పిలుపు యువతని ఆకర్షించింది.ప్రతి ఒక్కరూ జాగృతమై ఉండాలి. అంటే నిద్రాణమైన జీవితంలో ఉండక మేల్కొని ముందుకు సాగాలని ప్రవచించిన మేధావి.

భారతదేశ ఆధ్యాత్మిక వేత్తలలో అసలు,సిసలైన చిరునామా స్వామి వివేకానంద. వివేకానంద అసలు పేరు నరేంద్ర నాధ్ దత్త.1863 జనవరి 13 జన్మించాడు. అపారమైన మేధాసంపత్తి కలవాడు. రామకృష్ణ పరమ హంస శిష్యుడిగా, రామకృష్ణ మఠం స్థాపించి అనేకమందిని ఆధ్యాత్మిక వైపు నడిపించిన యోగి పుంగవుడు. అసలైన జ్ఞానం వ్యక్తి నడవడిలో ఉంటుంది, మాట తీరులో ఉంటుంది. ఎంతోమంది ని తన సమ్మోహన శక్తి తో చైతన్యం చేసిన గొప్ప యోగి వివేకానంద స్వామి. ఆయన సూక్తులు నేటి యువతకు ఎంతో ఆదర్శం, ఆచరణీయం. ప్రపంచ మత సమ్మేళనం లో అమెరికాలోని చికాగోలో ఆయన నోటినుంచి వచ్చిన మాట " నా సోదర సోదరిమణులారా" ఈ ఒక్క మాటతో చప్పట్ల తో సభా ప్రాంగణం అంతా దద్దరిల్లింది. అప్పటి నుండి ఈ మాట వాడుకలోకి వచ్చింది. దేశ,విదేశాల్లో తన వాగ్దాటితో ఎందరినో తన మార్గం వైపు తిప్పుకున్న మహనీయుడు. .వివేకానందుని కన్న ఈ గడ్డ ఎంతో పుణ్యమైంది,పునీతమైంది. మనిషిలో నిండు దనం, శాంతవదనం, మూర్తీభవించిన రూపం ,ప్రేమ, దయ, జాలి, కరుణ, అనురాగం కలయికే స్వామి వివేకానంద. ఆయన బోధనలు నేటి యువతకు ఎంతో అవసరం. 
 
జీవితం అంటేనే  ఆటు పోట్లు,జయాలు, అపజయాలు సర్వసాధారణం. అపజయం వచ్చినప్పుడు క్రుంగి పోక, విజయమే లక్షంగా సాగిపో.అపజయం పొందిన ప్రతి సారి సముద్ర కెరటాన్ని ఆదర్శంగా తీసుకో. కెరటం లేచి పడుతున్నందుకు కాదు. పడిన కూడా లేస్తున్నందుకు అని యువకులకు ఉద్బోధించిన వ్యక్తి. 

దేశంలో భారత యువత నిర్వీర్యం కాకుండా వారిలో దేశభక్తి,హిందూధర్మం గురించి ప్రబోధించిన ప్రబోధ కర్త. ఆయనలో ఉన్న మంచి విశిష్ట గుణం మహిళలను మర్యాదగా గౌరవించడం. తన కన్న చిన్న మహిళనైన వారు ఎంతో వినయంగా పలకరించే వారు,గౌరవించే వారు. మహిళలు మనకు మణి దీపాల వంటివారు . వారి ప్రేమ,అనురాగం ఎనలేనివి.వారి పట్ల ఎప్పుడు గౌరవ మర్యాదాలతో నడుచుకునే వారు.ఎంత చిన్నవారై న "మీరు " అనే సంభోధన ఆయన నుండి వచ్చిందే.

1897 లో స్థాపించిన రామకృష్ణ మఠం ద్వారా ఎందరికో ఆధ్యాత్మిక భావాలు పంచారు.మఠం ఆదర్శం, నిబద్ధత అంత ఒక పద్ధతి ప్రకారం జరిగేది.మఠం ద్వారా ఒక క్రమశిక్షణ వ్యక్తులలో కలిగించారు. ఆయన రచనలలో 'రాజ యోగ' , కర్మ యోగ, భక్తి యోగ,జ్ఞాన యోగ మొదలైనవి. వీటిలో భక్తి యోగ  చాలా విశిష్ట మైన గ్రంధం. నిజమైన భక్తి ఎలా తెలుసుకోవాలో విశదీకరించారు. ఆయన రచనలలో ఎక్కువగా ఆధ్యాత్మికత ఉట్టి పడుతూ ఉంటుంది.తన భక్తి,జ్ఞాన మార్గం ద్వారా ఎందరో శిష్యులు అయ్యారు. శిష్యులలో విరాజానంద, స్వామి పరమానంద,, స్వామి సదానంద మొదలగువారు. సిస్టర్ నివేదిత ఆయన శిష్యులలో ఒకరు. విదేశీయురాలైన ఆమె భారత్ లోనే స్థిరపడింది. ఆయన చూపిన మార్గంలో వేదాంత,యోగ తత్వ  శాస్త్రములలో సమాజం పై ప్రభావం కలిగించిన ఆధ్యాతిక వేత్త  వివేకానందులు.

పిన్న వయసులోనే స్వచ్చమైన భావాలు,పవిత్రమైన ఆలోచనలు ఆయనను ఎంతో ఎత్తుకు తీసుకు వెళ్ళాయి. స్వామి బోధనలు విని ప్రభావితులైన వారిలో మహాత్మాగాంధీ, ఆరోబిందో,సుభాష్ చంద్రబోస్ మొదలగు వారు. ఇలా ఎందరో చైతన్యం పొందారు. భారతదేశ ఖ్యాతిని, భారత సంప్రదాయం విశ్వానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన సూక్తులు ప్రతి ఒక్కరికి విజ్ఞాన దివిటీల వంటివి.

" మీకు సాయం చేస్తున్న వారిని మరువకండి, మిమ్మును ప్రేమిస్తున్న వారిని ద్వేషించకండి, మిమ్మల్ని నమ్ముతున్న వారిని మోసం చేయకండి " ఈ  సూక్తి నేడు ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకుని ఆచారించాలి,పాటించాలి.మోసం, ద్వేషం,పగ వ్యక్తి పతనానికి కారణాలు. వాటిని ప్రక్కకు పెట్టి వ్యక్తులలో పరోపకారం ఉండాలని మంచితనం, మంచిపేరు తెచ్చుకోవాలంటే ఎంతో కష్ట పడాలని,అదో తపస్సు వంటిదని నిత్య జీవిత సత్యాన్ని చెప్పిన మేధావి.

ఆయన ఆశయాలకు అనుగుణంగా భారత ప్రభుత్వం 1984 వ సంవత్సరం నుంచి జాతీయ యువ జన దినోత్సవం గా ప్రకటించింది. ఇటువంటి గొప్ప తాత్వికుడు,అపారజ్ఞాన పటిమ ఉన్న వ్యక్తి  39 సంవత్సరాలకే స్వర్గస్తులు కావడం దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి లోటు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఆ తాత్విక  యోగికి ముకుళిత హస్తాలతో  నివాళి సమర్పిద్దాం.
.......................................................................

కనుమ ఎల్లారెడ్డి
93915 23027

Post a Comment

0 Comments